YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

అందాల పోటీలకు భాగ్యనగరం ముస్తాబు

అందాల పోటీలకు భాగ్యనగరం ముస్తాబు

హైదరాబాద్, మే 7,
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్‌ రెడీ అయింది. ప్రపంచ సుందరీమణులు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రస్తుతం సందడిగా మారింది, వివిధ దేశాల నుంచి అందాల పోటీదారులు ఇక్కడ దిగుతున్నారు. విదేశీ ప్రతినిధులకు తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. విమానాశ్రయంలో ప్రత్యేక లాంజ్‌లు, సమాచారం అందించేందుకు హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు, సంస్కృతి, ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.. అటు.. మిస్‌ వరల్డ్‌ పోటీలపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం కాక రేపుతోంది. ఈ క్రమంలో.. మంత్రి జూపల్లి కృష్ణారావు విపక్షాల విమర్శలపై స్పందించారు. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించేందుకే మిస్ వరల్డ్ పోటీలు.. అంటూ.. అందాల పోటీలపై విపక్షాల కామెంట్స్‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్‌ ఇచ్చారు.పెట్టుబడుల సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీల సందడి మాత్రం షురూ అయింది. మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటికే సుమారు 90 మంది పోటీదారులు హైదరాబాద్ చేరుకున్నారు. వారిలో మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండుజ్‌ పెద్రోసో, మిస్ సౌత్ ఆఫ్రికా జోయాలిజే జాన్సన్‌వాన్‌ రెన్స్‌బర్గ్‌ వంటి వారు ఉన్నారు. పర్యాటక శాఖ అధికారులు వీరికి విమానాశ్రయంలో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, అనంతరం వారిని బస ఏర్పాటు చేసిన హోటళ్లకు తరలించారు.ఈ మిస్ వరల్డ్ పోటీల్లో పాకిస్తాన్ కూడా ప్రాతినిధ్యం వహిస్తోంది. మిస్ పాకిస్తాన్ కూడా ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్లు సమాచారం. ప్రపంచ సుందరీమణులతో హైదరాబాద్ కళకళలాడుతోంది, అంతర్జాతీయ స్థాయిలో నగరం ప్రతిష్టను పెంచే ఈవెంట్‌కు అంతా సిద్ధమైంది.ఈ నెల 10న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రారంభం కానుండగా.. 31న హైటెక్స్‌లో గ్రాండ్ ఫినాలేతో ముగియనున్నాయి. అదే రోజు విజేతను ప్రకటిస్తారు. జూన్ 2న జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో మిస్‌ వరల్డ్‌గా నిలిచిన సుందరీమణి పాల్గొంటారు. ఈ పోటీలకు 116 దేశాలకు చెందిన పోటీదారులు హాజరుకానున్నారు. దాంతో.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హైదరాబాద్‌ హైటెక్స్‌ వరకూ బ్యానర్లు, కటౌట్లు కళకళలాడిపోతున్నాయి.మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు ప్రపంచ సుందరీమణులు ఒక్కొక్కరుగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే.. మిస్ ఇండియా నందిని గుప్తా, మిస్ మెక్సికో సెర్వాన్‌టెస్‌, మిస్ బ్రెజిల్ జెస్సికా స్కాండుజ్‌, మిస్ సౌత్ ఆఫ్రికా జోయాలిజే సహా దాదాపు 90 మందికిపైగా పోటీదారులు హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. వారికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో పర్యాటక శాఖ అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, ఆ తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌కు తరలించారు. మిస్ వరల్డ్ పోటీలకు హాజరయ్యే టీమ్‌లు బస చేసేందుకు హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌లో ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఏర్పాట్లను టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా.. మంత్రి జూపల్లిని మిస్ ఇండియా, మిస్ మెక్సికో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఇదిలావుంటే.. మిస్‌ వరల్డ్ పోటీలపై రాజకీయంగా దుమారం రేగుతోంది. అకాల వర్షాలతో అన్నదాత ఆగమవుతుంటే వారి గోడు పట్టదా అంటూ రేవంత్‌ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అటు.. కశ్మీర్‌లో కల్లోలం చెలరేగితే అందాల పోటీలు నిర్వహిస్తారా అని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అలాగే.. అందాల పోటీలను వ్యతిరేకిస్తూ మహిళా సంఘాలు ర్యాలీలు తీస్తున్నాయి.

Related Posts