
గుంటూరు, మే1,
ఏపీలో ఒక్కొక్కటిగా మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కూటమి ఖాతాలోకి చేరుతున్నాయి. వైసీపీ కైవసం చేసుకున్న మేయర్ పీఠాలన్నింటిని కూటమి దక్కించేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. కొద్ది రోజుల క్రితం విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకున్న కూటమి..తాజాగా గుంటూరు నగరపాలక సంస్థను కైవసం చేసుకుంది.ఈ రెండింటితో పాటు ఇప్పటికే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, ఏలూరు, జగ్గయ్యపేట, విజయవాడ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వైసీపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లంతా టీడీపీ-జనసేన- బీజేపీలో చేరుతుండటంతో మెజారిటీ కోల్పోయిన ఆయా స్ధానిక సంస్థల్లో వైసీపీ అధికారం కోల్పోతోంది. వైసీపీలో అసంతృప్తితో రగిలిపోతున్న కార్పొరేటర్లు, వ్యాపార అవసరాలకోసం కొందరు, తమ డివిజన్లలో అభివృద్ధి పనులు చేయించుకోడానికి కొందరు, వచ్చే కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇప్పటి నుంచే సీటు రిజర్వేషన్‌కు కొందరు..ఇలా ఎవరికి వారు తమ తమ అవసరాల కోసం పార్టీలు మారారు.దీంతో వైసీపీకి మెజార్టీ తగ్గిపోవడంతో కూటమి నేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి వారిని ఓడిస్తున్నారు. విజయవాడ తప్పించి మిగతా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూటమి అధికారం సొంతం చేసుకుంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా త్వరలో అవిశ్వాసం పెట్టే అవకాశం ఉందన్న చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని ఆ పార్టీ కార్పొరేటర్లు అంటున్నారట. ఆయా మున్పిపాలిటీల్లో ఛైర్మన్లు, కార్పొరేషన్లలో మేయర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేశారే తప్ప ప్రజాప్రతినిధులుగా పనిచేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వార్డుల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని పలుమార్లు వినతులు ఇచ్చినా మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు పట్టించుకోలేదని..దాంతో ప్రజల దృష్టిలో తాము చులకనైపోయినట్లు వైసీపీ కార్పొరేటర్లు వాపోతున్నారట.ఇలాంటి పరిస్థితుల్లో సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో ఏ జిల్లాలోనూ కనీస మెజార్టీ లేకపోవడంతో కూటమికి అన్ని విధాలుగా పైచేయి లభించింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రహదారులు, మంచినీటి సమస్య, డ్రైనేజి ఇతర మౌలిక సదుపాయాలు వంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేయడంతో ప్రజల్లో సానుకూలత పెరిగిందని టాక్.వైసీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీ మేయర్లంతా ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారట. అప్పటికే అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను కూటమి పార్టీలు ఆహ్వానించాయి. దీంతో ఎవరి అవసరం కోసం వారు ఆయా పార్టీల్లో చేరిపోయారు. మెజార్టీ పెరిగిన కూటమి పార్టీలు ఆయా కార్పొరేషన్లలో మేయర్లపై అవిశ్వాసం పెట్టించారు. వైసీపీ ఓడిపోవడంతో ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కూటమి పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయాయి.వారం-పది రోజుల వ్యవధిలోనే వైసీపీకి చెందిన GVMC, గుంటూరు కార్పొరేషన్ మేయర్ పీఠాలు కూటమిఖాతాలోకి చేరిపోయాయి. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో వైసీపీకి చెందిన మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై ఏప్రిల్ 19న ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మొత్తం 111 మంది సభ్యులు కలిగిన కౌన్సిల్‌లో కూటమికి 2/3 వంతు ఆధిక్యం దక్కడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గి మేయర్ పదవీచ్యుతులయ్యారు.మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించడంతో GVMC మేయర్ గా కూటమి అభ్యర్థి పిలా శ్రీనివాస్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంలోనే అతి పెద్ద కార్పొరేషన్ ఇప్పుడు కూటమి ఖాతాలోకి చేరింది. ఇదిలా ఉంటే ఇక గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా కూటమి ఖాతాలో చేరింది. గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ మనోహర్ నాయుడు తన పదవికి రాజీనామా చేశారు. దాంతో గుంటూరు మేయర్‌గా కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర గెలుపొందరు. నిన్నటి వరకు ఏ పార్టీ అభ్యర్థి కూడా పోటీ చేయకపోవడంతో అంతా ఏకగ్రీవం అనుకున్నారు. అయితే సోమవారం ఉదయం వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి పోటిలో నిలిచారు. దీంతో ఎన్నిక జరగ్గా. కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు.ఏపీలోని వైసీపీ మేయర్ పీఠాలన్నీ కూటమిలోకి వచ్చి చేరుతుండడంతో..ఆయా కార్పొరేషన్లలో విపక్ష వైసీపీ పని అయిపోయిందన్న టాక్ ఏపీ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. రాబోయే మరిన్ని మేయర్ పీఠాలను తనలో కలిపేసుకునేందుకు కూటమి పావులు కదుపుతుందన్న చర్చ జరుగుతోంది. ఒక్కో కార్పొరేషన్ చేజారిపోతుండడంతో..వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇక రాబోయే కాలమంతా గడ్డుకాలమే ఎదురుకానుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. కూటమి పవర్ ను తట్టుకోవడం అంత సులభమైన పనికాదని..అందుకు జగన్ చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.