
కడప, ఏప్రిల్ 17,
వైఎస్ షర్మిల పయనమెటో తెలియడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆమెకు రాజకీయంగా ఎలాంటి పదవి లభించే అవకాశాలు కనిపించడం లేదు. దేశంలో ఇండి కూటమి వచ్చే సంకేతాలు అస్సలు కనిపించడం లేదు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ ఇక కోలుకునే పరిస్థితి లేదు. నాయకులు లేరు. క్యాడర్ లేని పార్టీని ప్రజలు ఆదరించరన్నది అందరికీ తెలిసిందే. మరొక వైపు వైఎస్ షర్మిల నాయకత్వంపై ఉన్న నేతల్లోనూ అసంతృప్తి నెలకొంది. ఆమె మీడియాకు మాత్రమే పరిమితమవుతున్నారని, పీసీసీ చీఫ్ గా పార్టీ బలోపేతానికి ఎలాంటిచర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి. అనేక మంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పార్టీని వీడి వెళ్లిపోతున్నారు.. అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం, చంద్రబాబు ప్రభుత్వంపై నామమాత్రపు ఆరోపణలకు దిగుతూ ఆమె మమ అనిపించేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమైన నేతలందరూ పార్టీని వదిలి వెళ్లిపోయారు. సొంత జిల్లాలోనూ ఆమెకు గ్రిప్ దొరకడం లేదు. గత ఎన్నికల్లో జగన్ ను ఓడించగలిగానన్న తృప్తి మినహాయించి ఆమెకు రాజకీయంగా ఒరిగిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో తన తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసినప్పుడు రాజ్యసభ పదవి ఇస్తామని చెప్పారన్న ప్రచారం జరిగింది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హామీ మేరకే షర్మిల ఈ స్టెప్ తీసుకున్నారని కూడా చెబుతారు. అయితే ఇప్పుడు వైఎస్ షర్మిలను కేంద్ర నాయకత్వం కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. డీకే శివకుమార్ ను ఇటీవల కలసినప్పుడు కూడా ఆయన కూడా రాజ్యసభ విషయంలో తన నిస్సహాయతను వ్యక్తం చేసినట్లు సమాచారం. ఏమీలేని రాష్ట్రంలో చీఫ్ గా ఉన్న నేతకు రాజ్యసభ పదవి ఇవ్వడం అనవసరమని బహుశ కేంద్ర నాయకత్వం భావించి ఉండవచ్చు. కాంగ్రెస్ లో సీనియర్ నేతలు అనేక మంది ఉన్నారు. రాహుల్ గాంధీ, సోనియాకు అత్యంత ఆప్తులైన నేతలు అనేక మంది పెద్దల సభలో తమకు స్థానం దక్కుతుందని భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో టెన్ జన్ పథ్ వైఎస్ షర్మిల వైపు చూసే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పుడు కాదు కదా.. వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. పదిహేనే ళ్లన నుంచి అంటే 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. ఇక కోలుకోనే అవకాశాలు కూడా లేవు. టీడీపీ, వైసీపీ వంటి బలమైన పార్టీలు కూడా కాంగ్రెస్ ను కలుపుకుని పోయేందుకు ప్రయత్నించవు. అందుకే తమకు దగ్గరగా ఉన్న ఏమీ ఓటు బ్యాంకులేని కాలం చెల్లిన సిద్ధాంతాలతో పయనిస్తున్న కమ్యునిస్టులతోనే ప్రయాణం సాగించాల్సి ఉంటుంది. అందుకే వైఎస్ షర్మిలకు రాజకీయ భవిష్యత్ కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఆమె మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.