
శ్రీనగర్, ఏప్రిల్ 28,
పహల్గామ్‌లోని బైసరన్ లోయలో టూరిస్టులపై ఉగ్ర ముష్కరులు విరుచుకుపడి అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. టూరిస్టులకు అత్యంత దగ్గరగా వచ్చిన టెర్రరిస్టులు.. వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మతాన్ని అడిగి.. వెతికి, గుర్తు పట్టి మరీ కాల్పులు జరిపిన హేయమైన చర్య దిగ్భ్రాంతికి గురిచేసింది. జమ్ముకశ్మీర్ కనీవినీ ఎరుగని వికృతమైన ఉగ్రవాద దాడిలో మొత్తం 28 మంది చనిపోయారు.. ఈ ఘాతుకంపై అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.. దీంతో భారత్ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చర్యలు చేపట్టడంతోపాటు.. ఉగ్రవాదులను ఏరివేసేందుకు ముమ్మరంగా చర్యలు తీసుకుంటోంది.. అంతేకాకుండా.. పహల్గామ్ ఉగ్ర దాడి పై దర్యాప్తును కూడా ముమ్మరం చేసింది. పహల్గామ్ ఉగ్ర దాడి ఎలా జరిగింది. ఉగ్రవాదులు అక్కడకు ఏ రూట్‌లో వచ్చారు? లోకల్‌గా వాళ్లకు ఎలాంటి సహకారం అందింది? ఇలా అన్ని విషయాలపై ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) వివరాలను సేకరిస్తోంది.. అయితే.. బైసరన్ వ్యాలీలోకి టెర్రరిస్టులు ఎలా చొరబడ్డారో దర్యాప్తులో తేలింది. దాడికి ముందు ముష్కరుల కదలికలపై కీలక సమాచారం సేకరించారు.ఈ ప్రాంతంలోని జిప్ లైన్ ద్వారా ఇద్దరు ఉగ్రవాదులు వ్యాలీలోకి చొరబడ్డారని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. ఈ జిప్ లైన్ మీద ఓ టూరిస్ట్ వచ్చినట్లే ఆ ఇద్దరు టెర్రరిస్టులు బైసరన్ లోయలోకి చొరబడ్డారు. అంతకుముందు కోకర్నాగ్ అడవుల నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చి, బైసరన్‌కు ఉగ్రమూకలు చేరుకున్నాయి. ఇద్దరు షాపుల్లోనుంచి, మరో ఇద్దరు జిప్ లైన్ నుంచి, టూరిస్టులపై విరుచుకుపడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పాక్ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాది పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. పహల్గామ్ దాడి చేయడానికి ముందు ఉగ్రవాదులు కష్టతరమైన మార్గాల్లో.. 20-22 గంటలు నడిచినట్లు పేర్కొంటున్నారు.AK-47, M-4 అసాల్ట్ రైఫిల్స్‌తో కాల్పులు జరిపిన టెర్రరిస్టులు, బాధితుల నుంచి రెండు మొబైల్ ఫోన్లను లాక్కున్నారు. ఈ ఉగ్ర దాడిలో ప్రధాన నిందితుడిని ఆదిల్ అహ్మద్ ఠోకర్‌గా గుర్తించారు. ఇక ఈ ఉగ్ర దాడులకు సహకరించిన లోకల్ టెర్రరిస్టులను గుర్తించారు. వీరిలో 6 జిల్లాలకు చెందిన 14మంది ఉన్నారు. వీళ్లలో లష్కరే తోయిబాకు చెందిన 8మంది, జైషే, హిజ్బుల్‌కు నుంచి ముగ్గురు ఉగ్రవాదుల చొప్పున ఆర్మీ హిట్ లిస్ట్‌లో ఉన్నారు.ఓ వైపు ఉగ్రవాదుల కోసం గాలిస్తూనే.. మరోవైపు వాళ్ల ఇళ్లను నేలమట్టం చేస్తున్నాయి భద్రతా దళాలు. మూడు రోజుల్లో 11 మంది ఉగ్రవాదుల ఇళ్లను పేల్చేసిన సైన్యం…లేటెస్టుగా షోపియాన్ జిల్లాలో టెర్రరిస్ట్ అద్నాన్ షఫీ ఇంటిని పేల్చివేసింది. అంతకుముందు కుప్వారాలో ఫరూఖ్ తీద్వా ఇంటిని బాంబులతో పేల్చివేశారు. షోపియాన్‌లోని చోటిపొరాలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా దళాలు కూల్చేశాయి. కుల్గాంలోని మతాలం ప్రాంతంలో మరో టెర్రరిస్ట్ జాహిద్ అహ్మద్ ఇంటిని ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశారు. ముర్రాన్ ప్రాంతంలో హసన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. పుల్వామాలోని కాచిపొరాలో హరీస్ అహ్మద్ ఇంటిని బాంబులతో నేలమట్టం చేశారు. ఉగ్రవాదుల వేటలో వేగం పెంచింది సైన్యం..