
ఏలూరు, మే 7,
కూటమి ప్రభుత్వం మరో పథకాన్ని పునరుద్ధరించింది. బేబీ కిట్ పథకాన్ని మళ్లీ అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ పథకం ద్వారా నవజాత శిశువులకు మేలు జరగనుంది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బేబీ కిట్ పథకాన్ని పునరుద్ధరించింది. ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు, నవజాత శిశువుల సంరక్షణ కోసం ఉచితంగా కిట్ ఇస్తారు. 2014-2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఈ పథకాన్ని "ఎన్టీఆర్ బేబీ కిట్" పేరుతో అమలు చేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఈ పథకాన్ని అపేసింది. తాజాగా ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించిందనవజాత శిశువులకు అవసరమైన ప్రాథమిక వస్తువులను అందించడం ద్వారా.. వారి ఆరోగ్యాన్ని, పరిశుభ్రతను కాపాడటం, శిశు మరణాలను తగ్గించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఆర్థికంగా కూడా సహాయపడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలందరూ ఈ పథకానికి అర్హులు. ఈ కిట్‌లో సుమారు రూ. 1000 నుండి రూ. 2000 విలువ చేసే వస్తువులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
ఏయే వస్తువులు ఉంటాయి..
బేబీ బెడ్ కమ్ క్యారియర్ (దోమతెరతో సహా)
వాటర్ ప్రూఫ్ కాట్ షీట్
బేబీ డ్రెస్
వాషబుల్ నేప్కిన్స్
టవల్
బేబీ పౌడర్
బేబీ షాంపూ
బేబీ ఆయిల్
బేబీ సబ్బు
సోప్ బాక్స్
శానిటైజర్
కొన్ని రకాల క్రీములు
బేబీ రాటిల్ టాయ్
వివరాలు సేకరించి..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం జరిగిన వెంటనే బాలింతలకు ఈ కిట్‌లను అందజేస్తారు. గతంలో అమల్లో ఉన్న ఈ పథకం కొంతకాలం నిలిచిపోగా.. జిల్లాల వారీగా ప్రసవాల వివరాలు సేకరించి మళ్లీ పునరుద్ధరించారు. పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న ఇలాంటి పథకాలను కూడా అధికారులు పరిశీలించారు.పేద, మధ్యతరగతి మహిళలకు ఆర్థిక భారం తగ్గుతుంది.నవజాత శిశువులకు అవసరమైన ప్రాథమిక వస్తువులు అందుబాటులో ఉంటాయి.శిశువులకు ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.శిశు మరణాల రేటును తగ్గించడంలో సహాయపడుతుంది.