
మేడ్చల్
సూరారంలోని మల్లారెడ్డి హెల్త్ సిటీలో దేశ సైనికులకు సంఘీభావంగా నిర్వహించిన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథి గా హాజరైయారు.
హరీష్ రావు మాట్లాడుతూ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటుచేసిన మల్లారెడ్డి . , ఇక్కడి ఎమ్మెల్యే వివేక్ గౌడ్ ని నేను అభినందిస్తున్నాను. దేశం కోసం పోరాడుతున్న సైనికులకు సంఘీభావంగా ఈ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయం. భారత దేశ సైనికులను చూసి గర్వపడుతున్నాం. సరిహద్దులు అంటే భౌగోళికంగానే కాదు ఈ దేశ ప్రజల భద్రత, దేశ భవిష్యత్తు కూడా. దానిని నిలబెట్టడానికి సైనికులు పోరాడుతున్నారు. పాకిస్తాన్ మన దేశం నుండి విడిపోయినప్పటికీ మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలని ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది. ముంబైలో తాజ్ హోటల్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడి చేశారు. వారు పాకిస్తాన్ పంపిన ఉగ్రవాదులు అని ప్రపంచం ముందు ఆ దేశాన్ని దోషిగా నిలబెట్టింది భారతదేశం. అమెరికా లాంటి దేశాలపై కూడా బిన్ లాడెన్ లాంటి ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి దాడులకు తెగబడ్డారని అన్నారు.
సహనానికి, ఓపికకు హద్దు ఉంటుంది. చాలా సంవత్సరాలు ఓపికగా చూసాం. ఇప్పుడు భరించేది లేదు దేశ ప్రజల భద్రతే ముఖ్యం. మతం పేరు అడిగి టూరిస్టులను చంపడం దేశ ప్రజల మనసులను కలచి వేసింది. భారతదేశ మీద జరుగుతున్న దాడికి పరిష్కారం చూపిస్తూ ఉగ్రవాదులపై దాడి చేయడం సరైన చర్య. ఇలాంటి సమయంలో దేశంలోని ప్రతీ యువతీ యువకుడు త్యాగానికి సిద్ధంగా ఉండాలి. యుద్ధానికి అవసరం పడితే అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు మల్లారెడ్డి హెల్త్ యూనివర్సిటీ కూడా ముందుకు రావాలి. సైనికుల కోసం రక్తదానానికి మేము సిద్ధంగా ఉన్నాం. బార్డర్లో మనం పోరాటం చేయకపోవచ్చు కానీ సైనికులకు అవసరమైనటువంటి రక్తాన్ని, వైద్యాన్ని అందించే బాధ్యత దేశ ప్రజలపై ఉంది. సైనికుల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత ఈ దేశ ప్రజలపై ఉంది. భారత సైనికుల్లారా మీరు బార్డర్లో మా కోసం పోరాటం చేస్తున్నారు మీ వెనుక 140 కోట్ల మంది భారతీయులు ఉన్నారు. మీ ధైర్యమే మాకు శక్తి, మీ నిబద్ధత మాకు గర్వకారణం, మీ పోరాటం మాకు స్ఫూర్తని అన్నారు.