YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వర్క్ ఫ్రమ్ బెంగళూరు...

వర్క్ ఫ్రమ్ బెంగళూరు...

విజయవాడ, మే 6, 
రాజకీయాలు చాలా దూకుడుగా ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులపై ఒక రకమైన ముద్ర వేస్తుంటారు. ఈ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్న వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కూటమి నేతలు ఇప్పుడు అదే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన జనాలతో మమేకం కావడం లేదని, జనాల సమస్యలు పట్టించుకోవడంలేదని, ఉంటే తాడేపల్లి ప్యాలెస్, లేకుంటే బెంగళూరు యలహంక ప్యాలెస్ అంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఆ రెండు ప్యాలెస్ లను దాటి బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. మొన్న ఆ మధ్యన గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అటు తరువాత కేసుల్లో ఇరుక్కున్న నేతల పరామర్శకు వెళ్లారు. అంతకుమించి బయటకు కనిపించడం లేదు.జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఎక్కువగా ఉండేవారు. అటు హైదరాబాద్ కానీ.. ఇటు బెంగళూరు కానీ వెళ్లేవారు కాదు. ఏదో ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఆయన రాష్ట్రం దాటి వెళ్లేవారు. అలాగని ప్రజల్లోకి కూడా వచ్చేవారు కాదు. కానీ ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలకు సంబంధించి బటన్ నొక్కేందుకు మాత్రం జిల్లాల పర్యటనకు వచ్చేవారు. అంతకుమించి వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువ. అప్పుడప్పుడు పులివెందుల వెళ్లేవారు. ఇడుపాలపాయను సందర్శించేవారు. కానీ ఇప్పుడు నెల రోజుల్లో 20 రోజులు బెంగళూరు ప్యాలెస్ లోనే గడుపుతున్నారు. హైదరాబాద్ ముఖం చూపడం లేదు. అక్కడ ఇంట్లో వైయస్ షర్మిల ఉండడంతో వెళ్లడానికి వీలు లేకుండా పోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.ప్రస్తుతం జగన్ ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు. అక్కడ ఆయనకు సువిశాలమైన ప్యాలెస్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ఎంతో ముచ్చట పడి కట్టుకున్నారు ఆ ప్యాలెస్ ను. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లి విడిది చేసేవారు జగన్మోహన్ రెడ్డి. అయితే అప్పట్లో కాంగ్రెస్ అగ్ర నేతలతో చర్చలు జరిపేందుకు ఆ ప్యాలెస్ కు ఎక్కువగా వెళ్లేవారని ప్రచారం నడిచింది. ఎన్ని రకాల విమర్శలు వచ్చినా ఇప్పుడు ఆ ప్యాలెస్ నుంచి తాడేపల్లికి రాకపోకలు సాగిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు పాటు బెంగళూరులో ఉంటే.. మూడు రోజులపాటు తాడేపల్లి లో ఉంటున్నారు. మొన్న ఆ మధ్యన జిల్లాల పర్యటనకు సిద్ధమని ప్రకటించారు. కానీ ఆరు నెలలు అవుతున్న జిల్లాల పర్యటనకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ ప్రారంభించలేదు.అయితే జగన్మోహన్ రెడ్డి పై కూటమి నేతలు గురిపెట్టారు. ఆయన విషయంలో కొత్త పేరును తెరపైకి తెచ్చారు. జగన్ ‘వర్క్ ఫ్రం బెంగళూరు’  అనే టైటిల్ ఇచ్చేశారు. రాష్ట్రంలో రైతుల దుస్థితి, సీఎం చంద్రబాబు పనితీరుపై ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. వర్క్ ఫ్రం బెంగళూరు అంటూ కామెంట్స్ చేశారు. హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సైతం ఇదే కామెంట్లు చేశారు. వర్క్ ఫ్రం బెంగళూరు చేసే జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రంలో పరిస్థితులు ఏం అర్థమవుతాయని వ్యాకరించారు. ఉంటే తాడేపల్లి, లేకపోతే బెంగళూరు.. ఇంతేగా జగన్ తీరు అని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లికి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు బెంగళూరులోనే ఉండిపోతుండడంపై.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో సైతం ఆందోళన వ్యక్తం అవుతోంది.

Related Posts