
తిరుపతి, మే 1,
సీనియర్ సిటిజన్ డిజిటల్ కార్డును పొందడానికి 60 ఏళ్లు నిండిన పురుషులు మరియు 58 ఏళ్ళు నిండిన మహిళలు అర్హులు. ఈ డిజిటల్ కార్డులపై ఆ వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ మరియు అత్యవసర సంప్రదింపు నెంబర్లు కూడా ఉంటాయి. ఈ డిజిటల్ కార్డుల కోసం అర్హులైన వయోవృద్ధులు సచివాలయం కు వెళ్లి పాస్పోర్ట్ ఫోటో, ఆధార్, కుల ధ్రువ పత్రం, బ్యాంకు ఖాతాతో రూ.40 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ డిజిటల్ కార్డు పొందిన వాళ్లు ప్రభుత్వ పథకాలలో రాయితీ అలాగే రవాణా సౌకర్యాలు, బ్యాంకింగ్ ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం వయోవృద్ధులను దృష్టిలో పెట్టుకొని వాళ్లకు అనేక సౌకర్యాలను కలిగించేందుకు ముందుకు అడుగులు వేస్తుంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల ద్వారా వయోవృద్ధులకు సీనియర్ సిటిజన్ కార్డులను డిజిటల్ రూపంలో అందించేందుకు అన్ని పనులను ప్రారంభించింది.ఈ డిజిటల్ గుర్తింపు కార్డు 60 ఏళ్ళు నిండిన పురుషులకు మరియు 58 ఏళ్లు నిండిన మహిళలకు ప్రభుత్వం జారీ చేస్తుంది. అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో అనేక రకాల సేవలను పొందడానికి వయోవృద్ధులకు ఈ కార్డు చాలా ఉపయోగపడుతుంది. సీనియర్ సిటిజనులకు ఇది ఒక గుర్తింపు పత్రం గా మాత్రమే కాకుండా ఈ కార్డులో అనేక ముఖ్యమైన సమాచారం కూడా ఉంటుంది. ఈ డిజిటల్ కార్డుపై ఆ వ్యక్తి యొక్క బ్లడ్ గ్రూప్ తో పాటు వాళ్ళు అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు కూడా ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది.డిజిటల్ కార్డు పై ఉన్న ఈ వివరాలు వారికి ఏదైనా ఆరోగ్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడిన సందర్భంలో వచ్చిన సహాయం అందించడానికి చాలా ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. అర్హులైన వయోవృద్ధులు ఈ డిజిటల్ కార్డును పొందడం చాలా సులభం. వాళ్లు తమ పాస్పోర్ట్ సైజు ఫోటోతో పాటు ఆధార్ కార్డు అలాగే బ్యాంకు ఖాతా వివరాలు మరియు కుల ధ్రువపత్రం వంటివి తీసుకొని వెళ్లి తమకు సమీపంలో ఉన్న గ్రామా లేదా వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ కార్డు పొందడానికి నామమాత్రపు రుసుము రూ.40 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మీ ఆధార్ కార్డుతో అనుసంధానం అయ్యి ఉన్న మొబైల్ ఫోన్ కూడా తీసుకొని వెళ్ళాలి. ఈ పత్రాలన్నీ తీసుకొని వెళ్తే మీకు కేవలం 10 నిమిషాలలో ప్రక్రియ పూర్తి అవుతుంది.