YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మూడేళ్లలో ముగింపు సాధ్యమేనా

మూడేళ్లలో ముగింపు సాధ్యమేనా

గుంటూరు, మే 5,
అమరావతి రాజధాని రీలాంచ్ పనులు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన పూర్తయిన తర్వాత పాత డిజైన్లతోనే నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటికే సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాలకు సంబంధించిన డిజైన్లు పూర్తి కావడంతో పాటు వాటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఇక నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీనులైన వేదిక నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడేళ్లలో అమరావతి రాజధాని పనులను పూర్తి చేస్తామని చెప్పారు. మోదీ కూడా తన ప్రసంగంలో మూడేళ్లలో పూర్తి అవుతుందని తెలిపారు. దీంతో అమరావతి రాజధాని నిర్మాణ బాధ్యతలన్నీ మున్సిపల్ మంత్రి నారాయణకు చంద్రబాబు నాయుడు అప్పగించారు.అయితే మూడేళ్లలో అమరావతి నిర్మాణపనులు పూర్తి కావడం అంటే ఆషామాషీ కాదు. 365 రోజులు 24 X 7 పనిచేసినా సమయం సరిపోతుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పునాదులు తీయడం నుంచి నిర్మాణాలు పూర్తి చేయాలంటే అంత సులువు కాదని ఇంజినీరింగ్ నిపుణులు చెబుతున్నారు. ఒక్కొక్క టవర్ నిర్మాణం చేయాలంటే ఎంతో సమయం తీసుకుంటుంది. అందుకు అవసరమైన ముడిసరుకుతో పాటు అనుభవజ్ఞులైన ఇంజినీర్లతో పాటు కార్మికులు కూడా అవసరం. అంతా తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులు రాజధాని నిర్మాణ పనులకు తరచూ అంతరాయం ఏర్పరచే అవకాశముందని అంచనాలు వినపడుతున్నాయి వర్షాలు.. తుపానులు... సముద్ర తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం కావడంతో నిత్యం వర్షాలతో పాటు తుపానులు కూడా ఏడాదిలో ఎక్కువ సార్లు వస్తుంటాయి. జులై నెల వచ్చిందంటే ఇక వర్షాలు మామూలుగా పడవు. ఆగస్టు నుంచి కొంత వర్షాల విషయంలో తెరిపి ఇచ్చినప్పటికీ అక్టోబరు, నవంబరు నెలలో తుపానులు పొంచి ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతానికి అమరావతి దగ్గరగా ఉండటంతో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు పడితే పనులకు ఆటంకం ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు. మే నెలలో డిజైన్లు ఖరారయి పనిలో దిగి పునాదులు తవ్వేసరికి జులై వచ్చేస్తుంది. ఇక వర్షాలతో పనులు ముందుకు సాగే అవకాశం లేదు. పోలవరం పనులే పదేళ్ల నుంచి వివిధ ఆటంకాలతో పూర్తి కాకపోవడాన్ని చూసినట్లు ఇంజినీర్లు చెబుతున్నారు. వేసవిలో కూడా అకాల వర్షాలు ముంచెత్తుతున్నాయి. మరో వైపు కృష్ణానదికి వరద ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. వరద వస్తే మాత్రం అమరావతి ప్రాంతంలో నీరు చేరుతుంది. ఇది కూడా పనులకు ఆటంకంగా మారతాయి. వీటికి తోడు పండగలు, పబ్బాలు ఇలా అన్ని కలుపుకుంటూ పోతే మూడేళ్ల సమయం ఇంత పెద్ద సమయంలో పనులు పూర్తి చేయడం సాధ్యం కాకపోవచ్చన్నది ఇంజినీరింగ్ నిపుణుల అంచనా. ఏదైనా ఒక భవనం అయితే పూర్తి చేయవచ్చు కానీ.. యుద్ధ ప్రాతిపదికపై అన్ని హంగులతో బరిలోకి దిగినా ప్రకృతి ఏ మేరకు రాజధాని నిర్మాణానికి సహకరిస్తుందన్నది ఇప్పుడు అందరిలోనూ టెన్షన్ రేపుతుంది. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు టెండర్లు దక్కించుకున్న సంస్థలు వీలయినంత త్వరగా పనులు ప్రారంభించి పూర్తి చేయాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?

Related Posts