
కాకినాడ, ఏప్రిల్ 17,
2019 ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై జరిగిన కోడికత్తి దాడి కేసుపై కొత్త రాజకీయం ప్రారంభమయింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అమలాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కోడికత్తి శీను కుటుంబాన్ని పరామర్శించారు. శీను తప్పు చేసి ఉండవచ్చు కానీ.. జగన్ మోహన్ రెడ్డి వైఖరి వల్ల ఆ కుటుంబం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఈ అంశంపై వైఎస్ఆర్‌సీపీకి చెందిన పత్రికలో ఓ కథనం వచ్చింది. జగన్ కోడికత్తి శీను దాడి చేసినప్పుడు ఇంటలిజెన్స్ చీఫ్ గా ఏబీవీనే ఉన్నారు. జగన్ పై కోడికత్తి దాడి వెనుక ఆయన ఉన్నారని ఇదే సాక్ష్యమని.. ఆరోపించింది. వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి కూడా అదే ప్రకటన చేశారు. వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు సోషల్ మీడియాలో స్పందించారు. జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసు గురించి, శీనుకు జరిగిన అన్యాయం గురించి, విచారణ గురించి మొత్తం చర్చించడానికి తాను రెడీ అయినా.. అది సాక్షి టీవీలో అయినా సరే సిద్ధమని ప్రకటించారు. జగన్ పై కోడికత్తితో జనపల్లి శ్రీనివాసరావు దాడి చేసినప్పుడు కేసును రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే అప్పట్లో పోలీసులపై నమ్మకం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలని జగన్ , వైసీపీ తరపున హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ విచారణ జరుగుతున్న సమయంలోనే కేంద్రం తాము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తో దర్యాప్తు చేయిస్తామని తెలిపింది. దాంతో కేసు ఏపీ పోలీసుల నుంచి ఎన్ఐఏకు బదిలీ అయింది. ఎన్ఐఏ సహజంగా.. జాతీయ భద్రతతో సంబంధం ఉన్న కీలక కేసుల్నే చూస్తూంది. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి తీసుకు వచ్చేలా ఏళ్ల తరబడి ప్రయత్నించి సక్సెస్ అయిన ఇప్పుడు ప్రశ్నిస్తోంది. అలాంటి ఎన్ఐఏ.. జగన్ పై దాడి కేసును సమగ్రంగా పరిశోధించింది. కోడికత్తి శీను దాడి చేయడానికి ఎవరూ పురికొల్పలేదని తేల్చారు. అయితే ఎనఐఏ లాంటి దిగ్గజ సంస్థ దర్యాప్తులో నిజాలు తేలలేదని వైఎస్ఆర్‌సీపీఆరోపిస్తోంది. జగన్ బాధితుడిగా సాక్ష్యం చెప్పడానికి కూడా కోర్టుకు హాజరు కావడం లేదు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆరేళ్లకుపైగా జనపల్లి శ్రీనివాసరావు జైలుకే పరిమితమయ్యారు. జగన్ వీరాభిమాని అయిన జనపల్లి శీను జగన్ కు భారీ మెజార్టీ రావడానికి.. సానుభూతి వచ్చేలా దాడి చేశానని చెబుతూ వస్తున్నారు. కానీ ఆయనపై వైసీపీ నేతలకు మాత్రం అభిమానం లేదు. ఆయన టీడీపీ కుట్ర కారణంగా దాడి చేశారని నమ్ముతున్నారు.