
గుంటూరు, ఒంగోలు, ఏప్రిల్ 23,
ఏపీలో వైసీపీ పాలనలో చీపు లిక్కరును మద్యం బాబులకు అంటగట్టి.. భారీ ధరలతో వారిని దోచేసిన విషయం తెలిసిందే. అన్నీ ప్రభుత్వ మద్యం దుకాణాలే కావడం.. ఎక్కడా ఫోన్‌పే, గూగుల్ పే వంటి వాటిని వినియోగించకపోవడం ద్వారా భారీ ఎత్తున నగదు అక్రమాలు జరిగాయని అప్పట్లోనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీనిని కూటమి సర్కారు వచ్చాక దుమ్ముదులిపే ప్రయత్నం చేసింది. తాజాగా కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. ఉరఫ్ రాజ్ కసిరెడ్డిని పోలీసులు మంగళవారం సాయంత్రం వరకు విచారించారు. వాస్తవానికి సోమవారం.. అర్థరాత్రి నుంచి విడతల వారీగా రాజ్ కసిరెడ్డిని విచారిస్తూనే ఉన్నారు.. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు కసిరెడ్డి వెల్లడించినట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. వీటిలో ప్రధానంగా నాలుగు అంశాలపై అధికారులు దృష్టి పెట్టారు. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన మద్యం విధానానికి రూపకర్త ఎవరు? అన్నది ప్రధాన ప్రశ్న. దీనికి కసిరెడ్డి ఎలాంటి తడబాటు లేకుండానే.. వైసీపీ ముఖ్య నాయకులు అని చెప్పినట్టు తెలిసింది. ఈ ముఖ్య నాయకుల్లో వైవీ సుబ్బారెడ్డి తనయుడు విక్రాంత్ రెడ్డి ఉన్నట్టు చెప్పారు. అదేవిధంగా సాయిరెడ్డి పాత్ర కూడా ముఖ్యమేనని.. ఆయన ఇప్పుడు తప్పించుకుంటున్నారని చెప్పినట్టు తెలిసింది. ఇక, డిస్టిలరీల వ్యవహారం అంతా.. సాయిరెడ్డే చూసినట్టు చెప్పారని తెలిసింది. కొన్ని కొన్ని విషయాల్లో మాత్రమే తన ప్రమేయం ఉందని.. తాడేపల్లి, హైదరాబాద్, బెంగళూరు లలో జరిగిన నాలుగు కీలక సమావేశాల్లోనే నిర్ణయాలు జరిగాయని వివరించినట్టు సమాచారం.డిస్టరీల వ్యవహారం సహా.. మద్యం కేసుల విక్రయాలు.. లక్ష్యాలు పెట్టడం.. నిధుల విషయం అంతా.. కూడా.. తాడేపల్లికి చెందిన ముగ్గురు కీలక వ్యక్తులు చెబితేనే తాను చేసినట్టు కసిరెడ్డి వివరించినట్టు తెలిసింది. ఆ ముగ్గురులో అప్పటి సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నట్టు చెప్పడం సంచలనంగా మారింది. ఎక్కడెక్కడ ఏయే మద్యం విక్రయించాలి. ఎవరిని వాడుకోవాలి.. అనే విషయాల్లో ఆయన ప్రమేయం ఉందని.. అదేవిధంగా అప్పటి ఓ మంత్రి ప్రమేయం కూడా ఉందని కసిరెడ్డి చెప్పినట్టు సమాచారం. ఇదిలావుంటే.. రాజ్ కసిరెడ్డి నుంచి మరిన్ని వివరాలు రాబట్టిన పోలీసులు కోర్టుకు ఆయనను హాజరుపరిచారు.
అంబటి రాంబాబు వార్నింగ్
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీప్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై విపక్ష వైసీపీ ఘాటుగా స్పందించింది. ఈ మేరకు వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి కూటమి సర్కారే కక్షపూరితంగా అరెస్టు చేయించిందని సంచలన ఆరోపణ చేశారు. అంతేకాకుండా ఈ అరెస్టులకు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ అంబటి ఏకంగా టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడుకు వార్నింగులు జారీ చేశారు. చంద్రబాబుకు వార్నింగ్ ఇస్తూ అంబటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎంతమందిని అరెస్టు చేస్తారు? అరెస్టు చేసి జైల్లో పెడితే… జైల్లోనే తాము చనిపోతామా? రాదా బెయిల్? ఏడాదికి అయినా వస్తుంది కదా. చాలా తప్పు చేస్తున్నారు చంద్రబాబు గారు, మీరు పెద్ద వారు. 75వ పుట్టిన రోజు జరుపుకున్న మీరు గుర్తు పెట్టుకోండి. దీనికి తగ్గ మూల్యం చెల్లిస్తారు” అంటూ అంబటి సంచలన వ్యాఖ్యలే చేశారు. అసలు పీఎస్ఆర్ ను అరెస్టు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న కుక్కల విద్యా సాగర్ తో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు కోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. కోర్టును ఆశ్రయించకుండా ఉన్న కారణంగానే పీఎస్ఆర్ ను అరెస్టు చేయగలిగారు అని ఆయన ఆరోపించారు అయినా పీఎస్ఆర్ అరెస్టు చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే జరిగిందని కూడా అంబటి ఆరోపించారు. చంద్రబాబు అరెస్టైన సమయంలో పీఎస్ఆర్ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారని, తన అరెస్టులో కీలక భూమిక పీఎస్ఆర్ దేనని చంద్రబాబు భావించారని ఆయన ఆరోపించారు. తన అరెస్టుకు కారకుడిగా నిలిచారన్న భావనతోనే పీఎస్ఆర్ ను చంద్రబాబు అరెస్టు చేయించారన్నారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులు కూడా ఓ విషయాన్ని గుర్తించాలని.. టీడీపీ సర్కారే ఎల్లకాలం అధికారంలో ఉండదని ఆయన హెచ్చరించారు. మరో పార్టీ ప్రభుత్వం వస్తే మీ పరిస్థితి ఏమిటని కూడా ఆయన పోలీసులను హెచ్చరించారు. ఐపీఎస్ లు అయినా, ఐఏఎస్ లు అయినా వారి పరిధి దాటి వ్యవహరించరని అంబటి అన్నారు. అయితే ఇప్పుడు మాత్రం పోలీసుల తీరు అందుకు విరుద్దంగా ఉందని అంబటి ఆరోపించారు. జగన్ కు ఎవరు దగ్గరగా ఉన్నా… వారంతా తమకు శత్రువులే అన్నట్లుగానే చంద్రబాబు భావిస్తున్నారని అంబటి వ్యాఖ్యానించారు. అసలు ఏపీలో మద్యం కుంభకోణమే జరగకున్నా.., ఎదో జరిగిందంటూ రాజ్ కసిరెడ్డిని అరెస్టు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే మద్యం విక్రయిస్తే అవినీతి ఎక్కడ జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. అయినా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడితే కదా అవినీతి జరిగేది అని కూడా ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు జరుగుతున్న వాటికంతా చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. చంద్రబాబు లేకుంటే ఆయన కుమారుడు లోకేశ్ అయినా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కూటమి సర్కారు కేవలం 11 నెలల వ్యవధిలో వచ్చిన వ్యతిరేకత దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం మీద రాలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబు… అందులో భాగంగానే రోజుకు ఒకరిని అరెస్టు చేస్తూ ప్రజల దృష్టిని మరల్చుతున్నారని ఆయన ఆరోపించారు.