
అనంతపురం, ఏప్రిల్ 30,
2024 ఎన్నికల ఫలితాలతో డీలాపడిన వైసీపీలో పునరుత్తేజం తెచ్చేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీలో పదవుల భర్తీ చేపడుతున్నారు. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించాలని భావిస్తున్న వైఎస్ జగన్.. ఆ క్రమంలో పలు స్థానాలకు ఇంఛార్జులను, సమన్వయకర్తలను నియమిస్తున్నారు. తాజాగా శింగనమల నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ను.. వైఎస్ జగన్ నియమించారు. 2024 ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గం నుంచి వీరాంజనేయులును వైఎస్ జగన్ బరిలో నిలిపారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన జొన్నలగడ్డ పద్మావతిని కాదని.. వీరాంజనేయులను బరిలో దింపారు. టిప్పర్ డ్రైవర్‌గా పనిచేసిన నేపథ్యం ఉన్న వీరాంజనేయులుకు టికెట్ ఇవ్వటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ చేతిలో వీరాంజనేయులు ఓటమి పాలయ్యారు.అయితే తాజా రాజకీయ పరిస్థితుల్లో సాకే శైలజానాథ్‌ను శింగనమల వైసీపీ ఇంఛార్జిగా జగన్ నియమించారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన సాకే శైలజానాథ్ 2025 ఫిబ్రవరిలో వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి వైసీపీ తరుఫున కూటమి ప్రభుత్వ విధానాలపై గళమెత్తుతున్నారు. తాజాగా ఆయనకు నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తూ జగన్ నిర్ణయించుకోవడం విశేషం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ద్వారా సాకే శైలజానాథ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. శింగనమల నుంచి 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు.అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దిగజారింది. ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అభ్యర్థులను కూడా బరిలో దింపలేని పరిస్థితికి చేరుకుంది. అయినప్పటికీ సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2022లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా సాకే శైలజానాథ్ పనిచేశారు. అయితే 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు శైలజానాథ్ టీడీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. జేసీ దివాకర్ రెడ్డిని కలవడంతో సాకే శైలజానాథ్ టీడీపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శింగనమల నుంచి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో వైఎస్ జగన్‌ను కలిసిన సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు. ఇప్పుడు శింగనమల వైసీపీ ఇంఛార్జిగా నియమితులయ్యారు.