
విజయవాడ, మే 6,
ఆంధ్రుల రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులు షురూ అయ్యాయి. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన పనులను తిరిగి పట్టాలెక్కించే పనిలో ఏపీ ప్రభుత్వం పడింది. ఇందులో భాగంగా అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. భారీ సభా వేదికపై నుంచి కీలకమైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునరుద్ధరణ సహా రాష్ట్ర పరిధిలో రూ.58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ మే 2వ తేదీన శంకుస్థాపన చేశారు. అంతేకాదు రాజధాని నిర్మాణానికి పూర్తి మద్దతు ఉంటుందని హామీనిచ్చారు. అమరావతి అంటే కేవలం ఒక నగరం మాత్రమే కాదని… ఒక శక్తి అంటూ వ్యాఖ్యానించారు.రాజధాని పనుల పునరుద్ధరణ పనుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వర్గాల్లో మళ్లీ ఆశలు చిగురుస్తున్నాయి. గత ఐదేళ్లలో పూర్తిగా డీలాపడిపోయిన పరిస్థితి ఉండగా… ప్రస్తుతం పునర్ధురణ పనులు జరుగుతుండటంతో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం చర్యలు… డెవలపర్ల, ఇన్విస్టెర్లలో అత్మవిశ్వాసాన్ని పెంచే దిశగా ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.అమరావతి నిర్మాణం పునఃప్రారంభంలో భాగంగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు, జ్యుడీషియల్ రెసిడెన్షియల్ క్వార్టర్ల నిర్మాణంతో పాటు 5,200 కుటుంబాలకు ఇళ్ల భవనాలు సహా రూ.49,000 కోట్ల విలువైన 74 ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. అమరావతి నగరం కల సాకారమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అమరావతి పనులు… ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేస్తాయని చెప్పారుకీలకమైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయడంతో ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం పునరుద్ధరణకు మంచి అవకాశాలు ఉన్నాయని క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బయన శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.ఆరు నెలలుగా డెవలపర్లు, ఇన్వెస్టర్లలో సెంటిమెంట్లో సానుకూల మార్పును గమనించామని ఆయన చెప్పారు. ముఖ్యంగా అమరావతి పనులు పట్టాలెక్కడంతో పాటు ప్రభుత్వం తరపున క్రియాశీలక భాగస్వామ్యం ఉండటంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో స్పష్టత, విశ్వాసం పుంజుకున్నాయని చెప్పారుఅమరావతిలో పెట్టుబడి పెట్టాలంటే అంతకుముందు ఇన్వెస్టర్లలో అనిశ్చితి నెలకొని ఉండేది. ఇన్వెస్టర్లకు తమ పెట్టుబడులు పెరుగుతాయన్న భరోసా ఉండాలి. గతంలో లేకుండేది. ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది. పెట్టుబడిదారుల కార్యకలాపాలు పెరగడంతో వచ్చే ఆరు నెలల్లో భూముల ధరలు 15-20 శాతం పెరుగుతాయని ఆశింవచ్చు” అని శ్రీనివాసరావు తెలిపారు.హైదరాబాద్ కు చెందిన కు చెందిన హను రెడ్డి రియల్టర్ జీవీ జగదీష్ ప్రకారం…. “ఈ ప్రాంతంలో సగటు భూమి రేట్లు చదరపు గజానికి రూ .25,000 రూ .30,000 మధ్య ఉన్నాయి. నిర్మాణ ప్రాపర్టీ ధరలు చదరపు అడుగుకు రూ .4,000 వరకు ఉన్నాయి. స్థలాన్ని బట్టి భూముల ధరలు మారుతుంటాయి. శివార్లలోని వ్యవసాయ ప్లాట్ల ధర ఎకరానికి రూ.2-3 కోట్లుగా ఉంది. కీలకమైన గ్రోత్ కారిడార్ అయిన అమరావతి-గుంటూరు బెల్ట్ లో ప్రధాన భూమి ధర ఎకరాకు రూ.5-10 కోట్ల వరకు ఉంది” అని వివరించారు.“ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల భవిష్యత్తు ప్రభుత్వ నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. అమరావతి కోసం ప్రభుత్వ సిద్ధం చేసిన రోడ్ మ్యాప్ ను స్థిరంగా అమలు చేస్తే పెట్టుబడి దారుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది” అని అభిప్రాయపడ్డారు.2014 లో రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిగా అమరావతిని నిర్ణయించబడింది. యూకేకు చెందిన ప్రఖ్యాత సంస్థ ఫోస్టర్ అండ్ పార్టనర్స్ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. విజయవాడ-గుంటూరు మధ్య 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సమగ్ర అభివృద్ధిని ప్రతిపాదించింది.