
హైదరాబాద్, ఏప్రిల్ 30,
రాజకీయాల్లో ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటోంది బీజేపీ. లెక్కలు మారబోతున్నాయని ప్రత్యర్థులకు హెచ్చరిక సైరన్ చేస్తోంది. అధికారం దిశగా సరికొత్త వ్యూహాాలకు పదునుపెడుతూ ముందుకు సాగుదాం అంటోంది బిజెపి అదిష్టానం. కేవలం మాటలు మాత్రమే కాదు, ఇప్పటికే ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్లు సంకేతాలందుతున్నాయి.తెలంగాణలో గతంతో పోల్చితే బిజేపి బాగా బలపడింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర రాజకీయాల్లో అధికార కాంగ్రెస్ తరువాత తామే అంటూ ఆ పార్టీ నేతలు మాంచి జోష్ మీదున్నారు. ప్రభుత్వంపై విమర్శలు, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిల‌్లో మతం కార్డు ప్రయోగించడం అందులో భాగమే అంటున్నారు. ఇలా రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి నేతలు జోరు పెంచుతున్నారు.తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అధికారం కోసం ఉవ్విల్లూరుతున్న బిజెపి అధిష్టానానికి మాత్రం ఆ కల నెరవేరడం లేదు. కలగానే మిగులుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల తరువాత నుంచి బిజెపి లెక్క మారింది. అదృష్టం జస్ట్ ఒక్క అడుగు దూరంలోనే ఉందని నాయకత్వం నమ్ముతోంది. తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం, ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం అనే ధీమాలో ఉన్నారు బిజెపి నేతలు.ఈసారి కేవలం మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించాలని అధిష్టానం సీరియస్‌గా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు చాలా టైం ఉంది, ఇప్పడే ఎందుకంత తొందర అనుకుని వదిలేస్తే కుదరదు. ఇప్పటి నుంచి జనంలోకి వెళ్లాలి. పార్టీ క్యాడర్‌ను మరింత బలోపేతం చేసుకోవాలి. బలం, బలగం చేజారకుండా చేయడంతోపాటు బలహీనతలపై అందకంటే ఎక్కువ శ్రధ్దపెట్టాలని కేంద్ర పెద్దలు భావించారు. అందుకే తెలంగాణలో ఇప్పటి నుంచే ఆపరేషన్ లోకల్ మొదలు పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ లోకల్‌లో భాగంగా తెలంగాణలోని జిల్లాల వారీగా పార్టీ బలాలు, బలహీనతలు గుర్తించే బాధ్యతను కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అప్పగించినట్లుగా సమాచారం. ముఖ్యంగా ఖమ్మం,వరంగల్ , నల్గండ జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఫిక్సయ్యారట కేంద్రపెద్దలు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ జిల్లాలోనే పార్టీ బలహీనంగా ఉందని రాష్ట్ర నాయకత్వంతోపాటు, కేంద్రం సైతం ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూడు జిల్లాల్లో పార్టీ బలాలు ,బలహీనతలు వెంటనే గుర్తించాలి. స్థానిక సమస్యలపై పోరాటం చేసేందుకు కార్యచరణ రూపొందించాలి. ఇతర పార్టీల నుంచి సమర్ధులైన నాయకులను ఆకర్షించాలి. పార్టీలో చేరికలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని కదిలించేలా నిరసనలు, ఆందోళనలు చేసేందుకు బిజెపి నేతలు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల‌్లో ఇప్పటికే ఏర్పడ్డ బూత్ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీల ఎన్నికపై మరోసారి క్రాస్ చెక్ చేసేందుకు ఇన్ ఛార్జ్ లను అధిష్టానం నియమించినట్లు తెలుస్తోంది. క్యాడర్‌ను ఉత్తేజపరిచే కార్యక్రమాలతోపాటు, ఆర్ ఎస్ ఎస్, విహెచ్పీ వంటి సంఘ్ పరివార్ సంస్దలతో కలసి ప్రజాసమస్యలపై పోరాటం చేయడం ద్వారా లోకల్ గా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది. ఇలా ఓ వైపు ఈ జిల్లాలో నిర్మాణాత్మకంగా కార్యకర్తలను తయారు చేసుకోవడంతోపాటు, ప్రభుత్వం చేపట్టే ప్రజావ్యతిరేక విధానాలపై జనాన్ని సంఘటితం చేయడం, వారికి మద్దతుగా పోరాడుతూ బిజేపీ అంటే లోకల్, లోకల్ అంటే బిజెపి అనేలా ఇప్పటి నుంచి ప్రజలకు మరింత దగ్గరవ్వాలని భావిస్తోంది. ఇలా ఆపరేషన్ లోకల్ పై దృష్టిపెట్టడం ద్వారా అధికారం చేతి నుంచి కమలం వశం చేసుకొచ్చనే మాస్టర్ ప్లాన్‌తో తెలంగాణలో బీజెపి వ్యూహాత్మకంగా దూసుకోపోతోంది.