
విజయవాడ, మే 5,
నందమూరి తారక రామారావు ఆ పేరే ఒక ప్రభంజనం. ఆ పేరులో ఉంటుంది ఓ వైబ్రేషన్. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చిన రికార్డ్ ఆయనకే సొంతం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. పేద, బడుగు వర్గాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారు. వెండితెరపై భగవంతుడిగా సాక్షాత్కారం ఇచ్చారు ఎన్టీఆర్. ఎన్నెన్నో పౌరాణిక పాత్రలతో మెప్పించారు. సినీ రంగంలో ఉంటూనే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. రాజకీయాల్లోకి వచ్చి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అటువంటి మహోన్నత శిఖరానికి సరైన గుర్తింపు లభించలేదు. భారతరత్న పురస్కారం అందని ద్రాక్షగా ఉంది. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ విషయంలో సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో నిన్ననే అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభలో ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దీంతో ఎన్టీఆర్ కు భారతరత్న పురస్కారం ఇవ్వాలన్న విన్నపం మరోసారి తెరపైకి వచ్చింది. నందమూరి తారక రామారావు చనిపోయి 29 సంవత్సరాలు అవుతోంది. ఆయన తెలుగు ప్రజల మదిలో చిరస్థాయిగా ఉన్నారు. కానీ ఇంతవరకు ఆయనకు అత్యున్నత పురస్కారం భారతరత్న అందివ్వలేదు. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని చాలా రోజులుగా డిమాండ్లు, విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నుంచి సాధారణ వ్యక్తుల వరకు అందరూ అదే డిమాండ్ వినిపిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతామని పదేపదే నరేంద్ర మోడీ చెప్పుకొస్తున్నారు. కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ఆలోచించడం లేదు. ప్రతి రిపబ్లిక్ డేకు ముందు ఎన్టీఆర్ భారతరత్న ఇస్తారని తెలుగువారు ఎదురుచూడడం.. తరువాత నిరాశలో మునిగిపోవడం జరుగుతోంది. ప్రస్తుతం ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉండడం.. కేంద్ర పెద్దలు సైతం సానుకూలంగా ఉండడంతో వచ్చే ఏడాదికైనా ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు.పొరుగున ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ కుమరణానంతరం భారతరత్న పురస్కారం దక్కింది. కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. దీనికి కారణాలు లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించారు నందమూరి తారక రామారావు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఏలుబడి ఉన్న క్రమంలో ప్రాంతీయ పార్టీలకు దిక్సూచిగా నిలిచారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఎన్టీఆర్ అంటే విపరీతమైన కోపం. అయితే ఎన్టీఆర్ మరణించిన తర్వాత టిడిపి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉండేది. ఆ సమయంలో కూడా ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు లభించలేదు. తరువాత యూపీఏ, యూపీఏ 2 ప్రభుత్వాలు వచ్చాయి. అప్పుడు కూడా కనీస పరిగణలోకి తీసుకోలేదు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించలేదు.అయితే ఇప్పుడు ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ప్రధాని మోదీ చంద్రబాబు విన్నపాలను మన్నిస్తున్నారు. అదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి ఉన్నారు. ఆమె ఎన్టీఆర్ కుమార్తె. చంద్రబాబుతో పాటు పురందేశ్వరి ప్రయత్నిస్తే నందమూరి తారక రామారావుకు తప్పకుండా భారతరత్న వచ్చే అవకాశం ఉంది. ప్రధాని మోదీ తాజాగా ఎన్టీఆర్ ప్రస్తావన తీసుకురావడంతో.. వచ్చే ఏడాది తప్పకుండా భారతరత్న ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.