
విజయవాడ, ఏప్రిల్ 25,
మంద కృష్ణ మాదిగ. పరిచయం అక్కర్లేని పేరు ఇది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉమ్మడి ఏపీలో ఆయన సుపరిచితం. జాతీయ స్థాయిలో సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. ఎక్కడో ప్రకాశం జిల్లాలో 14 మంది యువకులతో మాదిగ దండోరాను ఆయన ప్రారంభించారు. ప్రతి మాదిగ గూడెంలో దండోరా జండా ఎగిరే విధంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని విస్తరించారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను కొన్ని వర్గాలకే దక్కాయని.. అందరికీ విస్తరింపజేయాలన్న ధ్యేయంతో ఆయన చేపట్టిన ఉద్యమం జాతీయ స్థాయిలో సైతం కలిగితురాయిగా నిలిచింది. అందుకే అత్యున్నత న్యాయస్థానం సైతం ఎస్సీ వర్గీకరణకు జై కొట్టింది. దీంతో జాతీయస్థాయిలో సైతం మందకృష్ణ మాదిగ పేరు మార్మోగింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగను రాజకీయంగా ప్రోత్సహించాలని ఎన్డీఏ నిర్ణయించుకున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ పార్టీ ద్వారా తనకు లభించిన రాజ్యసభ పదవిని సైతం ఆయన వదులుకున్నారు. దీంతో ఏపీ నుంచి రాజ్యసభ పదవి ఖాళీ అయింది. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ తరుణంలో రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ సీటు బిజెపికి విడిచి పెట్టాలని ఆ పార్టీ పెద్దలు కోరినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తమిళనాడు బిజెపి మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరోవైపు ఢిల్లీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీని సైతం ఏపీ నుంచి రాజ్యసభకు పంపిస్తారని టాక్ నడుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మందకృష్ణ మాదిగ పేరు తెరపైకి వచ్చింది. దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.ఎస్సీ వర్గీకరణ చేపట్టి.. మెజారిటీ ఎస్సీ ఉప కులాల్లో ఎన్డీఏ కూటమి పార్టీలకు ఆదరణ పెరిగింది. ప్రధానంగా మాదిగ, రెల్లి ఉప కులాల నుంచి విశేష స్పందన వస్తోంది. వాస్తవానికి ఎస్సీ సామాజిక వర్గం ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతు దారుగా ఉంది. కానీ 2024 ఎన్నికల్లో ఎస్సీల్లో స్పష్టమైన చీలిక కనిపించింది. దానిని అలాగే ఉంచుకోవాలంటే ఎస్సీ వర్గీకరణ అనేది చేయాలని చంద్రబాబు ప్లాన్. అందుకే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన మరుక్షణం.. ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చిందో లేదో అమలు చేసి చూపించారు. అదే సమయంలో ఆది నుంచి ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు మందకృష్ణ మాదిగ అనేక సందర్భాల్లో మద్దతు తెలిపారు. అదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో సైతం బిజెపికి మద్దతు ప్రకటించారు. రెండు చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేశారు. అందుకే ఇప్పుడు మందకృష్ణ మాదిగ పేరును తెరపైకి తెచ్చి.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ లబ్ధి పొందేలా ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు.వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలోఅధికారంలోకి రావాలన్నది బిజెపి ప్లాన్. అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే బీసీ నేత కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇచ్చింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగ కు ఇస్తే.. బీసీలతో పాటు మాదిగ సామాజిక వర్గం బిజెపి వైపు వస్తుందన్నది ప్లాన్. ఇదే విషయాన్ని బిజెపి అగ్ర నేతలకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. మంద కృష్ణ మాదిగకు రాజ్యసభ పదవి ఇస్తే తెలంగాణతో పాటు ఏపీలో రాజకీయంగా లబ్ధి పొందవచ్చని వారి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. మొత్తానికైతే అనూహ్యంగా పెద్దల సభలో మందకృష్ణ మాదిగ అడుగుపెట్టడం ఖాయమని తేలుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.