
ఏలూరు, మే 1,
ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకునే ప్రాజెక్టు రూపుదిద్దుకుంటున్న నియోజకవర్గం పోలవరం. 2024 ఎన్నికల్లో ఊహించని విధంగా ఇక్కడ జనసేన జెండా ఎగిరింది. సరైన క్యాడర్ లేకపోయినా.. నడిపించే నాయకులు లేకున్నా… కూటమి వేవ్‌లో, టిడిపి సహకారంతో జనసేన తరపున గెలిచారు చిర్రి బాలరాజు. ఎన్నికలకు అవసరమైన నిధులు సమకూరే వరకు, ఫలితాలు వచ్చే వరకు అందరితో సఖ్యతగా ఉన్నట్టు వ్యవహరించిన బాలరాజు గెలిచాక మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తున్నారట. సొంతగా జట్టును పెట్టుకుని ప్రతి పనికీ పర్సంటేజ్ ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజకీయ దూరాలోచనతో కాకుండా…. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకొవాలన్న తపన ఆయనలో కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు స్థానికంగా. మద్యం షాపుల నుంచి ఇసుక అక్రమ రవాణా వరకు.. పోలవరం నిర్వాసితులకు పరిహారం అందించడం నుంచి అభివృద్ది పనుల్లో పర్సంటేజీలదాకా…అన్నింట్లోనూ తన వాటా తనకు చేరేలా ఎమ్మెల్యే జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా పోలవరం నియోకవర్గంలో విలీనమైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎమ్మెల్యే అనుచరగణం హంగామా ఎక్కువైనట్టు తెలుస్తోంది.పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నష్టపరిహారం మీద కన్నేశారట కుక్కునూరు మండలంలోని ఎమ్మెల్యే మనుషులు. బిల్లులు చెల్లించాలన్నా, నష్టపరిహారం అకౌంట్లో జమకావాలన్నా తమకు పర్సెంటేజ్ ఇవ్వాల్సిందేనని తెగేసి చెబుతున్నట్టు సమాచారం. అవగాహన కుదరడంతో… అధికార యంత్రాంగం సైతం అక్కడ మండల స్థాయి నాయకుల మాటకే ప్రాధాన్యం ఇస్తోందని, నష్టపరిహారం అకౌంట్లలో పడాలంటే ముందు ఫలానా వాళ్ళని కలవమని సూచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. విలీన మండలాలతోపాటు నియోజకవర్గంలోని మిగతా చోట్ల ఇదే తంతు కొనసాగుతున్న సమయంలోనే…పోలవరం నిర్వాసితులను దళారులు దోచేస్తున్నారంటూ ఎమ్మెల్యే మాట్లాడ్డం కామెడీగా ఉందంటూ తెలుగుదేశం నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. తమకి దక్కాల్సిన సీటును పొత్తులో త్యాగం చేసి దగ్గరుండి గెలిపిస్తే.. చివరికి మమ్మల్నే దగ్గరికి రానివ్వడంలేదనేది మిగతా మండలాల టీడీపీ నాయకుల బాధగా తెలుస్తోంది. అవకాశం వచ్చింది బాగుపడటానికేగాని బాగోగులు తెలుసుకోడానికి కాదన్నట్టు ఎమ్మెల్యే అండ్ గ్యాంగ్ తయారయ్యారంటూ సీరియస్‌గా ఉన్నారట తెలుగు తమ్ముళ్లు. అధికారిక కార్యక్రమాల్లో కలసి ఎమ్మెల్యేకి ఏదన్నా చెప్పుకుందామనుకుంటే… అసలు ఆహ్వానాలే అందట్లేదట. కలిసొచ్చిన అదృష్టాన్ని విచ్చలవిడిగా వాడేద్దామనుకుంటున్న జనసేన ఎమ్మెల్యే అండ్‌కో ఇప్పుడు టీడీపీ లీడర్స్‌ని పక్కకు నెట్టేసి… అధికార యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకుని కథ నడిపించేస్తున్నారట. ప్రాజెక్ట్ నిర్వాసితులకు చెందాల్సిన భూములను తక్కువ రేట్లకు లీజుకు తీసుకున్నవారి విషయంలో సెటిల్మెంట్లు చేయడం ఒక ఎత్తైతే.. ఎమ్మెల్యే అనుచరవర్గం చెప్పింది చెప్పినట్టు చేస్తున్న కొందరు అధికారులు… మేం నిండా మునిగిపోతున్నామని వాపోతున్నా పట్టించుకునేవారే లేరట. ఎవరన్నా కాదు కూడదని అంటే… బెదిరిస్తున్నట్టు సమాచారం.ఇటీవల ఎమ్మెల్యే అనుచరవర్గం జీలుగుమిల్లి ఇంఛార్జి ఎమ్మార్వోని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములను కొట్టేశారన్న ఫిర్యాదు అందింది. దానిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు చివరికి ఇన్చార్జి ఎమ్మార్వోని సస్పెండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే అనుచరుల ధనదాహానికి తామెక్కడ బలవుతామోనన్న టెన్షన్ పెరుగుతోందట అధికారుల్లో. మొత్తానికి పోలవరం జనసేన ఎమ్మెల్యే…. కలిసొచ్చిన అదృష్టాన్ని….. బాగా… గట్టిగానే…. సద్వినియోగం చేసుకుంటున్నారన్న చర్చ నడుస్తోంది పోలవరంలో. నిత్యం జనంలో ఉండి మిగతా నేతలకు ఆదర్శంగా నిలబడండంటూ జనసేన అధినేత ఇచ్చిన పిలుపును పోలవరం నేతలు కాస్త తేడాగా అర్ధం చేసుకున్నారంటూ సెటైర్స్ పడుతున్నాయి. ఏం డేరింగ్ బిజినెస్ గురూ… అంటూ ఎకసెక్కాలాడుతున్నా పట్టించుకునే స్థితిలో లేరట పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు.