
న్యూఢిల్లీ, మే 7,
పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ 9 ఉగ్రవాద స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ క్రమంలో పాకిస్తాన్, భారత్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలతో బుధవారం ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలలోని విమానాశ్రయాలు మూసివేయనున్నారు. ఈ మేరకు విమాన ప్రయాణికులకు ఎయిర్ లైన్స్ సంస్థలు సూచనలు చేస్తున్నాయి.ధర్మశాలతో పాటు లేహ్, జమ్మూ, శ్రీనగర్, అమృత్‌సర్‌తో సహా పలు విమానాశ్రయాలు తదుపరి నోటీసు వచ్చే వరకు మూసివేసి ఉంటాయని స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ ఒక పోస్ట్‌లో తెలిపింది. ఈ సమయంలో రాకపోకలు చేసేవారు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. పలు విమానయాన సంస్థలు ఇదివరకే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులు ప్రస్తుత పరిణామాలు గమనించి ప్రయాణాన్ని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నాయి.భారత బలగాల చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తరువాత కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ధర్మశాల , లేహ్, జమ్మూ , శ్రీనగర్, అమృత్‌సర్ సహా ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలోని విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు. తదుపరి నోటీసు వచ్చే వరకు అవి సేవలు అందించవని అధికారులు స్పష్టం చేశారు. వీటి కారణంగా ప్రస్తుత రాకపోకలకు టికెట్లు బుక్ చేసుకున్న వారి జర్నీ ప్రభావితం కావచ్చు. ప్రయాణీకులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడమే, లేక ప్రత్యామ్నాయం ప్లాన్ చేసుకోవాలని ఎయిర్ లైన్స్ సంస్థల ప్రతినిధులు సూచించారు. దేశంలోని ఎంపిక చేసిన నగరాలకు, అక్కడి నుండి బయలుదేరే ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రయాణికులకు విమాన ప్రయాణానికి సంబంధించి అడ్వైజరీ జారీ చేసింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాలకు వెళ్లేవారు, అక్కడి నుండి బయలుదేరే విమాన సేవలు అందుబాటులో లేవని ఎక్స్ ఖాతాలో తెలిపింది. విమానాశ్రయానికి చేరుకునే ప్రస్తుత స్థితిని తనిఖీ చేసుకోవాలని విమానయాన సంస్థలు తమ ప్రయాణికులను కోరాయి."మారుతున్న పరిస్థితుల కారణంగా శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాలకు వెళ్లేవారు.. అక్కడి నుంచి బయలుదేరే మా విమానాలు ప్రభావితం అయ్యాయి. ఈ ఎయిర్ పోర్టులు మూసివేడంతో ప్రస్తుతం విమాన ప్రయాణాలు సాధ్యం కాదని, దయచేసి ఈ విషయాన్ని గమనించాలని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము" అని ఇండిగో పోస్ట్ చేసింది. గగనతల పరిమితుల వల్ల బికనీర్‌కు వెళ్లే, అక్కడి నుండి బయలుదేరే విమానాలు సైతం అందుబాటులో లేవు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి అర్థం చేసుకోవాలని సూచించారు.పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై "ఆపరేషన్ సిందూర్"లో భాగంగా ఈ దాడులు చేసింది భారత సైన్యం. విజయవంతగా భారత బలగాలు తమ టార్గెట్ పూర్తి చేశాయని, ఎలాంటి సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ కు శ్రీకారం చుట్టి తమ సత్తా చాటింది.