
విజయవాడ, మే 7,
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరై పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవం చేశారు మరో మూడేళ్లలో ప్రజా రాజధాని అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు పై తనకు నమ్మకం ఉందని.. ఆయన చేసి తీరుతారని ప్రధాని ప్రకటించారు. దీంతో అమరావతికి కొత్త ఊపిరి వచ్చినట్లు అయింది. అయితే అమరావతి రాజధాని కాకుండా.. సమాన స్థాయిలో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకోవడం విశేషం. అమరావతి ప్రాంతంలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ హడావిడి కనిపిస్తోంది. మూతపడిన ఆఫీసులు తెరుచుకుంటున్నాయి. లేఅవుట్ సరిహద్దు రాళ్లకు రంగులు పడుతున్నాయి. లేఅవుట్లలో కొత్తగా ఫ్లెక్సీలు, జెండాలు కడుతున్నారు. వాటి విక్రయాల కోసం మార్కెటింగ్ సిబ్బందిని నియమిస్తున్నారు.2014లో రాష్ట్ర విభజన జరిగింది. తెలంగాణ విభజిత రాష్ట్రం కాగా.. ఏపీ నవ్యాంధ్రప్రదేశ్ గా మారింది. అటువంటి సమయంలో అందరి అభిప్రాయంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు చంద్రబాబు. దాదాపు 33 వేల ఎకరాల భూమిని రైతుల స్వచ్ఛందంగా అమరావతి రాజధాని కోసం ఇచ్చారు. అది మొదలు తెలంగాణలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతి వైపు చూడడం ప్రారంభించారు. ఆంధ్రుల రాజధాని అమరావతి ప్రపంచ దేశాల్లో భావి నగరంగా మారుతుందని ఆశించారు. అందుకే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి ప్లాట్లను విక్రయించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ భూముల ధరలు ఆకాశానికి అంటాయి. కానీ 2019లో అధికారం చేతులు మారడం.. అమరావతి రాజధాని నిర్వీర్యం కావడం.. మూడు రాజధానులు తెరపైకి రావడం చకచకా జరిగిపోయాయి. అప్పటివరకు జెట్ స్పీడ్ తో వెళ్లిన రియల్ ఎస్టేట్ వ్యాపారం అమాంతం పడిపోయింది. గత ఐదేళ్లలో ఆ రంగం పై ఆధారపడిన వ్యాపారులు, ఉద్యోగులు వీధిన పడిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ వ్యాపారం పెట్టుబడులు పెట్టిన వారంతా లబోదిబోమన్నారు. కానీ ఎట్టకేలకు టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో అమరావతికి కొత్త కళ వచ్చింది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి.ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంటోంది. అమరావతిలో పొలాలను ఎక్కడా కొనే పరిస్థితిలో లేదు. కోర్ క్యాపిటల్ పరిధిలో పొలాలు కొనగలిగే రేంజ్ లో కూడా ధరలు లేవు. అమరావతి చుట్టుపక్కల, ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఎక్కడ కూడా పొలాలు కొనుగోలు చేయడానికి ధర అందుబాటులో లేదు. ప్రస్తుతం ఒక అమరావతి ప్రాంతంలోనే కాకుండా.. గుంటూరు, విజయవాడ, మంగళగిరి, తెనాలి, బాపట్ల వరకు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు అక్కడ కొనుగోలు చేసే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు.గత అనుభవాల దృష్ట్యా అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పై పెట్టుబడి పెట్టే వారు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గతం మాదిరిగా దూకుడుగా అడుగు వేసే పరిస్థితి లేదు. పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్లు కొద్ది రోజులు ఆగుదాం అని ఆలోచిస్తున్నారు. మరికొందరు అయితే కేంద్ర ప్రభుత్వం సహాయం, రాష్ట్ర ప్రభుత్వం దూకుడు, పార్లమెంట్లో ప్రత్యేక చట్టం వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని భూముల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం. గతంతో పోల్చుకుంటే కొనుగోలు సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఈ విషయాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సైతం ధ్రువీకరిస్తోంది. మొత్తానికైతే అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. కానీ గత మాదిరిగా దూకుడుగా వెళ్లడం లేదు.