
తిరుపతి, మే 5,
ఏపీ లిక్కర్ స్కాంపై స్కాన్ చేస్తున్న సిట్ మరింత దూకుడు పెంచింది. కేసులో కింగ్ పిన్ గా వ్యవహరించిన రాజ్ కేసిరెడ్డి అరెస్టుతో లిక్కర్ డొంకంతా కదులుతోందన్న టాక్ విన్పిస్తోంది. సిట్ విచారణలో కేసిరెడ్డి చెప్తున్న కీలక విషయాల ఆధారంగా విచారణనను మరింత స్పీడప్ చేసింది. ఏపీ లిక్కర్ స్కాంతో సంబంధం ఉందటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మరింత మందిని అరెస్ట్ చేసేందుకు సిట్ పావులు కదుపుతుందని సమాచారం.ఈ కేసులో లింక్ ఉన్న ప్రతీ ఒక్కరిని అరెస్ట్ చేసి విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ఏపీ రాజకీయవర్గాల్లో టాక్ విన్పిస్తోంది. ఇప్పటివరకు సాగిన విచారణ ఓ లెక్క…ఇకనుంచి సాగనున్న విచారణ మరో లెక్క అనేవిధంగా సిట్ విచారణ కొనసాగనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ గత ప్రభుత్వంలో సీఎంలో పనిచేసిన టీం పెట్టుకున్న పిటిషనును ఏపీ హైకోర్టు విచారించింది. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో..గత ప్రభుత్వంలో జగన్ ఓఎస్డీగా పనిచేసిన క్రిష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ తప్పదా అన్న చర్చ జరుగుతోంది.ఇప్పటికిప్పుడు బెయిల్ ఇవ్వలేమని ఏపీ హైకోర్టు తేల్చి చెప్పడంతో వీరంతా భయపడుతున్నారట. ఎందుకంటే లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన కొందరు నిందితులు తమ పేర్లు చెప్పినందున ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఈ ముగ్గురు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేశారు. నిందితులు తమ పేర్లు చెప్పారని, వారి రిమాండ్ రిపోర్టులు ఆధారంగా తమను అరెస్టు చేసే అవకాశం ఉందని గత ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేసిన క్రిష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డిని అరెస్ట్ భయం వెంటాడుతోందట.అంతేకాదు మద్యం స్కాంలో పాత్రధారిగా అనుమానిస్తున్న బాలాజీ గోవిందప్ప సైతం అరెస్ట్ భయంతో టెన్షన్ పడుతున్నారని టాక్. బెయిల్ ఇవ్వడం కుదరదని హైకోర్టు స్పష్టం చేయడంతో త్వరలోనే ఈ ముగ్గురు అధికారులు అరెస్ట్ తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డిని సిట్ కస్టడీలోకి తీసుకొని విచారిస్తోంది. అయితే కస్టడీలో కేసిరెడ్డి పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.సిట్ అధికారులు మాత్రం మరింత లోతుగా ప్రశ్నించేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు లిక్కర్ స్కాంకు బీజం వేసిందెవరు? ఇందులో ఎవరెవరు ఉన్నారు.? వారి మధ్య ఎలాంటి సంబంధాలున్నాయి? ఎంత నగదు లావాదేవీలు జరిగాయి.? మొత్తం ఎంత మద్యం సేల్ అయింది? మిగిలిన నిందితులెవరు? కీలక సాక్షిగా భావిస్తున్న విజయసాయిరెడ్డి చెప్పినదంతా నిజమేనా? అన్న ప్రశ్నలు సంధిస్తూ సమాధానాలు రాబట్టే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అంటున్నారు మరోవైపు కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఆస్తుల వివరాలను సిట్ సేకరిస్తోంది. స్కామ్జరిగిన సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలివ్వాలని రిజిస్ట్రార్ శాఖ ఐజీకి లేఖలు ఇచ్చింది సిట్. ఏపీతో పాటు తెలంగాణ ఐజీ రిజిస్ట్రార్కు కూడా లేఖ రాసింది. కేసిరెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు సిట్అధికారులు. మరోవైపు కేసిరెడ్డి పీఏ పైలా దిలీప్ ను కూడా సిట్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసిరెడ్డి ఆర్థిక వ్యవహారాలన్నీ దిలీప్ చూశాడని సీట్ గుర్తించింది.మొత్తానికి ఏపీ లిక్కర్ స్కాం తేనెతుట్టే కదులుతోందన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత ప్రభుత్వంలో జగన్ ఓస్టీగా పనిచేసిన అధికారుల అరెస్ట్ కు ఏపీ హైకోర్టు లైన్ క్లియర్ చేయడంతో…ఇక ఆ తర్వాత అరెస్టులు పెద్ద తలకాయలదాకా వెళ్తుందా అన్న అనుమానాలు వైసీపీ వర్గాల్లో విన్పిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏదైనా జరగవచ్చు..జరగకపోవచ్చు అనే టాక్ విన్పిస్తోంది. అయితే సిట్ ఇంకా ఎవరెవరిని అరెస్టు చేస్తుంది అన్నది చూడాలి.