
హైదరాబాద్
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన మ కేసును హైకోర్టు కొట్టివేసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై 2024 డిసెంబర్లో కేసు నమోదు అయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా, కనీసం విచారణ కూడా చేయకుండా పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని, తనపై కుట్రపూరితంగా తప్పుడు కేసు నమోదు చేశారని హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు కోర్టులో సాగిన సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు గురువారం తుదితీర్పును వెలువరించింది. హరీష్ రావుపై నమోదు చేసిన కేసులో ఎలాంటి ఆధారాలు లేని కారణంగా కేసును కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికి కేసులతో వేధించాలనుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇది ఒక గుణపాఠమని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు.