
విజయవాడ, ఏప్రిల్ 24,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై పార్టీ నేతలతో పాటు క్యాడర్ కూడా ఒకింత అసహనంతో ఉన్నారు. కూటమి ద్వారా అధికారంలోకి వచ్చినప్పటికీ రాజ్యసభ స్థానాల విషయంలో తలవొగ్గి ఉండటం ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుంది. రాజ్యసభకు టీడీపీలో తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ ఖాళీ అయ్యే ప్రతి స్థానం కమలం ఖాతాలో పడిపోతే ఇక మనకు వచ్చేది ఎప్పుడంటూ నేతలు ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ క్యాడర్ ఇదే రకమైన ప్రశ్నలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో కూటమి ఏర్పాటయినందున అనేక మంది తమ స్థానాలను త్యాగం చేశారు. అదేసమయంలో చాలా మంది సీనియర్లను పోటీకి దూరంగా పెట్టారు. అయితే వారి సేవలను వినియోగించుకుంటామని చెప్పడంతో ఎక్కువ మంది రాజ్యసభ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీలో చాలా మంది సీనియర్ నేతలు గత ఎన్నికల్లో టిక్కెట్లు దక్కకపోయినా కూటమి విజయం కోసం పనిచేశారు. తమకు సుదీర్ఘకాలంగా ఉన్న పరిచయాలను కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ప్రయత్నించారు. అంతే కాదు.. నియోజకవర్గంలో తమ పట్టు కోల్పోతామని తెలిసినా పార్టీ కోసం వారు కష్టపడి పనిచేశారు. అనేక మంది కొత్త వారికి, యువకులకు అవకాశం ఇవ్వడంతో సీనియర్ నేతలకు టిక్కెట్లు దొరక్కుండా పోయాయి. అయినా అసంతృప్తి లోపల ఉన్నా ఎక్కడా బయటపడకుండా క్యాడర్ కు సర్దిచెప్పి ఎన్నికల్లో విజయం కోసం పాటుపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తే తమకు నామినేటెడ్ పదవులు వస్తాయని వారు నమ్మకం పెట్టుకున్నారు. అందుకే గత ఎన్నికల్లో కష్టపడి పనిచేశారు. గతంలో వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసినా అందులో రెండింటిలో మాత్రమే టీడీపీ నిలబెట్టింది. రెండింటిలోనూ ఒకటి రాజీనామా చేసి వచ్చిన బీద రవిచంద్ర యాదవ్ కు తిరిగి పదవి ఇచ్చింది. అలాగే మరో రాజ్యసభ పదవి యువకుడైన సానా సతీష్ కు ఇచ్చారు. దీంతో నాడు కూడా సీనియర్ నేతలు పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. పార్టీ అధికారంలో లేనప్పుడు తాము కష్టించి పనిచేసినా తమ కష్టాన్ని పార్టీ నాయకత్వం గుర్తించలేదన్న అసహనం కొందరు వ్యక్తంచేశారు. పెద్దల సభలో పార్టీ బలాన్ని పెంచుకోవాల్సిన సమయంలో ఇలా ఒత్తిడులకు తలొగ్గి బీజేపీకి అన్నిస్థానాలను కట్టబెట్టడమేంటన్న ప్రశ్న తలెత్తుతుంది. కేవలం అమారావతి, పోలవరం నిర్మాణం కోసం పదవులను పణంగా పెట్టడం ఎంత వరకూ సబబని కొందరు సూటిగానే ప్రశ్నిస్తున్నారు. బీజేపీకి ఏపీలో ఉన్న బలం తక్కువేనని తెలిసినా అది అడిగిన వెంటనే ఒప్పుకుని సొంత పార్టీ నేతలను రాజకీయంగా దూరం పెట్టేందుకు పార్టీ అగ్రనాయకత్వం చేస్తున్న పనిని పలువురు తప్పుపడుతున్నారు. ఏపీనుంచి కాకుండా తమిళనాడుకు చెందినవారికి రాజ్యసభ పదవి ఇస్తే ఏ రకమైన సంకేతాలు వెళతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మన అవసరం వాళ్లకు ఉందని, దానిని ఆలోచించి పదవుల విషయంలో త్యాగరాజులు కావద్దన్నసూచనలు వెలువడుతున్నాయి.