YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వర్మ త్యాగంపై సోషల్ మీడియాలో ఫైట్

వర్మ త్యాగంపై సోషల్ మీడియాలో ఫైట్

కాకినాడ, మార్చి 17,
జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడు పిఠాపురంలో జరిగిన సమావేశం తర్వాత రాష్ట్రంలో కూటమిలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య గ్యాప్ పెరిగింది. పిఠాపురం వేదికగా చేసిన వ్యాఖ్యలు రెండుపార్టీల క్యాడర్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి ఏర్పడింది. పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య కెమెస్ట్రీ బాగానే ఉన్నప్పటికీ క్యాడర్ మాత్రం పూర్తిగా ఈ సభ తర్వాత విడిపోయినట్లే కనిపిస్తుందని సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చూస్తుంటే అర్థమవుతుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఎవరి వల్ల గెలుపు అనే అంశంపై తమకు తోచినట్లు పెడుతున్న కామెంట్స్ కాక రేపుతున్నాయ్. జయకేతనం సభలో పవన్ కల్యాణ్ తో పాటు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఉష్ణోగ్రతల కంటే గరిష్టంగా హీట్ ను రెండు పార్టీలలో పుట్టించిందనే చెప్పాలి. నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశాన్ని తానే నిలబెట్టానని పవన్ కళ్యాణ్ అన్న కామెంట్లు, వర్మను ఉద్దేశించి నాగబాబు పరోక్షంగానే చేసిన కామెంట్ల పైనే ఇప్పుడు సోషల్ మీడియాలో తమ్ముళ్లు బాధపడిపోతున్నారు. తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నలభై ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఒకరు నిలబెట్టేదేంటని ప్రశ్నిస్తున్నారు. తమకు 175 నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు, క్యాడర్ బలంగా ఉందని, జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. ఈ విషయాలు తెలియకుండా మాట్లాడితే ఊరుకోబోమంటూ ఒకరకంగా వార్నింగ్ లు ఇచ్చినట్లే వారి కామెంట్స్ కనపడుతున్నాయి జనసేన క్యాడర్ కూడా ధీటుగానే సమాధానం ఇస్తుంది. నిజానికి జైల్లో ఉన్న చంద్రబాబును పవన్ కల్యాణ్ పరామర్శించడం దగ్గర నుంచి కూటమి ఏర్పాటు వరకూ ఆయన చేసిన కృషిని మరిచిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కష్టకాలంలో ఉన్న టీడీపీని పవన్ కల్యాణ్ ఆదుకున్న విషయాన్ని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందేనని, ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని నిలదీస్తున్నారు. తాము కష్టపడి పనిచేయడం, తక్కువ సీట్లకే పోటీ చేయడం, ఉభయ గోదావరి జిల్లాల్లో తమకు పట్టున్నా ఓటు చీలకుండా కూటమి గెలుపునకు కారణం ఎవరనివారు సోషల్ మీడియా వేదికగా అంటున్నారు. దీంతో .. కూటమి మధ్య అగాధం ఏర్పడుతుందనే ఆందోళన ఇరు పార్టీల నేతల్లో కనిపిస్తుంది. నాగబాబు విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోకపోయినా.. వర్మ చేసిన త్యాగాన్ని ఆయన కించపర్చడం ఏంటని టీడీపీ క్యాడర్ గుర్రుగా ఉంది. గతంలో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎవరికి ఎన్ని ఓట్ల శాతం వచ్చాయో తెలుసుకుంటే బాగుంటుందని కూడా సూచిస్తున్నారు. కూటమి అంటే కలసి పోటీ చేయడం, కలసి పనిచేయడమేనని, అంతే తప్ప ఏ ఒక్కరి వల్లో విజయం సాధ్యం కాదని, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని భావించి జనం ఓట్లేశారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇదే సమయంలో జనసేన ను కించపరిస్తే నష్టపోయేదే మీరేనంటూ జనసైనికులు కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద జయకేతనం సభ మాత్రం రెండు పార్టీల క్యాడర్ లో గ్యాప్ మాత్రం బాగానే కనిపిస్తుంది. ఇద్దరూ సంయమనం పాటిస్తేనే మంచిదని, లేకుంటే ఇరువురికి నష్టమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది.

Related Posts