
హైదరాబాద్, మే 7,
" నన్ను ఎవడూ నమ్మడం లేదు. అప్పులు పుట్టే పరిస్థితి లేదు. చివరికి బ్యాంకులు కూడా దొంగలను చూసినట్టు చూస్తున్నాయి. ఏ ప్రజా పథకం రద్దు చేయాలో మీరే చెప్పండి. వస్తున్నా ఆదాయం పింఛన్లకు, జీతాలకు, పాత అప్పుల వడ్డీలు కట్టడానికే సాలుతోంది"ఇవీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చేసిన వ్యాఖ్యలు. ఒక రకంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసినట్టుగా ఆయన ప్రకటించారు.. ఇది రేవంత్ రెడ్డి అనుభవలేమి, కెసిఆర్ చేసిన రుణాలకు ఇది ఒక మచ్చ తునక. అయితే రేవంత్ రెడ్డి పదేపదే కేసీఆర్ వల్లే ఇదంతా అని చెప్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు. స్థూలంగా చెప్పాలంటే ఇది రేవంత్ రెడ్డి చేత కానితనానికి నిదర్శనం. “వాస్తవానికి మూడు లక్షల కోట్ల అప్పు ఉందని అప్పుడు చెప్పారు. ఇప్పుడేమో అది 8.5 లక్షల కోర్టుగా కనిపిస్తోందని” రేవంత్ రెడ్డి నిర్వేదం వ్యక్తం చేస్తున్నాడు. ఇది ఒక రకంగా డిబేటబుల్ ప్రశ్న అయినప్పటికీ.. ఎన్నికల సమయంలో అన్ని హామీలు ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డికి తెలంగాణ ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా.. అంటే జనం ఓట్లు వేసిన తర్వాత.. తీరికగా ఇలాంటి సమాధానం చెబుదామని అనుకున్నారా.. జనాన్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇలా మాట్లాడటం దీనికి సంకేతం.. అసలు ఈ జాబితాలో భారత రాష్ట్ర సమితి.. కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకే తానులో ముక్కలు కదా. 2023 ఎన్నికల్లో కేసీఆర్ కూడా ఇలాంటి పథకాలే బొచ్చెడు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టాడు. పోనీ అధికారంలోకి వస్తే కేసీఆర్ వీటన్నిటిని అమలు చేసేవాడా? తెలంగాణ ఆర్థిక పరిస్థితి బాగోలేదని.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే సత్తా లేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇదే మాట మీద రేవంత్ రెడ్డి నిలబడి ఉంటాడా.. దాదాపు అసాధ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి కొంతలో కొంత ఆర్థిక సర్దుబాటు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమే. కర్ణాటక నుంచి పెద్దగా ఫాయిదా లేదు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అంతగా హార్దిక భరోసా ఉండదు. సో ఏతా వాతా చూస్తే రేవంత్ రెడ్డి కంటే ముందు మీనాక్షి నటరాజన్ తెర ముందుకు వస్తుంది.. అధికారులతో భేటీలు పెడుతుంది. అధికారం ముఖ్యం.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రేవంత్ రెడ్డి ముందు ఒక ఫైల్ పెడుతుంది. చివరికి ప్రభుత్వమే రాజీ పడాలి. సరెండర్ అవ్వాలి. ఎందుకంటే ఉద్యోగులతో ఏ ప్రభుత్వం కూడా యుద్దాన్ని కోరుకోదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భవిష్యత్తులో చేసేది కూడా అదే.తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ లలిత ఉన్నప్పుడు.. ప్రభుత్వ ఉద్యోగులకు చుక్కలు చూపించింది. ఉద్యోగులను తన కాళ్ళ మీద పడేవిధంగా చేసుకుంది. అయితే ఈ ఉదంతం రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డికి ఎవరూ చెప్పడం లేదా.. ఒకవేళ చెప్పిన రేవంత్ రెడ్డి వినిపించుకునే పరిస్థితి లేదా.. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఈ రాష్ట్రమనే కాదు దేశంలోని అని రాష్ట్రాలకూ ఒకరకంగా వాళ్ళు అల్లుళ్లు. ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పటికీ.. లోకం సర్వనాశనమైనా సరే.. రైతులు ఆత్మహత్య చేసుకున్నా.. మిడిల్ క్లాస్ ప్రజలు కన్నీళ్లు పెడుతున్నా.. నిరుద్యోగులు అవస్థలు పడుతున్నా.. జానే దాన్. ఎవడు ఎక్కడికి పోయినా పర్వాలేదు.. మేం చల్లగా ఉంటే చాలు అనుకునే ధోరణి ఉద్యోగులది.. ఇంత స్థాయిలో జీతాలు తీసుకుంటున్నప్పటికీ ఉద్యోగులలో జవాబు దారితనం ఉందా అంటే? వీసమెత్తు కూడా ఉండదు. పైగా ఉద్యోగుల జీతాల కోసమే రాష్ట్రాల ఆదాయంలో పావు వంతు వెళ్తోంది.. అనేక కేసుల్లో పట్టుబడుతున్నప్పటికీ ఉద్యోగ సంఘాల నాయకులు తాము పనితీరు మార్చుకుంటామని.. అవినీతికి పాల్పడమని ఇంతవరకు చెప్పిన దాఖలాలు లేవు. పోనీ ఇప్పుడు నీతి వాక్యాలు వల్లించిన రేవంత్ రెడ్డి ఉద్యోగుల మీద ఎప్పుడైనా దృష్టి సారించాడా? లేదా అవినీతి కేసుల్లో సీరియస్ గా ఎఫర్ట్ పెట్టాడా? ఇంతవరకు ఒక్కరికైనా శిక్ష పడిందా? కనీసం ఒక అవినీతి అధికారైన జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడా.. వందల కోట్లు మింగినా.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టినా.. ఇప్పటికీ అదే డిపార్ట్మెంటల్ ఎంక్వయిరీ పేరుతో కేసుల్ని పక్కదారి మళ్ళి ప్రయత్నమే జరుగుతుంది. చివరికి అవినీతి కేసుల్లో ఇరుక్కుపోయిన ఉద్యోగులను అదే పోస్టులలో నియమించి తరిస్తోంది ఈ ప్రభుత్వం. ప్రక్షాళన పక్కనపెట్టి.. చేయాల్సిన పనులను పక్కనపెట్టి.. నన్ను కోసుకున్నా రూపాయి కూడా లేదని రేవంత్ రెడ్డి చెప్పడం నిజంగా పాలన లేమితనం.. ఇక్కడ కేసీఆర్ గొప్పోడని కాదు. ఆయనేం శుద్ధ పుస అని కాదు. ఈ జాబితాలో అటు రేవంత్ రెడ్డి.. ఇటు కెసిఆర్ దొందూ దొందే!