YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మరిన్ని ఉగ్రదాడులు.. అప్రమత్తమైన ఇంటెలిజెన్స్

మరిన్ని ఉగ్రదాడులు.. అప్రమత్తమైన ఇంటెలిజెన్స్

శ్రీనగర్,  ఏప్రిల్ 30,
జమ్మూ కాశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులకు అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కేంద్రాన్ని హెచ్చరించాయి. దాంతో అప్రమత్తమైన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లోని సగానికి పైగా పర్యాటక స్థలాలను మూసివేసింది. మరికొన్ని పర్యాటక స్థలాల వద్ద భద్రత పెంచింది. కాశ్మీర్ వ్యాప్తంగా 87 టూరిస్టు కేంద్రాలు ఉండగా 48 నుంచి 50 వరకు పర్యాటక స్థలాలను మూసివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోన్ మార్గ్, దాల్ లేక్, గుల్మార్గ్, బైసారన్ లోయ సహా సున్నితమైన పర్యాటక కేంద్రాలలో ప్రత్యేక భద్రత దళాలు ఏర్పాటు చేశారు.పర్యాటకులు ప్రవేశించడానికి అనుమతించని టూరిస్ట్ ప్రదేశాలలో గురేజ్ లోయ, దూద్‌పత్రి ఉన్నాయి. గత వారం 'మినీ స్విట్జర్లాండ్'గా పిలుచుకునే బైసరన్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేయగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 పుల్వామా దాడి తర్వాత కాశ్మీర్ లోయలో అతిపెద్ద దాడి ఇది. పర్యాటకులకు ముప్పు ఉందని, మరో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని భావించి కాశ్మీర్‌లోని 87 పబ్లిక్ పార్కులు, ప్రదేశాలలో 48 చోట్ల గేట్లు మూసివేశారు. భద్రతా సమీక్ష కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో జాబితాలో మరిన్ని ప్రదేశాలను మూసివేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారని  తెలిపింది.మూసివేసిన పర్యాటక ప్రదేశాలు కాశ్మీర్‌లోని సుదూర ప్రాంతాలలో ఉన్నాయని, గత పదేళ్లలలో తెరుచుకున్న కొత్త టూరిస్ట్ స్పాట్స్ కూడా మూసివేసినట్లు అధికారులు తెలిపారు. పర్యాటకులు సందర్శించలేని ప్రదేశాలలో కోకెర్నాగ్, దుక్సమ్, మార్గన్ టాప్, సింథాన్ టాప్, అచ్చబల్, బాంగస్ లోయ, తోసామైడాన్ ఉన్నాయి.ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తోంది. ఉగ్రదాడికి సంబంధించి రోజుకో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల ఆధారంగా, ఆ వీడియో తీసిన వ్యక్తుల సమాచారాన్ని సేకరిస్తున్నారు. అసలు ఆ సమమయంలో ఏం జరిగింది, ప్రత్యక్ష సాక్షులను విచారించడానికి అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఉగ్రదాడి జరిగిన బైసరస్ లోయ ప్రదేశంలో ఐఎన్ఐఏ అధికారులు సీన్‌ రీక్రియేట్‌ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో బైసరన్ లోయను సందర్శించిన వారిని ప్రశ్నించి ఉగ్రదాడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు.

Related Posts