
హైదరాబాద్, ఏప్రిల్ 10,
నాగార్జున సాగర్ ప్రాజెక్టులో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పులు కురిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలపాటు నీటి వాటలో ఎటువంటి వివాదం లేకుండా పంపకాలు జరిగాయి. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే పరిస్థితి కొనసాగింది. అటు జగన్,కేసీఆర్ మధ్య ఉన్న సాన్నిహిత్యంతో వారి హయాంలో ఐదేళ్లపాటు ఎటువంటి వివాదాలు రచ్చకెక్కలేదు. కలసి మాట్లడుకుని అలా నడిపించేశారు. తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి లేకుండానే మంటలు పుట్టించేలా నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి. రోజురోజుకూ ఏం జరుగుతుందో అనే ఆందోళన రెండు రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. 2023లో కేంద్రం డ్యామ్‌ను అధీనంలోకి తీసుకుని భద్రత సమస్యకు పరిష్కారం చూపిందని అంతా అనుకున్నారు. కానీ కేంద్రం ఎంట్రీ కూడా తాజాగా వివాదాలకు మరింత ఆజ్యంపోసేలా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగర్ డ్యామ్ నీటిలో ఎప్పుడైతే పొలిటికల్ కలర్ కలిసిందో, అప్పటి నుంచే అన్ని లెక్కలు మారిపోయాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్ సిఎంలుగా ఉన్నప్పుడు అంతా సాఫీగా సాగిపోయింది. రాజకీయం స్నేహం రచ్చవరకూ రాకుండా చేసింది. ఇప్పుడు ప్రభుత్వాలు మారిపోయాయి. ఇక్కడ కాంగ్రెస్, అక్కడ కూటమి ప్రభుత్వం ఎంట్రీతో ఇప్పుడు సాగర్ డ్యామ్ వివాదంలో జరుగుతున్న పరిణామాలు మరింత ఆసక్తిగా మారాయి. కలసి పనిచేసే రాజకీయ వ్యూహం లేదు. కూటిమితో కాంగ్రెస్ కలిసే ఛాన్సే లేదు. ఇప్పుడు సామరస్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే ఉద్దేశ్యంతో అటు ఏపి , ఇటు తెలంగాణ ప్రభుత్వాలు డ్యామ్ వివాదంలో తెగేవరకూ లాగేందుకు సిద్ధమయ్యాయి. సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రోజు ఏపి పోలీసులు ఎవరూ ఊహించని విధంగా డ్యామ్‌పైకి ఎంట్రీ ఇవ్వడం, 13గేట్ల వరకూ స్వాధీనం చేసుకుని, రెండువేల క్యూసిక్‌ల నీటిని బలవంతగా విడుదల చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. అది మా వాటా మాహక్కు అంటూ ఏపి అంటోంది. ఆ తరువాత తెలంగాణ ఒత్తిడి, ఫిర్యాదులతో కేంద్ర జలవనరులశాఖ జోక్యం చేసుకుని సాగర్ డ్యామ్‌ను కేంద్రం ఆధీనంలోకి తీసుకుని నడిపిస్తోంది. ఉన్నట్టుండి ఏం జరిగిందో అంతుచిక్కడంలేదు గానీ, ములుగు కేంద్రంగా డ్యాం వద్ద ఉన్న కేంద్ర బలగాలను వెనక్కు పిలిచారు. ఏపి వైపు ఉన్న విశాఖ బెటాలియిన్ కేంద్రబలగాలను వెనక్కు పిలిచినట్లే పిలిచి మళ్లీ ఆపేశారు. డ్యామ్ వద్దే ఉండండి అని చెప్పడం వెనుక ఆంతర్యం ఎవరీకి అంతుచిక్కడంలేదు. అయితే ఈ విషయంలో ఏపి రాజకీయ వ్యూహం,ఒత్తిడి కేంద్రంపై పని చేశాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు, మోడీ మధ్య ఉన్న రాజకీయ అవసరాలు, పొత్తు, స్నేహం ఇవన్నీ బాగానే పనిచేస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఏపికి అనుకూలంగా నాగార్జునసాగర్ డ్యామ్ నీటి వాటాల వివాదంలో ఏపి వైపే కేంద్రం మొగ్గుచూపుతోందినే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఇటు రండి, అటు ఉండండి అంటూ ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఇలా ఆంధ్రాకు కేంద్రం వంత పాడటం వల్లనే ,ఇప్పటి వరకూ చల్లారిన సాగర్ నీటి మంటలు మళ్లీ భగ్గుమంటున్నాయంటున్నారు. ఇదిలా ఉంటే సాగర్ నీటి విడుదలలో కొరత ఏర్పడితే తెలంగాణకే ఆయువుపట్టులా ఉన్న హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు పీక్స్ చేరుకుంటాయి. కేంద్ర జలవనరులశాఖను ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం, నీటి వాటాల విషయం, డ్యామ్ భద్రత వ్యవహారంలో ఏపి తీరును తప్పుబడుతూ ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం వర్గాలు.