
విజయవాడ , ఏప్రిల్ 24,
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష పదవికి భారీ స్థాయిలో పోటీ నెలకొంది. కూటమి అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వంలోనూ ఏపీ ఇంపార్టెన్స్ పెరిగింది. అమరావతి, పోలవరం నిర్మాణాలకు ప్రాధాన్యత దక్కుతోంది. ఈ కారణాలతో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి గతంలో కంటే ప్రాముఖ్యమైందిగా మారిపోయింది. అందుకే ఈసారి ఎన్నడూ లేనంతగా ఆ పదవి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. రాష్ట్రంలో ,కేంద్రంలో తమకున్న పలుకుబడి దృష్ట్యా ఎవరికీ వారు తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఇప్పటికే రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురందేశ్వరికే మరోసారి ఆ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. కేంద్రంలో కీలక పదవికి ఆమెను తీసుకు వెళ్లాలని భావించినా 2024 ఎన్నికల సమయంలో కీలకంగా ఆమె వ్యవహరించడం ఎన్టీఆర్ కుమార్తె అనే సెంటిమెంట్ ప్రజల్లో ఉండడం టిడిపి నేతలు, జన సైనికులు కూడా ఆమెతో గౌరవంగా ఉండడం పార్టీకి కలిసి వస్తుందని కేంద్ర స్థాయి నేతలు భావిస్తున్నారు. ఎలాంటి వివాదాలకు ఆస్కారం లేని పనితీరు మరోసారి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఇటీవలే ఆమె కుటుంబంతో నారా కుటుంబం కూడా కలిసిపోయిన పరిస్థితులు బేరీజు వేసుకుని పురందేశ్వరికే మరికొంత కాలం పార్టీ బాధ్యతలు అప్పజెప్పాలని కేంద్ర బీజేపీలోని ఒక వర్గం భావిస్తోంది.ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల్లో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనాచౌదరి ఒకరు. 2019 ఎన్నికల్లో టిడిపి ఓటమి తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో బీజేపీలో చేరిన ఆయన అప్పటి నుంచి పార్టీకి నమ్మకంగా పని చేస్తూ వస్తున్నారు. ఆర్థికంగా సామాజికంగా బలమైన వ్యక్తి కావడంతోపాటు కేంద్ర స్థాయిలో పలుకుబడి కూడా గట్టిగానే ఉంది. 2024 ఎన్నికల్లో చాలా కీలకంగా వ్యవహరించిన ఆయనకు టిడిపి హైకమాండ్‌తో కూడా దగ్గర పరిచయాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇటీవల వైసీపీలో నుంచి బయటికి వచ్చిన ఒక కీలక నేత ఆ నిర్ణయం తీసుకునేలా చక్రం తిప్పింది సుజనా చౌదరే అని త్వరలోనే ఆ వ్యక్తి బిజెపిలో చేరతారని ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత ఉన్నా సుజనా చౌదరికి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి అప్పజెప్పినట్లయితే పార్టీని బలోపేతం చేసేలా కీలక వ్యక్తులను ప్రముఖులను పార్టీ వైపు ఆకర్షించేలా చేయగల సమర్థత సుజనా చౌదరికి ఉందని ఆయన వర్గం చెబుతూ వస్తోంది. సుజనా చౌదరి కూడా ఆ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేశారన్న సంకేతాలు అందుతున్నాయిబిజెపి ఈసారి రాయలసీమనేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి కట్ట పెట్టాలంటే అది దక్కేది విష్ణువర్ధన్ రెడ్డికే. ఇప్పటికే ఆ దిశగా తన ప్రయత్నాలు తీవ్రతరం చేశారాయన. యువనేత కావడం ప్రత్యర్థులకు సీరియస్‌గా సమాధానం చెప్పడం పార్టీకి విధేయుడుగా ఉండడం ఇవన్నీ ఆయనకి కలిసి వచ్చే అంశాలు కాగా.. కాస్త దూకుడు స్వభావం చిక్కులు తెచ్చి పెడుతూ ఉంటుంది. కానీ ఎలాగైనా బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం తన వంతు ప్రయత్నం ఆయన ముమ్మరంగా చేస్తున్నారు బీజేపీ కేంద్ర నాయకత్వం వద్ద అత్యంత పలుకుబడి గల వ్యక్తి. కేంద్ర విధానాలపైన రాష్ట్ర సమస్యలపైన లోతైన అవగాహన ఉన్న వ్యక్తి ఈయనే. 2024 ఎన్నికలకు ముందే ఏపీకి షిఫ్ట్ అయిన జీవీఎల్ నరసింహరావు కొంతకాలం పాటు వైజాగ్‌కు మాత్రమే పరిమితం అయిపోయారు. ఇప్పుడు మారిన పరిణామాల దృష్ట్యా రాష్ట్ర రాజకీయాల్లో కీలక బాధ్యతలు నిర్వహించాలని భావిస్తున్నారు. పైపెచ్చు మొదటి నుంచి బిజేపీతోనూ సంఘ్ పరివార్‌తోనూ లోతైన సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తిగా జివిఎల్ బిజెపి కేంద్ర నాయకత్వం దృష్టిలో గుడ్ లుక్స్‌లో ఉన్నారు. బిజెపి రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్న సమయంలోనూ నిబద్ధతతో పనిచేసిన వ్యక్తిగా మాధవ్‌కు గుర్తింపు ఉంది. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ప్రజా సమస్యలపై మాట్లాడిన అనుభవం ఉంది. వివాదరహితుడు కావడంతోపాటు ఉత్తరాంధ్రకు చెందిన నాయకుడిగా ఉన్న పేరు అందరితో కలిసిపోయే మనస్తత్వం మాధవ్‌కు ప్లస్ పాయింట్స్. మంచివాడు సమర్ధుడు అనే పేరు ఉన్నా మిగిలిన వారితో పోలిస్తే కేంద్ర నాయకత్వం దగ్గర రాష్ట్ర అధ్యక్షుడు పదవి కోసం ఆ స్థాయిలో లాబీయింగ్ చేయగలడా అనే దానిపై పదవి దక్కుతుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.ప్రధానంగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వ్యక్తులు వీరే. వీళ్ళే కాకుండా క్షత్రియ సామాజిక వర్గం నుంచి విష్ణుకుమార్ రాజు లాంటివాళ్ళు లైన్‌లోనే ఉన్నా ఇప్పటికే ఆ సామాజిక వర్గానికి కేంద్రమంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తారా లేదా అనేది డౌటే. ఏదైనప్పటికీ గతంలో ఎన్నడూ లేనంతగా ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం తీవ్రమైన పోటీ అయితే నెలకొని ఉంది. పైన చెప్పిన పేర్లలో ఒకరిని కేంద్ర అధినాయకత్వం గుర్తిస్తుందా లేక మరొక అనూహ్యమైన పేరును తెరపైకి తెస్తుందా అనేది చూడాలి.