
ఒంగోలు, ఏప్రిల్ 30,
వైయస్సార్ కాంగ్రెస్ అధినేత ప్రకాశం జిల్లాపై దృష్టి పెట్టారు. ప్రధానంగా అద్దంకి నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అక్కడ మంత్రి గొట్టిపాటి రవికుమార్ హవాకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు. సమర్ధుడైన నాయకుడిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా తేవాలని చూస్తున్నారు. 2029 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్ ను ఓడించే నేతను తేవాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. ఈ క్రమంలో సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తి సేవలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. ఎలాగైనా 2029లో అసెంబ్లీలో గొట్టిపాటి రవికుమార్ అడుగుపెట్టకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్.అద్దంకి అంటే ముందుగా గుర్తుకొచ్చేది కరణం బలరాం. ఆ నియోజకవర్గంలో తనకంటూ ఒక ముద్ర చాటుకుంటూ వచ్చారు. కానీ గొట్టిపాటి రవికుమార్ కు బ్రేక్ వేయలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రవికుమార్ వరుసగా ఐదు సార్లు గెలుస్తూ వచ్చారు. అద్దంకిలో అయితే నాలుగు సార్లు వరుస విజయంతో తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. రెండున్నర దశాబ్దాలుగా అక్కడ రాజకీయాలను శాసిస్తున్నారు. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారు. అందుకే రవికుమార్ హవాకు బ్రేక్ వేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి.2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గొట్టిపాటి రవికుమార్ తొలిసారిగా మార్టూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 పునర్విభజనతో మార్టూరు అద్దంకిగా మారింది. దీంతో గొట్టిపాటి రవికుమార్ అద్దంకికి మారాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కరణం బలరాం పై పోటీ చేసి గెలిచారు రవికుమార్. 2014 ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రవి కుమార్. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా మూడోసారి అద్దంకి నుంచి పోటీ చేసి గెలిచారు. ఎన్ని రకాల ఇబ్బందులు ఎదురైనా తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మంత్రిగా ఎన్నికయ్యారు.2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హనీమిరెడ్డినిబరిలో దించారు జగన్మోహన్ రెడ్డి. ఈయన వైవి సుబ్బారెడ్డి కి సన్నిహితుడు. అయితే ఓటమి తర్వాత హనీమిరెడ్డి నియోజకవర్గంలో కనిపించడం లేదు. దీంతో ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే నాయకుడు లేకుండా పోయారు. అందుకే ఇప్పుడు సమర్థవంతుడైన నేత కోసం జగన్మోహన్ రెడ్డి అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలోనే కరణం బలరామకృష్ణకు కబురు చేశారు. అద్దంకి నియోజకవర్గ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. మొన్నటి ఎన్నికల్లో చీరాల నుంచి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే కరణం బలరాం టిడిపిలోకి వెళ్ళిపోతారని ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్మోహన్ రెడ్డి పిలిచి బలరాం తో మాట్లాడినట్లు తెలుస్తోంది. త్వరలో అద్దంకి బాధ్యతలు బలరామకృష్ణకు అప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.