
విజయవాడ, మే 5,
వైసీపీ అధినేత జగన్ కు ఇప్పుడు కష్టాలు మొదలవుతాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయి ఏడాది పూర్తి కావస్తుండటంతో ఇక జగన్ ను అన్ని రకాలుగా అష్ఫదిగ్భంధనం చేసే పనిలో ఉన్నారు. ఎటూ కదలకుండా కేసులు జగన్ ను చుట్టుముట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఎప్పటి నుంచో జగన్ అరెస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. తమ అధినేత చంద్రబాబును నాడు స్కిల్ డెవెలెప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి జైలులో ఉంచిన ఘటనను నేటికీ మరిచిపోలేకపోతున్నారు. చిన్నా చితాకా నాయకులను అరెస్ట్ చేసినప్పటికీ, వివిధ కేసులను నమోదు చేసినప్పటికీ వారు శాంతించడం లేదు. అసలు పెద్ద చేపను పట్టుకోవాలంటూ సోషల్ మీడియాలో తెలుగు తమ్ముళ్లు ఫైర్ అవుతున్నారు. దీంతో ఒక్కొక్క కేసు కూడా జగన్ మెడకు చుట్టుకునే అవకాశాలున్నాయి. మద్యం స్కామ్ కేసులో కీలక నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు జగన్ పై కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన రాజ్ కసిరెడ్డి ఇచ్చిన వాంగ్మూలంతో పాటు కస్టడీలో ఆయన చెప్పిన విషయాలతో జగన్ పై కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఆషామాషీగా కాకుండా పక్కా ఆధారాలతో కేసులు నమోదు చేయాలని పై నుంచి ఆదేశాలు ఉండటంతో అన్నీ ఆధారాలను తీసుకున్న తర్వాత కేసు నమోదు చేసే అవకాశముంది మరొకవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక దందాపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇసుకతో పాటు పక్కా ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలను కూడా బయటకు తీస్తున్నారు. ఇక విశాఖపట్నంలో పలు చోట్ల భూకబ్జాలకు పాల్పడిన విషయాలపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయి. వీటన్నింటికీ సూత్రధారి జగన్ అని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. జగన్ ను అరెస్ట్ చేయాలంటే ఒక్క కేసుతో సరిపెట్టడం కంటే వరస కేసులు నమోదు చేస్తూ జైలులో నుంచి బయటకు రానివ్వకుండా చేయాలన్న ఆలోచనలో ఉండి అన్ని కేసులను కూలంకషంగా శోధించి అందుకు సంబంధించిన ఆధారాలను పకడ్బందీగా సేకరిస్తున్న పోలీసులు త్వరలోనే కేసు నమోదు చేయాలన్న ఉద్దేశ్యంతో ఉన్నట్లు తెలిసింది. అందుకే ఇన్ ఛార్జుల సమావేశంలో... రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకూ వేచి ఉన్న పోలీసులు ఇప్పుడు కేసుల విషయంలో మరింత వేగం పెంచారు. లిక్కర్ స్కామ్ తో పాటు శాండ్ స్కామ్, బియ్యం అక్రమ రవాణా, భూ కబ్జాలు ఇలా అన్ని వైపుల నుంచి కార్నర్ చేసేలా నరుక్కుంటూ వస్తున్నారు. జగన్ కు కూడా ఈ సంకేతాలు అందడంతోనే ఇటీవల జరిగిన జిల్లా ఇన్ ఛార్జి సమావేశాల్లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చారంటున్నారు. వారి ముందు క్యాలెండర్ కూడా పెట్టారంటున్నారు. బూత్ లెవెల్ లో నియామకాలు చేపట్టేందుకు కూడా డెడ్ లైన్ పెట్టారని, తాను బయట ఉండే అవకాశంలేదని తెలుసుకుని జగన్ ఈ రకమైన డెసిషన్ తీసుకున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందన్నది చూడాలి.