YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

దేవాదుల... ఇలా అయితే ఎలా...

దేవాదుల... ఇలా అయితే ఎలా...

వరంగల్, మార్చి 24, 
దేవాదుల ప్రాజెక్ట్ పనులు ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. దేవన్నపేట పంప్ హౌజ్ లోని మోటార్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వీటిని ఆన్ చేసేందుకు టెక్నికల్ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరోవైపు జనగామ జిల్లాలో చాలావరకు పంటలు ఎండిపోతుండటంతో రైతుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది.దేవాదుల ప్రాజెక్టు థర్డ్ ఫేజ్ లో భాగంగా హనుమకొండ జిల్లా దేవన్నపేట వద్ద నిర్మించిన పంప్ హౌజ్ ఓపెనింగ్ పనులు రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ గా మారాయి. ఓ వైపు కరువు పరిస్థితుల నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంటలు ఎండిపోతుండగా.. దేవన్నపేట పంప్ హౌజ్ లోని మూడు మోటార్లలో ఒకదానిని ప్రారంభించి, అత్యవసరంగా సాగునీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్లాన్ చేసింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇతర నేతలు ఒక మోటార్ ను ప్రారంభించేందుకు అక్కడికి వెళ్లారు. కానీ మోటార్లు, పంపింగ్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా మోటార్ ను ఆన్ చేయలేకపోయారు. దీంతోనే సాంకేతిక లోపాన్ని సవరించేందుకు ఆస్ట్రియా దేశం నుంచి ప్రత్యేక టీమ్ ను సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ రప్పించింది. దాదాపు ఐదు రోజులుగా టెక్నికల్ టీమ్ తలపడుతున్నా.. ఇంతవరకు మోటార్ ఆన్ కాకపోవడంతో ప్రభుత్వ పెద్దలు కూడా తలలు పట్టుకోవాల్సి వస్తోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2004లో రూ.6016 కోట్ల అంచనా వ్యయంతో జువ్వాడి చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు ప్రారంభించింది. కానీ ఆ తరువాత ప్రభుత్వం మారిపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్సార్ పీరియడ్ లో దేవాదుల ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ఈ మేరకు వైఎస్సార్ హయాంలోనే దేవాదుల ప్రాజెక్ట్ ఫస్ట్, సెకండ్ ఫేజ్ పనులు పూర్తయ్యాయి. కాగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో 6.21 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు చేపట్టిన థర్డ్ ఫేజ్ పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.తెలంగాణ ఏర్పడిన తరువాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు పదేళ్ల కాలం పాటు దేవాదుల థర్డ్ ఫేజ్ పనులు నత్తనడకన సాగగా.. ఇప్పుడిప్పుడే చివరి దశకు చేరుతున్నాయి. కాగా థర్డ్ ఫేజ్ కింద ములుగు జిల్లా రామప్ప చెరువు నుంచి హనుమకొండ జిల్లా ధర్మసాగర్ వరకు రూ.1410 కోట్లతో టన్నెల నిర్మాణం చేపట్టారు. మొదట 54.88 కిలోమీటర్ల మేర దీనిని తవ్వాలని నిర్ణయించగా.. ఈ మేరకు హెచ్సీ, మెయిల్ కంపెనీలు జాయింట్ వెంచర్ లో పనులు దక్కించుకున్నాయి. అనంతరం సబ్ లీజ్ పై కోస్టల్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు పనుల బాధ్యతను అప్పగించారు.వాస్తవానికి ఈ టన్నెల్ పనులు కూడా 2011 డిసెంబర్ నాటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం చలివాగు ప్రాజెక్టు వద్ద టన్నెల్ కు బుంగపడి లోపలికి నీళ్లు చేరడంతో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, బీఆర్ఎస్ సర్కార్ పనులను కోస్టల్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నుంచి మేఘా సంస్థకు అప్పగించడంతో అప్పటి నుంచి పనులు ఆగుతూ సాగుతూ నడుస్తున్నాయి.