
నెల్లూరు, మార్చి 17,
జగన్‌ను ఒకప్పుడు వైసీపీ నేతలు ఎంతో అభిమానించేవారు. జగన్ మాటకు కనీసం ఎదురు చెప్పేవారు కారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. అధినేత తీరుపై నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ లబ్ధి చేకూరే విషయాల్లోనూ జగన్ నిర్లక్ష్యంగా ఉంటున్నారని.. ఇలాగైతే కష్టమే అని అంటున్నారు వైసీపీ చీఫ్ జగన్ రాజకీయ వ్యూహాలు పక్కాగా ఉంటాయని.. ప్రత్యర్థులు పసిగట్టలేరని 2024 ఎన్నికలకు ముందు ఆ పార్టీ నేతలు ధీమాగా ఉండేవారు. కానీ.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత.. ఆ నమ్మకం పోయింది. దీంతో చాలామంది నేతలు తమదారి చూసుకున్నారు. ఇతర పార్టీల్లోకి వలస వెళ్లారు. అయినా జగన్ తీరులో మార్పు లేదని.. సొంత పార్టీ నేతలే చెబుతున్నారు ఎల్లప్పుడూ జగన్ వెన్నంటే ఉండే నాయకులు వెళ్లిపోయినా.. జగన్ పెద్దగా పట్టించుకోలేదు. కనీసం వద్దని చెప్పినట్టు కూడా వార్తలు రాలేదు. పైగా వారిపై సోషల్ మీడియాలో దాడి పెరిగింది. దీనిపైనా వైసీపీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో ఓడిపోవడం, లీడర్లు వెళ్లిపోవడం సంగతి ఎలా ఉన్నా.. రాజకీయంగా లబ్ధి చేకూరే విషయాల్లోనూ జగన్ తీరు మారడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రతిపక్ష నేత హోదా కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అసెంబ్లీకి వెళ్లకుండా మీడియా ద్వారా ప్రశ్నిస్తానని జగన్ స్పష్టం చేశారు. అయితే.. ఇది సరికాదని కొందరు నేతలు జగన్‌కు చెప్పే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ప్రజల తీర్పును గౌరవించి.. అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీయాలని, గత ప్రభుత్వంపై జరిగే దాడిని ఎదుర్కొవాలని నేతలు చెప్పినట్టు సమాచారం. అయినా జగన్ పెద్దగా పట్టించుకోలేదని తెలిసింది. గతంలో చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల దాడి తీవ్రంగా ఉండేది. అయినా చంద్రబాబు సభకు వచ్చి తన బాధ్యతను నిర్వర్తించారు. హద్దులు దాటి ప్రవర్తించిన కారణంగా శపథం చేసి బయటకొచ్చారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెట్టారు. చంద్రబాబును ఆ స్థాయిలో కించపరిచారు కాబట్టే.. ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరిగింది. కానీ.. జగన్ ఆ అవకాశాన్ని వదులుకున్నారు' అని కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు'తో మాట్లాడుతూ చెప్పారు. ప్రస్తుతం జగన్ కేసీఆర్‌తో పోల్చుకుంటున్నారు. ఆయన కూడా అసెంబ్లీకి వెళ్లడం లేదు అని. కానీ.. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి వేరు. ఇక్కడ జగన్ పరిస్థితి వేరు. తెలంగాణలో కేసీఆర్‌పై ఈగ కూడా వాలకుండా.. హరీష్ రావు, కేటీఆర్ చూసుకుంటారు. ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఇక్కడ జగన్‌కు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వం దాడిని ఒక్క జగన్ మాత్రమే ఎదుర్కొవాలి. కేసీఆర్ లాంటి సైన్యం జగన్‌కు లేదు' అని ఏలూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెప్పారు.'ప్రభుత్వం నుంచి ఎదురయ్యే అవమానాలు భరించినప్పుడే ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. జగన్ కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకున్నారు. అవతలి నుంచి వచ్చే దాడిని సరైన పద్ధతిలో ఎదుర్కోలేదు. అవాస్తవాలు ప్రచారం చేసినా.. జగన్ సరిగా తిప్పికొట్టలేదు. ఫలితంగానే ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం అయ్యాం. ప్రస్తుతం ప్రభుత్వంపై అంత వ్యతిరేకత లేదు. భవిష్యత్తులో చెప్పలేం. కానీ.. కొన్ని లోపాలు ఉన్నాయి. వాటిని వాడుకోవడంలో మా పార్టీ విఫలం అవుతోంది' అని ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్ నేత చెప్పారు'ఇప్పుడు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటాలు చేసే అవకాశాలు తక్కువ. కానీ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ జగన్‌కు మంచి ఆయుధం. బడ్జెట్‌పై మీడియాలో మాట్లాడటం కంటే.. అసెంబ్లీలో మాట్లాడటమే మంచిది. సభ లోపల అవకాశం లేకపోతే.. మీడియా పాయింట్ దగ్గర అయినా మాట్లాడొచ్చు. కానీ ఆయన ఆ పని చేయలేదు. సంక్రాంతి నుంచే ప్రజ్లలోకి వస్తానన్నారు. ఇప్పటికీ రాలేదు. అటు మున్సిపాలిటీల్లో టీడీపీ ఆధిపత్యం పెరుగుతోంది. మా పార్టీ కేడర్‌లో నమ్మకం సన్నగిల్లుతోంది. కేవలం జగన్‌పై అభిమానం ఉన్నవారే పార్టీలో ఉన్నారు. ఇకనైనా వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్‌పై ఉంది' అని గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ చెప్పారు.