
విశాఖపట్టణం, మే 7,
ఏపీకి రాజధానిగా అమరావతి ఉంది. అమరావతి పునర్నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మరో మూడేళ్లలో ప్రజా రాజధాని అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. అందులో భాగంగా దిగ్గజ పారిశ్రామిక సంస్థలు విశాఖలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు పెద్ద ఎత్తున కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. ఈ తరుణంలో విజయవాడ నుంచి విశాఖకు రాకపోకలు ఎక్కువగా సాగుతున్నాయి. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే సమయం పడుతుంది. రైలు మార్గంలో కూడా జాప్యం జరుగుతోంది. మరోవైపు విజయవాడ నుంచి విశాఖకు నేరుగా విమాన సర్వీసులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత కొద్దిరోజులుగా దీనిపై విమర్శలు వస్తుండడంతో కేంద్ర పౌర విమానయాన శాఖ దృష్టి పెట్టింది. రెండు నగరాలను కలుపుతూ విమాన సర్వీసులు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు.విజయవాడ నుంచి విశాఖకు వెళ్లాలంటే.. చెన్నై నుంచి వచ్చే ఒకే విమానం అందుబాటులో ఉంది. అందుకే దానికి విపరీతమైన రద్దీ ఉంటుంది. దీంతో చాలామంది హైదరాబాద్ కు వెళ్లి.. అక్కడి నుంచి విశాఖకు చేరుకుంటున్నారు. మొన్న ఆ మధ్యన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమాన సర్వీసులపై ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బిజెపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సైతం దీనిపై ఆవేదన వ్యక్తం చేశారు. పౌర విమానయాన సర్వీసులపై విమర్శలు రావడంతో సంబంధిత శాఖ దృష్టి పెట్టింది. విజయవాడ నుంచి విశాఖకు నేరుగా విమాన సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం పై విమాన ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కొత్త విమాన సర్వీసులపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుకీలక ప్రకటన చేశారు. జూన్ 1 నుంచి కొత్త విమాన సర్వీసును ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇండిగో సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఈ విమానం ఉదయం ఏడు గంటల 15 నిమిషాలకు విజయవాడలో బయలుదేరుతుంది. ఎనిమిది గంటల 25 నిమిషాలకు విశాఖ చేరుకుంటుంది. తిరిగి ఉదయం 8 గంటల 45 నిమిషాలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. 9 గంటల 45 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ నూతన విమాన సర్వీసు తో విజయవాడ నుంచి విశాఖ వెళ్లే ప్రయాణికులకు కొంతవరకు రవాణా భారం తగ్గనుంది.ఇప్పటివరకు చెన్నై నుంచి విశాఖ వెళ్లే విమాన సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉండేది. చెన్నై నుంచి ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాలకు విజయవాడ వచ్చే ఈ విమానం.. 8 గంటల 45 నిమిషాలకు విశాఖ బయలుదేరేది. కానీ చెన్నై నుంచి విమానంలో రద్దీ ఎక్కువగా ఉండేది. దీంతో ఎక్కువమంది హైదరాబాద్ మీదుగా విశాఖకు చేరుకునేవారు. ఇప్పుడు ఈ ఇబ్బందులు తొలగనున్నాయి. విజయవాడ నుంచి ఉదయం విశాఖ కు వెళ్లి.. పనులు చూసుకుని రాత్రికి అందుబాటులో ఉండే విమానాల్లో తిరిగి విజయవాడకు చేరుకోవచ్చని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పౌర విమానయాన శాఖ నిర్ణయం పై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు.