
అర్హులైన వారికి ఇళ్ళు, పట్టాలు, రిజిస్ట్రేషన్ లు, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం నేతలు విజయవాడ కార్పొరెషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం ఎపి కార్యదర్శి పి.మధు, సిపిఎం నేతలు సిహెచ్.బాబూరావు, డివి.క్రుష్ణ, దోనేపూడి కాశీనాధ్, పార్టీ నేతలు పాల్గోన్నారు. వేలాది సంఖ్యలో నగరవాసులు ముట్టడి కార్యక్రమంలో పాల్గోన్నారు. సిపిఎం ఎపి కార్యదర్శి పి.మధు మాట్లాడుతూ టిడిపి నాలుగేళ్ళ కాలంలో కొన్ని వేల ఎకరాల భూములను కాజేసింది. టిడిపి పాలన అంతా బడాబాబులకు మేలు చేస్తూ పేదలకు మాత్రం మొండిచేయి చూపిందని ఆరోపించారు. పేదలకు టిడిపి పాలనలో నలుగురికైనా ఇళ్ళు కేటాయించిందా? విజయవాడలో నిత్యవసర వస్తువుల ధరలు, ఇంటి అద్దెలు పెరిగిపోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలు అల్లాడిపొతున్నారని అన్నారు. జక్కంపూడిలో ఇళ్లు ఇస్తామని చెబుతున్నారు. ఇంతకీఆ జక్కంపూడి ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. రేపు అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడతాం. ఇళ్ళు, ఇళ్ల స్ధలాలు ఇస్తారా లేకపోతే విజయవాడ బంద్ పాటించమంటారా చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. పేదలకు ఇళ్ళిచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.