
శ్రీనగర్, ఏప్రిల్ 25,
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలోని బైసరన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. లష్కర్–ఎ–తొయిబాతో సంబంధం ఉన్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) బాధ్యత వహించిన ఈ దాడిలో 26 మంది, అందులో 25 మంది భారతీయులు, ఒక నేపాళీ పౌరుడు మరణించారు. ఉగ్రవాదులు కార్బైన్‌లు, అఓ–47 రైఫిళ్లతో పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత, కేంద్ర ప్రభుత్వం భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను మంజూరు చేసింది, ఉగ్రవాదులను అంతమొందించేందుకు తీవ్ర శోధన కార్యకలాపాలను ప్రారంభించింది.పహల్గాం దాడి తర్వాత, భారత సైన్యం, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా పూంఛ్, బారాముల్లా, పహల్గాం అడవుల్లో ఉగ్రవాదుల కోసం భారీ శోధనను ప్రారంభించాయి. హెలికాప్టర్‌లు, డ్రోన్‌లతో ప్రతి అంగుళాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్‌లో అత్యాధునిక సాంకేతికత ఉపయోగించబడుతోంది, ఇందులో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన నెట్రా డ్రోన్‌లు 240 డిగ్రీల కవరేజ్‌తో రియల్–టైమ్ డేటాను అందిస్తాయి. ఇజ్రాయెల్ నుంచి దిగుమతి చేసుకున్న EL/W–2090 రాడార్ సిస్టమ్స్ 450 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను గుర్తిస్తాయి. ఇస్రో ఉపగ్రహాల నుంచి పొందిన రియల్–టైమ్ ఇమేజరీ ఉగ్రవాదుల స్థానాలను ఖచ్చితంగా గుర్తించడంలో సహాయపడుతోంది.