
విజయవాడ, మే 3,
ఆ ఇద్దరు నేతలు తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు. ఎన్నో కీలక పదవులు అనుభవించారు. కానీ అనుకోని రీతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ అక్కడ కూడా అనుకున్నంత సక్సెస్ కాలేకపోయారు. కేవలం అప్పటి అధికార వైసీపీ ఒత్తిళ్లకు తలోగ్గి ఆ పార్టీలోకి జంప్ చేశారు. కానీ ఇప్పుడు తిరిగి మాతృ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించకపోవడంతో వారు పొలిటికల్ సర్కిల్లో నిలబడ్డారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏంటా కథ? అంటే వివరాల్లోకి వెళ్దాం.ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయంగా చైతన్యవంతం అయ్యింది. ఈ జిల్లా నుంచి ఎంతోమంది హేమాహేమీలు రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అందులో ఒకరు కరణం బలరామకృష్ణ. సుదీర్ఘకాలం టిడిపి నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన బలరామకృష్ణకు మంత్రి పదవి అన్నది దక్కకుండా పోయింది. ప్రకాశం జిల్లా రాజకీయాలను శాసించిన ఈ నేత అమాత్య అని అనిపించుకోలేకపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి మంత్రిగా అవుతానని భావించారు. కానీ అది కూడా సాధ్యం కాలేదు. మరో మాజీ మంత్రి సిద్దా రాఘవరావు ది విచిత్ర పరిస్థితి. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేయించారు. ఓడిపోవడంతో రాఘవరావు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేవలం వ్యాపారాలపై ఒత్తిడి పెరగడంతోనే వీరు వైసీపీలో చేరినట్లు ఒక ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు తిరిగి టిడిపిలో చేరేందుకు వీరిద్దరూ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.కరణం బలరాం విషయంలో టిడిపి నుంచి అనేక అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే చీరాల నుంచి టిక్కెట్ ఇచ్చారు చంద్రబాబు. గెలిచిన తర్వాత పార్టీ క్లిష్ట సమయంలో ఉండగా గుడ్ బై చెప్పారు కరణం బలరాం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కరణం బలరామును పార్టీలో చేర్పించుకోవద్దని చంద్రబాబుపై టిడిపి శ్రేణుల ఒత్తిడి ఉంది. దీంతో చంద్రబాబు సైతం కరణం బలరాం విషయంలో ముఖం మీద చెప్పినట్లు సమాచారం. అయితే ఆయనను జనసేనలో చేర్పించేందుకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. తన కుమారుడు వెంకటేష్ రాజకీయ భవిష్యత్తు కోసం జనసేనలో చేరేందుకు బలరాం దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.మరోవైపు సిద్దా రాఘవరావు విషయంలో మాత్రం టిడిపిలో సానుకూలత వ్యక్తం అవుతోంది. ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సి వచ్చింది. వాస్తవానికి రాఘవరావుకు అరుదైన అవకాశం ఇచ్చారు చంద్రబాబు. 2014లో గెలవడంతో తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. 2019లో ఎంపీగా కూడా పోటీ చేశారు రాఘవరావు. అయితే ఆయనకు గ్రానైట్ తో పాటు ఇతరత్రా వ్యాపారాలు ఉన్నాయి. అప్పటి అధికార వైయస్సార్ కాంగ్రెస్ ఒత్తిడి చేసి రాఘవరావును పార్టీలో చేర్చుకుందని.. తీరా చేర్చుకున్నాక పట్టించుకోకుండా మానేసింది అన్న సానుభూతి ఆయనపై ఉంది. అందుకే రాఘవరావు విషయంలో చంద్రబాబు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడం ఖాయమని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.