
వరంగల్ , ఏప్రిల్ 30,
బచావో కర్రెగుట్టల పేరుతో.. భద్రతా బలగాలు దూసుకెళ్లాయి. దాదాపు ఏడు రోజులుగా జల్లెడ పడుతున్నాయి. భారీ సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో సాయుధ బలగాలు ముందుకెళ్లినా.. ఫలితం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. మావోయిస్టులు కావాలనే భద్రతా బలగాలను కర్రెగుట్టల వైపు రప్పించారా.. బలగాల దృష్టి మరల్చి మరో ప్రాంతానికి వెళ్లారా అనే చర్చ జరుగుతోంది. మావోయిస్టులు మరేదో వ్యూహం పన్నారనే చర్చ నడుస్తోంది.రెండు వారాల కిందట మావోయిస్టులు ఓ లేఖను విడుదల చేశారు. తమ రక్షణ కోసం కర్రెగుట్టల్లో బాంబులు అమర్చామని.. ఆదివాసీలు ఇటువైపు రావొద్దని హెచ్చరించారు. ఆ లేఖ కాస్త చర్చనీయాంశంగా మారింది. అయితే.. రాజ్యానికి బలం ఎక్కువ అని తెలిసి.. తాము ఉన్నచోటును మావోయిస్టులు ఎందుకు చెప్తారనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖ ద్వారా బలగాలను ఇటువైపు రప్పించి.. మావోలు మరో ప్రాంతానికి వెళ్లారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.కర్రెగుట్టల్లో బాంబులు అమర్చినట్టు మావోయిస్టులు ప్రకటన చేసి.. అగ్రనేతలను సేఫ్ ప్లేస్‌కు తరలించినట్టు ప్రచారం జరుగుతోంది. వ్యూహాత్మకంగానే మావోలు ఈ ప్రకటన చేశారని.. తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల్లోని అడవుల్లో కూంబింగ్ చేస్తున్న బలగాలు కూడా ఇక్కడికి రావడంతో.. మావోయిస్టులు వేరే ప్రాంతానికి సులభంగా వెళ్లి ఉంటారనే చర్చ జరుగుతోంది. దీనిపైనా బలగాలు ఆలోచిస్తున్నట్టు సమాచారం.నిజంగా మావోయిస్టులు కర్రెగుట్టల్లో ఉంటే.. బలగాలు డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆ ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించాయి. కానీ.. ఆశించిన స్థాయిలో మావోల కదలికలు గుర్తించలేదు. అంటే అసలు కర్రెగుట్టల్లో వారు లేరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఒకవేళ ఉంటే.. ఇన్నిరోజులు కూంబింగ్ జరుగుతున్నా.. వేలాది మంది జవాన్లు జల్లెడ పడుతున్నా.. ఎవ్వరూ ఎందుకు కనిపించరనే ప్రశ్న.. హాట్ టాపిక్‌గా మారింది.వాస్తవానికి కర్రెగుట్టలు చాలా ఎత్తులో ఉంటాయి. ఒకవేళ నిజంగా మావోయిస్టులు ఆ గుట్టలపై ఉన్నారనుకున్నా.. వారికే అనుకూల పరిస్థితులు ఉంటాయి. బలగాలు కింది నుంచి గుట్టలపైకి ఎక్కాలి. ఈ క్రమంలో కాల్పులు జరిగితే.. ఇరువైలా భారీగా ప్రాణ నష్టం ఉండేది.. అని గతంలో ఆ ప్రాంతంలో పనిచేసిన ఓ రిటైర్డ్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఇప్పటికే మావోయిస్టులు ఎత్తైన ప్రాంతంలో ఉంటే.. పైనుంచి కాల్పులు జరపడం ఈజీ అని ఆయన అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం ఎండలు మండుతున్నాయి. కర్రెగుట్టల ప్రాంతంలో వడగాలులు బలంగా వీస్తున్నాయి. ఇలాంటి సమయంలో కూంబింగ్ సజావుగా సాగడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది జవాన్లు వడదెబ్బకు గురయ్యారు అనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలగాలు ప్లాన్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఇలా కూంబింగ్, దాడులు కాకుండా.. బేస్ క్యాంపులు ఏర్పాటు చేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది