
కాకినాడ, మే 29,
జూన్ 1వ తేదీ నుంచి సినిమా థియేటర్ల బంద్‌కు ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్‌లోని ఓ వర్గం పిలుపునిచ్చింది. దీనిని తెలుగు ఫిల్మ్ చాంబర్ ఖండించింది. థియేటర్ల బంద్‌కు ఎలాంటి అవకాశం లేదని ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఈ విషయం చేరింది. జూన్ 12వ తేదీన 'హర హర వీర మల్లు' సినిమా రిలీజ్‌కు ముందు ఇలాంటి ప్రకటనలు రావడం, దానిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ పోలీసు విచారణకు ఆదేశించడంతో ఇది సంచలనంగా మారింది. ఆ నలుగురు ఇండస్ట్రీ వ్యక్తుల వల్లే ఇదంతా అన్న చర్చ తీవ్రంగా సాగింది. దీనిపై దిల్ రాజు, అల్లు అరవింద్ వంటి సినిమా ప్రముఖులు మాట్లాడారు. అయితే, దీనిపై దిల్ రాజు మాట్లాడుతూ ఈ బంద్‌తో తమకు సంబంధం లేదని, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ జనసేన పార్టీ నేతే కారణమని ప్రెస్‌మీట్‌లో ప్రకటించడం మరింత సంచలనంగా మారింది.జనసేన పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన అత్తి సత్యనారాయణ ఎగ్జిబిటర్ కమ్ డిస్ట్రిబ్యూటర్. 'అను శ్రీ ఫిల్మ్స్' పేరుతో సినిమా డిస్ట్రిబ్యూటర్‌గా అత్తి సత్యనారాయణకు పేరుంది. అంతేకాకుండా, తెలుగు సినీ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కూడాను. రాజమండ్రిలో జేకే క్లాసిక్‌లో జరిగిన సమావేశంలో ఆయన సినిమా బంద్ పిలుపునకు భాగస్వామి అయ్యారన్న వార్తలు బయటకు వచ్చాయి.సినిమా థియేటర్ల బంద్ పిలుపు అనేది ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం వల్ల వచ్చింది. ఈ పిలుపు వెనుక అత్తి సత్యనారాయణ ఉండటం వల్ల తూర్పుగోదావరి జిల్లా పేరును దిల్ రాజు ప్రస్తావించారు. అయితే, ఉభయ గోదావరి జిల్లా విషయానికి వస్తే, ఇక్కడ పెద్ద సంఖ్యలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఉన్నాయి. ఏపీలో దాదాపు వెయ్యి సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఉంటే, అందులో ఉభయ గోదావరి జిల్లాల్లో 50 నుంచి 60 వరకు థియేటర్లు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. టికెట్ల ధరల నియంత్రణ, థియేటర్ల అద్దె విధానం కాకుండా రెవెన్యూ షేరింగ్ విధానం అమలు చేయాలని, కొత్త సినిమాలను ఓటీటీలలో కొంత ఆలస్యంగా విడుదల చేయాలని లేకపోతే థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకమని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఈ డిమాండ్ మొదలై సినిమా హాళ్ల బంద్ వరకు వెళ్లింది. సినిమా రంగానికి సంబంధించి కూడా ఉభయ గోదావరి జిల్లాల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అలా థియేటర్ల బంద్ సమస్య రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. చివరకు ఈ పిలుపుకు వెనుక ఉన్నారన్న కారణంతో జనసేన నాయకుడు అత్తి సత్యనారాయణపై వేటు పడింది.