
తిరుపతి, మే 7,
తిరుపతి నగరంలో బుగ్గ మఠం భూముల సర్వే రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూములను ఆక్రమించారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బుగ్గ మఠం భూముల రీ సర్వే జరుగుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాసం ఉంటున్న భూములు ఇదివరకు బుగ్గ మఠానికి చెందినదిగా చెబుతున్నారు. అయితే ఈ భూములు తన సోదరుడు కొనుగోలు చేసినవని పెద్దిరెడ్డి చెబుతుండగా.. తాజాగా రీ సర్వే చేసిన అధికారులు బుగ్గ మఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రాథమికంగా నిర్ధారించారు. 6 సర్వే నంబర్లలో తమ మఠానికి 14.49 ఎకరాల భూమి ఉందని, వాటికి హద్దులు తెలపాలంటూ తిరుపతి అర్బన్ తహసీల్దార్‌కు బుగ్గ మఠం ఈవో వెంకటేశ్వర్లు గత నెల 17న వినతిపత్రం ఇచ్చారు. ఈ నెల 3న రెవెన్యూ, సర్వే అధికారులు రోవర్ ద్వారా హద్దులను గుర్తించారు. అదే రోజు సంబంధిత నివేదికతో పాటు స్కెచ్, గూగుల్ మ్యాప్‌లను బుగ్గ మఠం అధికారులకు అందించారు. మొత్తం 14.49 ఎకరాల్లో 3.88 ఎకరాలు మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలో ఉన్నట్లు గతంలోనే విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రికార్డులు ఉంటే అందించాలని బుగ్గ మఠం అధికారులు ఆయనకు నోటీసులు ఇచ్చినా ఇప్పటివరకూ స్పందించలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆ భూమిలో నుంచి పెద్దిరెడ్డి నివాసానికి వెళ్లేందుకు 9.51 లక్షలతో సిమెంట్ రోడ్డును నిర్మించారు. రహదారికి పక్కనే బుగ్గ మఠం స్థలంలో పశుగ్రాసం సాగు చేస్తున్నారని సర్వే అధికారులు ఇచ్చిన స్కెచ్‌ను బట్టి తెలుస్తోంది. స్థానికుల విజ్ఞప్తి మేరకు రహదారి వేస్తున్నామని అప్పట్లో పేర్కొన్నా, ఇప్పటికీ ఆ మార్గంలో సామాన్యులు రాకపోకలు సాగించే పరిస్థితి లేదు. మరోవైపు మఠానికి ఎంత భూమి ఉంది? ప్రస్తుతం ఉన్నది ఎంత? లీజుకు ఇచ్చింది ఎంత? అనే వివరాలు అందించాలని తిరుపతి ఆర్డీవో కార్యాలయ అధికారులు బుగ్గ మఠం ఈవోను కోరారు. వాటితోపాటు తాము గుర్తించిన హద్దుల ప్రకారం ఎంత భూమి ఆక్రమణలో ఉందో తెలపాలన్నారు. ఈ సమాచారం ఇచ్చేందుకు 10 రోజులు సమయం కావాలని మఠం అధికారులు కోరారు. ఆ తర్వాత కబ్జా చేసిన వ్యక్తులపై రెవెన్యూ యంత్రాంగం చర్యలు తీసుకోనుంది. నగరంలో ముఖ్యమైన ప్రాంతాలంతా ఇదివరకు ఉన్న మఠాలకు చెందినవే. హథిరామ్ మఠం తరహాలో బుగ్గ మఠానికి సైతం నగరంలో వేలాది ఎకరాల భూములు ఉన్నాయి. నగరం నడిబొడ్డున ఉన్న ఈ భూములు కోట్ల రూపాయలు ఖరీదైనవి. అయితే ఇందులో చాలావరకు ఆక్రమణకు గురయ్యాయి. చాలా ఏళ్ల క్రితం ఈ భూములను మఠం పెద్దల నుంచి కౌలుకు తీసుకుని చివరకు వాటిని సొంతం చేసుకున్నారు. ఈ భూములపై వివిధ కోర్టుల్లో అనేక కేసులు కూడా నడుస్తున్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతి నగరం నడిబొడ్డున సొంతిల్లు ఉంది. ఇంటి చుట్టూ గోశాల, ఇతర ప్రత్యేక భవనాలు ఉన్నాయి. సుమారు మూడేళ్ల క్రితం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చంద్రబాబు.. పెద్దిరెడ్డి నివాసం ఉన్న స్థలంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుగ్గ మఠం భూములను ఆక్రమించుకొని పెద్దిరెడ్డి తిరుపతిలో నివాసిస్తున్నారని నాడు ఆరోపించారు. చంద్రబాబు ఆరోపణలు అవాస్తవం అంటూ మంత్రి హోదాలో అప్పుడే పెద్దిరెడ్డి చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. బుగ్గ ముఠం భూములు ఆక్రమణకు గురయ్యాయని తాజాగా సర్వే అధికారులు ప్రాథమికంగా నిర్థారించడంతో ఇప్పుడు ఏం చేయబోతున్నారన్న చర్చ నడుస్తోంది. ఎందుకంటే పుంగనూరు నియోజకవర్గంలోని సదుం అటవీ ప్రాంతం నడుమ పెద్దిరెడ్డి అతిథి గృహం నిర్మాణంపై కూడా ఆ మధ్య పెను దుమారం రేపింది. అటవీ భూములను ఆక్రమించుకున్నారని పెద్దిరెడ్డిపై ఆరోపణలొచ్చాయి. ఈ విషయం మర్చిపోకముందే తిరుపతిలో ఆయన నివాస భూమిపై వివాదం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ వివాదంపై పెద్దిరెడ్డి ఇప్పటివరకు మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ భూములు తన సోదరుడైన తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి అధికారికంగా కొనుగోలు చేసినట్లు పెద్దిరెడ్డి చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన కొన్ని రికార్డులను సైతం అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చివరికి ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందో అన్న చర్చ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.