
హైదరాబాద్, మే 7,
గోల్కొండ గనుల్లో లభ్యమైన ఒక అపురూపమైన రాయల్ డైమండ్‌ను మే 14న జెనీవాలో వేలం వేయనున్నారు. 3.24 క్యారెట్ల ఈ నీలిరంగు వజ్రపు ఉంగరం న్యూయార్క్‌లోని క్రిస్టీస్ జ్యుయెలరీ షాప్ ద్వారా వేలం వేస్తారు. ఈ వజ్రం పియర్ ఆకారంలో 23.24 క్యారెట్ల బరువుతో ఉంటుంది.ఒకప్పుడు ఈ ఉంగరం ఇండోర్ మహారాజుదని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యుయెలరీ చీఫ్ రాహుల్ కడాకియా తెలిపారు. ఇలాంటి ఉంగరం ఇంతకు ముందు ఎప్పుడూ వేలానికి రాలేదని ఆయన పేర్కొన్నారు. ఈ వేలంలో దీని ధర సుమారు రూ. 300 కోట్ల నుంచి రూ. 430 కోట్ల మధ్య పలకవచ్చని ఆయన అంచనా వేశారు.ఇలాంటి అత్యంత అరుదైన, విలువైన వజ్రాలు జీవితంలో ఒక్కసారే వేలానికి వస్తాయని రాహుల్ కడాకియా అన్నారు. తమ ప్రపంచ సంస్థ క్రిస్టీస్ గత 259 సంవత్సరాలుగా పనిచేస్తోందని ఆయన వెల్లడించారు. ఇన్నేళ్లలో క్రిస్టీస్ ప్రపంచంలోని చాలా ప్రసిద్ధమైన, ముఖ్యమైన వజ్రాలను విక్రయించిందని ఆయన చెప్పారు.తమ వేలంలో గతంలో అమ్ముడైన గోల్కొండ వజ్రాలకు ఉదాహరణలుగా పలు డైమండ్ల పేర్లను ఆయన వివరించారు. ఆర్చ్‌డ్యూక్ జోసెఫ్ డైమండ్, ప్రిన్సీ డైమండ్, విట్టెల్స్‌బాచ్ డైమండ్ వంటి వాటిని తాము విక్రయించామని ఆయన గుర్తు చేశారు. రాజరికపు వారసత్వం, అసాధారణమైన రంగు, పరిమాణంతో ‘ది గోల్కొండ బ్లూ’ డైమండ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన నీలి రంగు వజ్రాలలో ఒకటని రాహుల్ కడాకియా ఒక ప్రకటనలో తెలియజేశారు.క్రిస్టీస్ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ‘ది గోల్కొండ బ్లూ’ డైమండ్ ఒకప్పుడు ఇండోర్ మహారాజా యశ్వంత్ రావు హోల్కర్ IIది. 1923లో మహారాజు తండ్రి ఈ వజ్రంతో ఒక బ్రాస్‌లెట్‌ను తయారు చేయించడానికి ఫ్రాన్స్‌కు చెందిన ప్రఖ్యాత లగ్జరీ ఆభరణాల బ్రాండ్ చౌమెట్‌కు ఆర్డర్ ఇచ్చారు. అంతకు ముందు అదే ఆభరణాల సంస్థ నుంచి “ఇండోర్ పియర్స్” అనే రెండు గోల్కొండ వజ్రాలను ఆయన కొనుగోలు చేశారు.
పదేళ్ల తర్వాత మహారాజు ప్రసిద్ధ ఫ్రెంచ్ లగ్జరీ ఆభరణాల కంపెనీ మౌబౌసిన్‌కు మరొక ఆర్డర్ ఇచ్చారు. ఈ కంపెనీ ‘ది గోల్కొండ బ్లూ’ డైమండ్‌ను తిరిగి రూపొందించి ఇండోర్ పియర్ వజ్రాలతో కలిపి ఒక హారంలో చేర్చింది.న్యూయార్క్‌కు చెందిన ప్రసిద్ధ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్‌స్టన్ 1947లో ‘ది గోల్కొండ బ్లూ’ డైమండ్‌ను కొన్నారు. ఆయన ఈ నీలి వజ్రాన్ని అదే పరిమాణంలో ఉన్న మరో తెల్ల వజ్రంతో కలిపి ఒక బ్రూచ్‌ను తయారు చేశారు. ఆ తర్వాత ఆ బ్రూచ్ బరోడా మహారాజుకు చేరింది. కొంతకాలం తర్వాత ఆ బ్రూచ్‌ను ఆ రాజకుటుంబం ఒక ప్రైవేట్ వ్యక్తికి విక్రయించింది. ఇప్పుడు అదే వజ్రం జెనీవాలోని ఫోర్ సీజన్స్ హోటల్ డెస్ బెర్గ్స్‌లో వేలానికి ఉండనుంది.