YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒంటరిగా మిగిలిపోతున్న అరవింద్

 ఒంటరిగా మిగిలిపోతున్న అరవింద్
అరవింద్ కేజ్రీవాల్….ఉన్నతాధికారి నుంచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. బ్యూరోక్రాట్ నుంచి పొలిటికల్ లీడర్ గా ఎదిగిన కేజ్రీవాల్ పాలనాపరంగా ఇబ్బందులు తొలి నాటి నుంచి ఎదుర్కొంటున్నారు. పేరుకు ముఖ్యమంత్రి కాని అంతా లెఫ్ట్ నెంట్ గవర్న్ చేతిలో అధికారాలు ఉండటాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకనే మూడు రోజులుగా లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఇంటివద్ద ఆందోళన నిర్వహిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రోజులుగా ఆందోళన చేస్తుంటే ఆయనకు కనీసం విపక్షాలు మద్దతు తెలపక పోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్… తన సహచర మంత్రులతో కలిసి… లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలోమూడు రోజులుగా ధర్నా చేస్తున్నారు. దీనికి కారణం.. ఐఏఎస్ అధికారులు నాలుగు నెలలుగా.. ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి పనులు చేయడం లేదు. అంటే వారు దాదాపుగా సమ్మెలో ఉన్నారు. ఫిబ్రవరిలో ఢిల్లీ సీఎస్ అనుష్ ప్రకాష్‌తో కేజ్రీవాల్ కు వివాదం ఏర్పడింది. ఆప్ ఎమ్మెల్యేలు ఆయనపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పటి నుండి ఐఏఎస్‌లు కేజ్రీవాల్ సర్కార్‌కు సహాయ నిరాకరణ చేస్తున్నారు. అధికారుల తీరుపై కేజ్రీవాల్ చాలా సార్లు లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసినా.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దాంతో కేజ్రీవాల్… ఆయన మంత్రి వర్గ సహచరులు.. లెఫ్టివెంట్ గవర్నర్‌ను కలవడానికి వచ్చి… అదే ఆఫీసులో బైఠాయించారు.అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి….ఢిల్లీలో అధికారంలో చేపట్టి పెద్ద సంచలనమే సృష్టించారు. అప్పటి వరకూ కాంగ్రెస్ చేతిలో ఉన్న ఢిల్లీ రాష్ట్ర పీఠాన్ని కేజ్రీ అందుకున్నారు. ఆయన బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ తో జట్టు కడితే వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది ఉందని ఆయన హస్తం పార్టీకి దూరంగానే ఉంటూ వస్తున్నారు. మరోవైపు బీజేపీని మాత్రం వదలడం లేదు. అవకాశమొచ్చినప్పుడల్లా బీజేపీపైనా, ప్రధాని మోడీపైనా ట్విట్టర్ వేదికగా విరుచుకుపడుతూనే ఉన్నారు.అయితే వరుసగా తనపైనా, తనమంత్రి వర్గ సహచరులపైనా ఏసీబీ, ఈడీ దాడులు జరుగుతుండటాన్ని ఆయన తప్పుపడుతున్నారు. లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేతిలో ఉన్న ఏసీబీ, మోడీ చేతిలో ఉన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దాడులతో తమను బెదిరించాలని చూస్తున్నారన్నది కేజ్రీవాల్ ఆరోపణ. తనను పాలన సజావుగా చేయకుండా ఎప్పటికప్పుడు లెఫ్ట్ నెంట్ గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ ప్రజలకు రేషన్ సరుకులను నేరుగా వారి ఇంటి వద్దకే చేర్చాలన్న ఒక పథకాన్ని రూపొందించుకున్నారు. దీనివల్ల ప్రజలు రేషన్ షాపులు చుట్టూ తిరగకుండా నేరుగా ఇంటివద్దకే అందించాలన్న కేజ్రీ లక్ష్యాన్ని లెఫ్ట్ నెంట్ గవర్నర్ నీరుగార్చారు. కొద్దినెలలుగా ఆమోదం పొందకుండా కోల్డ్ స్టోరేజీలో పడేశారు. ఇదే అంశంపై మాట్లాడేందుకు తన ఇంటివద్ద సమావేశం ఏర్పాటు చేస్తే అప్పట్లో చీఫ్ సెక్రటరీపై దాడి కేసు ఆప్ నేతలపై నమోదయిన సంగతి తెలిసిందే. ఫైలు క్లియర్ చేయకుండా తమను లక్ష్యాలకు చేరుకోకుండా, ప్రజలకు సుపరిపాలన అందించడానికి వీల్లేకుండా ఎల్జీ వ్యవహరిస్తున్నారని ఆయన అభియోగం. అంతేకాదు నాలుగు నెలలుగా ఢిల్లీలోని ఐఏఎస్ అధికారులు విధులను బహిష్కరించి ఆందోళన చేస్తున్నా ఎల్జీ పట్టించుకోవడం లేదు. కనీసం సమ్మె విరమణకు ప్రయత్నాలు చేయలేదు. ఇందుకోసమే కేజ్రీవాల్ చివరకు ముఖ్యమంత్రి హోదాలో ధర్నాకు దిగారు. ఇటీవలే కేజ్రీవాల్ కర్ణాటకలోని కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయి విపక్ష నేతలతో చేతులు కలిపి వచ్చారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి అధికారులకూ మధ్య వివాదాలు ఏర్పడుతూనే ఉన్నాయి.ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కోసం కేజ్రీవాల్ పోరాడుతున్నారు. బీజేపీ కూడా ఢిల్లీకి రాష్ట్రప్రతిపత్తి కల్పిస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చింది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడంతో… ఈ అంశాన్ని మోదీ సర్కార్ పూర్తిగా లైట్ తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ అధికారం లేకపోవడంతో… రాష్ట్ర ప్రతిపత్తి కోసం కేజ్రీవాల్… కేంద్రంపై పోరాటం ప్రారంభించారు. తామే ఓ ముసాయిదా బిల్లు రూపొందించి .. ప్రజల నుంచి సూచనలు సలహాలు తీసుకున్నారు. కానీ భారత రాజ్యాంగం ప్రకారం చట్టాన్ని రూపొందించి ఆమోదించే అధికారం ఒక్క పార్లమెంటుకే ఉందని కేంద్రం స్పష్టం చేసింది. దాంతో అది చట్టం వరకూ వెళ్లలేదు.తనకు ఉన్న పరిమిత అధికారాలతో… కేజ్రీవాల్… ప్రజలకు ఉపయోగపడేలా మొహల్లా క్లీనిక్‌లు, మంచినీరు, కరెంట్ చార్జీల తగ్గింపు వంటి అంశాల్లో కాస్తంత మంచి పేరు ప్రజల్లో తెచ్చుకోగలిగారు. కానీ ఇప్పుడు ఆ పనులను కూడా… ఐఏఎస్ అధికారులను పని చేయకుండా చేసి… అడ్డుకుంటున్నారన్న విమర్శలు కేంద్రంపై వస్తున్నాయి. రాజకీయాలు చేయడంలో రాటుదేలిపోయిన ఎన్డీఏ గవర్నర్ల జాబితాలోకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కూడా వస్తారు. కాబట్టి.. కేజ్రీవాల్‌కు ముఖ్యమంత్రి అయినా ధర్నాలు తప్పడం లేదు.

Related Posts