
విజయవాడ, మే 7,
వైఎస్సార్ కాంగ్రెస్అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్ర చేస్తారా? పాదయాత్రతో ప్రజల మధ్యకు వెళ్తారా? రెండోసారి ఆయన పాదయాత్ర చేస్తే ప్రజలు ఆదరిస్తారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. త్వరలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. విశాఖలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో గుడివాడ అమర్నాథ్ ఈ ప్రకటన చేశారు. అయితే ఆయన యధాలాపంగా ఈ ప్రకటన చేశారా? లేకుంటే నిజం తెలిసి మాట్లాడరా? అన్నది తెలియాల్సి ఉంది. నేతల పాదయాత్రతో ఆ పార్టీలు అధికారంలోకి వస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సైతం ఆ ఫార్ములాను ఎంచుకున్నారా అన్న అనుమానం కలుగుతోంది.2003లో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు వైయస్ రాజశేఖర్ రెడ్డి.దశాబ్ద కాలం పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్ పార్టీని విజయ బాట పట్టించారు. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు. 2014 ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేశారు టిడిపి అధినేత చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. 2018లో పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి కారణమయ్యారు. 2023లో పాదయాత్ర చేశారు నారా లోకేష్. దీంతో 2024 టిడిపి అధికారంలోకి వచ్చేందుకు కారణమయ్యారు. అందుకే ఈ పాదయాత్ర ఫార్ములాను అనుసరించి 2029 ఎన్నికల్లో గెలవాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2024 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయింది. కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్లిపోయారు. చివరకు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి నేతలు సైతం తమ దారి తాము చూసుకున్నారు. పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మరోవైపు కూటమి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం కంటే పార్టీని కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డి ముందున్న కర్తవ్యం. అందుకే ఆయన తప్పకుండా పాదయాత్ర చేస్తారని పార్టీ శ్రేణుల నమ్మకం. అందులో భాగంగానే గుడివాడ అమర్నాథ్ ప్రకటన చేసి ఉంటారన్నది ఒక అనుమానం.అయితే రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మొదలు జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా బెంగళూరుకి పరిమితం అవుతున్నారు. కనీసం ప్రజల మధ్యకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. మొన్న మధ్యాహ్నం పార్టీ శ్రేణుల పరామర్శకు వచ్చారు. జైల్లో ఉన్న నేతలను పరామర్శించారు. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లారు. అక్కడ రైతులతో మాట్లాడారు. అంతకుమించి ఆయన ప్రజల మధ్యకు వచ్చింది లేదు. జిల్లాల పర్యటనకు వెళ్తానని ఆరు నెలల కిందట ప్రకటించారు. కానీ అది ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. అందుకే పాదయాత్ర పై అనుమానాలు ఉన్నాయి. పైగా ఇదివరకు చేసి ఉండడంతో.. ఆ స్థాయిలో ప్రజల నుంచి ఆదరణ వచ్చే అవకాశం లేదు. పైగా కూటమి ప్రభుత్వం నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే పాదయాత్ర బదులు బస్సుయాత్ర , జిల్లాల పర్యటనకు ఎక్కువగా ఆయన మొగ్గు చూపే అవకాశం ఉంది.