
న్యూఢిల్లీ, మే 7,
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాకిస్తాన్, పిఓకెలోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం మొదలుపెట్టింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ ప్రతీకాదర దాడులతో పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిద్రలేకుండా చేసి కాళరాత్రిని మిగిలిచ్చింది భారత సైన్యం. పీఓకేలోని మొత్తం 9 ఉగ్ర స్థావరాలు లక్ష్యంగా చేసిన దాడి ఆపరేషన్ సిందూర్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. భారత బలగాలు ఉగ్రవాద స్థావరాలను విధ్వంసం చేయడాన్ని ప్రధాని మోదీ రాత్రంతా నిరంతరం పర్యవేక్షించారని కొందరు అధికారులు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఏం చేస్తుంది అనే దానికి మంగళవారం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమాధానంగా మారింది. భారత బలగాలు పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా చేసిన దాడులు విజయవంతమయ్యాయని భారత వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన జైషే ఈ ముహమ్మద్, లష్కరే తోయిబా అగ్ర నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం అర్ధరాత్రి దాటిన తరువాత ఈ దాడులు చేశాయి. ఉగ్రదాడులను సహించేది లేదని, పహల్గాం దాడికి అంతకు మించి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రధాని మన ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పారు. భారత సైన్యం 9 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ ఆపరేషన్‌కు సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది. రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో కొంతకాలం క్రితం భారత సాయుధ దళాలు పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించాయని తెలిపింది.ఈ దాడిలో పాకిస్తాన్ సైనిక స్థావరాలకు ఎలాంటి హాని కలిగించలేదని, పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదని రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. కేవలం ఉగ్రవాద మూలలను మాత్రమే టార్గెట్ చేశామని పేర్కొంది. ఇప్పటికే వాటిని ధ్వంసం చేసే విషయంలో భారతదేశం ఎంతో సంయమనం పాటించింది. పదే పదే పాక్ కవ్వింపు చర్యలను తిప్పే కొట్టేందుకు, పహల్గామ్‌లో జరిగిన క్రూరమైన ఉగ్ర దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ జాతీయుడు మరణించిన నేపథ్యంలో ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.భారత హొం మంత్రిత్వ శాఖ ‘ఆపరేషన్ సిందూర్’ పై ప్రకటనలో మొత్తం తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. మా చర్యలు కేవలం ఉగ్రవాద స్థావరాలపైనే కేంద్రీకృతమై ఉన్నాయని తెలిపింది. పాకిస్థాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని, లక్ష్యాలను ఎంచుకోవడంలో భారతదేశం చాలా సంయమనం పాటించిందని ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్ పై ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్ లో పోస్టు చేసింది. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత ఆర్మీ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్ లోని శ్రీనగర్, జమ్ము, అమృత్ సర్, ధర్మశాల లేహ్ విమానాశ్రయాలను మూసివేసినట్లు సమాచారం.ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం దాడి చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఐదు, పాకిస్థాన్ ప్రాంతంలోని నాలుగు ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. సియాల్ కోట్, బహావల్ పూర్, చాక్రా, ముజుఫర్ పూర్, కోట్లీ బంబీర్, చాక్రాఆమ్రూలో జరిగిన దాడుల్లో 30 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది.ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన తర్వాత రక్షణ మంత్రి ముగ్గురు సైన్యాధిపతులతో చర్చించారు. ఆపరేషన్ సిందూర్ పూర్తయిన తర్వాత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముగ్గురు సైన్యాధిపతులతో మాట్లాడారు. తదుపరి కార్యాచరణపై ఈ సందర్భంగా చర్చించినట్టుగా సమాచారం.