
నెల్లూరు, మే 3,
కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏప్రిల్ మూడో తేదీన ఆయన పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం దొరకడం లేదు. హైకోర్టులో కాకాణి గోవర్థన్ రెడ్డి ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో ఆయన అప్పటి నుంచి అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి దాదాపు ఏడు బృందాలు పోలీసులు నిరంతరం గాలిస్తున్నాయి. ఎక్కడా ఆయన ఆచూకీ దొరకడం లేదు. గత కొన్ని రోజులుగా కాకాణి గోవర్థన్ రెడ్డి కనిపెట్టలేకపోవడంతో పోలీసులపై ప్రభుత్వం పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దాదాపు నెల రోజుల నుంచి కాకాణి తప్పించుకుతిరుగుతున్న పట్టుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కాకాణి గోవర్థన్ రెడ్డి పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నారు. హైకోర్టులో కూడా ఆయనకు ముందస్తు బెయిల్ రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్థన్ రెడ్డి తప్పించుకుతిరుగుతుండటంతో నెల్లూరు, హైదరాబాద్, చెన్నై ప్రాంతాలకు వెళ్లిన పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. కాకాణి గోవర్థన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసులు నమోదయ్యాయి. ఎస్టీ, ఎస్టీ కేసు కూడా నమోదయింది. విచారణకు హాజరు కాకుండా ఉన్న కాకాణిని ఎలాగైనా అరెస్ట్ చేయాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఎన్నిమార్లు ఇంటికి వెళ్లినా కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఒకటే సమాధానం. తమకు తెలియదని, కాకాణి గోవర్థన్ రెడ్డి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉండటంతో పాటు ఆయన ఎక్కడకు వెళ్లారన్నది అర్థం కాకుండా ఉంది. పోలీసులు అన్ని రకాలుగా నిఘా పెట్టారు. కాకాణి గోవర్థన్ రెడ్డికి సంబంధించిన సన్నిహితుల పై కూడా కన్నేసి ఉంచారు. వారి ఫోన్లను కూడా ట్రాప్ చేస్తున్నారు. అయినా కాకాణి గోవర్థన్ రెడ్డి మాత్రంఎవరికీ ఫోన్లు చేయడం లేదు. ఇలా దాదాపు నెల రోజుల నుంచి పోలీసుల కళ్లుగప్పితప్పించుకుని తిరుగుతుండటం పోలీసులకు సవాల్ గా మారింది. అనుమానం వచ్చిన అన్ని ప్రదేశాల్లో వెదుకుతున్నా ఆయన ఆచూకీ ఇసుమంత కూడా దొరకకపోవడంతో ఉన్నతాధికారుల చేత చీవాట్లు తింటున్నారు. మొత్తం మీద కాకాణి గోవర్థన్ రెడ్డి పోలీసులకు చిక్కడు దొరకడు అన్న రీతిలో తప్పించుకుతిరుగుతున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.