దేవాదుల ఎత్తిపోతల ఎత్తిపోతల పథకం థర్డ్ ఫేజ్ లో భాగంగా హసన్ పర్తి మండలం దేవన్నపేట వద్ద పంప్ హౌజ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఏళ్ల తరబడి ఆగుతూ సాగుతూ వచ్చిన పనులు ఎట్టకేలకు చివరి దశకు ఉన్నాయి. ఈ పంప్ హౌజ్ వద్ద రెండు షాఫ్ట్ లు నిర్మించారు. అందులో ఒక దాంట్లో వాటర్ స్టోరేజీ చేసి, రెండో దాని నుంచి మూడు మోటార్ల ద్వారా నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు పంప్ హౌజ్, సర్జ్ పూల్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి.భూగర్భ జలాలు ఎండుతుండటం, వేసవి ప్రభావం వల్ల జనగామ జిల్లాలో చాలావరకు పంటలు ఎండిపోతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్ట్ థర్డ్ ఫేజ్ లోని దేవన్నపేట పంప్ హౌజ్ వద్ద పనులు పూర్తయిన ఒక మోటార్ నైనా ప్రారంభించాలని నిర్ణయించుకుంది రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక హెలీక్యాప్టర్ లో వచ్చి, స్థానిక స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇతర నేతలతో కలిసి పంప్ హౌజ్ లో మోటార్ ను ప్రారంభించేందుకు ప్రయత్నం చేశారు. కానీ సాంకేతిక లోపం కారణంగా మోటార్ ఆన్ కాలేదు. దీంతో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సుమారులో దేవన్నపేట పంప్ హౌజ్ వద్దకు చేరుకున్న మంత్రులు.. అక్కడే చాలాసేపు చూశారు. ఎంతకూ మోటార్లు ఆన్ కాకపోవడంతో ఎలాగైనా మోటార్లు ఆన్ చేశాకే వరంగల్ నుంచి వెళ్తామంటూ మంత్రులు హనుమకొండలోని నిట్ గెస్ట్ హౌజ్ కు చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు వేచి చూసి, మరోసారి పంప్ హౌజ్ ను విజిట్ చేశారు. కానీ ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి అక్కడి నుంచి వెనుదిరిగి హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు.దేవాదుల పంప్ హౌజ్ ను స్కాడా సిస్టంలో ఏర్పాటు చేస్తున్నారు. మోటార్లు, పంపింగ్ వ్యవస్థకు లింకప్ గా ఉండే ఈ స్కాడా సిస్టం ఎప్పటికప్పుడు నీటి ప్రవాహం, మోటార్ల పనితీరును అబ్జర్వ్ చేస్తుంది. అందులో ఏమైనా లోపాలు తలెత్తితే వెంటనే ఈ స్కాడా సిస్టం సంకేతాలు ఇస్తుంది. ఫలితంగా రూ.కోట్లు విలువ చేసే మోటార్లకు నష్టం వాటిల్లే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.కాగా ఈ స్కాడా సిస్టంలో సాంకేతిక లోపాలు తలెత్తడం వల్లే దేవాదుల మోటార్లు ఆన్ కావడం లేదు. దీంతో కాంట్రాక్ట్ సంస్థ మోటార్లను తెప్పించి, ఆస్ట్రియా దేశం నుంచి ప్రత్యేకంగా టెక్నికల్ టీమ్ ను కూడా రప్పించింది. దీంతో దాదాపు 14 మందితో కూడిన ఆ టెక్నికల్ టీమ్ సాంకేతిక లోపాన్ని సవరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే దాదాపు ఐదు రోజులుగా శ్రమిస్తుండగా.. ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.ఓ వైపు పంటలు ఎండుతుండగా, దేవాదుల పంపులను ఆన్ కాకపోవడం వల్ల రాష్ట్ర సర్కారు చిక్కుల్లో పడినట్లయ్యింది. ఈ మేరకు దేవన్నపేట పంప్ హౌజ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి, సమస్యను పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు మంత్రులు కూడా వాకబు చేస్తున్నారు. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో దేవాదుల నీటిని విడుదల చేస్తామని చెబుతున్నారు. మరి ఈసారైనా పంపులు ఆన్ అవుతాయో లేదా మొన్నటిలాగే మొరాయిస్తాయో చూడాలి.

Related Posts