
హైదరాబాద్, మే 21,
చరిత్రలో తొలిసారిగా సిబిఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అసలు తీగ లాగినా కూడా డొంక కదలకపోవడంతో విస్తు పోతున్నారు. ఈడీ అధికారులతో ఎన్నో ఆర్థిక అక్రమాలకు సంబంధించిన కేసులను చేదించిన చరిత్ర సీబీఐ కి ఉంది. కానీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కు సంబంధించిన అధికారి జీవన్ లాల్ విషయంలో మాత్రం సిబిఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్థిక అక్రమాలకు.. అవకతవకలకు.. లంచాలకు అలవాటు పడిన ఆయన.. ఇష్టానుసారంగా వ్యవహరించాడు. అడ్డగోలుగా సంపాదించి.. కోట్లకు పడగలెత్తాడు. అయితే ఇటీవల 70 లక్షల లంచానికి సంబంధించిన కేసులో సిబిఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన ఆయన.. ఇప్పుడు జైల్లో ఉన్నప్పటికీ కూడా.. సిబిఐ అధికారులకు చుక్కలు చూపిస్తున్నాడు.వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ తనయుడిగా జీవన్ లాల్ అప్పటి అధికార పార్టీలో తెర వెనుక చక్రం తిప్పాడు. ఆయన ఏకంగా తెలంగాణ ఆదాయపు పన్ను శాఖలో కీలక పోస్టింగ్ సంపాదించాడు. ఆ తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలకు మేళ్ళు చేకూర్చాడు. దానికి ప్రతిగా భారీగా లంచాలు వసూలు చేశాడు. సాధారణంగా లంచాలను పరోక్షంగా అధికారులు వసూలు చేస్తుంటారు. కానీ జీవన్ లాల్ స్టైల్ మాత్రం దానికి పూర్తి విభిన్నం. లంచాల కోసం అతడు ఏకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అంతేకాదు లంచాలను వసూలు చేస్తూ.. వాటిని తన బినామీ ల పేరు మీద నమోదు చేసేవాడు. షాపూర్జీ పల్లోంజీ గ్రూపునకు సంబంధించిన ఫైల్ క్లియరెన్స్ విషయంలో 70 లక్షల లంచాన్ని జీవన్ లాల్ డిమాండ్ చేశాడు. చివరికి ఆ వ్యవహారం కాస్త సిబిఐ దాకా వెళ్ళింది. దీంతో సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టి జీవన్ లాల్ ను అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత అతని వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే సిబిఐ అధికారులకు మైండ్ పోయినంత పని అయింది. చివరికి అతడు వసూలు చేసిన లంచాలు.. రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులు.. ఇతర వ్యవహారాలు చూసి అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని.. అసలు సినిమా అంతకుమించి అనే రేంజ్ లో ఉందని సిబిఐ అధికారులు చెబుతున్నారు.. సాధారణంగా అధికారులు లంచాలు వసూలు చేస్తే.. వాటిని పరోక్షంగా వసూలు చేస్తుంటారు. జీవన్ లాల్ మాత్రం వసూలు చేసిన లంచాలను స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ఉపయోగించాడు. పైగా వాటిని తన బినామీ ల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. ఇంకా కొన్ని ఆస్తులునైతే తన భార్య తరఫున బంధువుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని.. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తన వద్ద పెట్టుకున్నాడు. అనధికారికంగా తెలిసిన సమాచారం ప్రకారం జీవన్ లాల్ ఆస్తులు వందల కోట్లల్లో ఉంటాయని తెలుస్తోంది. హైదరాబాద్ మాత్రమే కాకుండా.. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం.. ఇతర ప్రాంతాలలో అతడికి భారీగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. లంచాలకు సంబంధించిన కేసులో ఒక అధికారిని అదుపులోకి తీసుకోవడం సిబిఐ చరిత్రలో తొలిసారి. అయితే లంచాల వ్యవహారంలో జీవన్ లాల్ మాత్రమే ఉన్నాడా.. ఇంకా ఎవరైనా ఉన్నారా.. అనే కోణంలో సిబిఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.