
విజయవాడ, మే 29,
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఢిల్లీలో పట్టు పోయినట్లు పైకి మాత్రం కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకూ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్ తరచూ ఢిల్లీ వెళ్లేవారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల గురించి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లు కలసి వచ్చేవారు. ఢిల్లీ పెద్దలు కూడా జగన్ ను ఆదరించేవారు. నాడు అధికారంలో ఉన్నప్పుడు అందరితో పరిచయాలు పెంచుకుని కొన్ని ప్రాజెక్టులను కూడా ఏపీకి తేగలిగారు. దీంతో పాటు తనకు నాడు మిధున్ రెడ్డి, విజయసాయిరెడ్డి ఢిల్లీలో ఉండి అన్ని రకాలుగా కొంత సహకారం అందించేవారు. జగన్ ఐదేళ్లలో అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి మోదీని కలిసి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా జగన్ ను ఆప్యాయంగా పలకరించేవారు. దగ్గరకు తీసుకునే వారు. అలాంటి జగన్ గత ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత ఢిల్లీ గడప తొక్కలేదు. ఢిల్లీతో కనెక్షన్ కట్ అయింది. ఎన్నికలకు ముందే బీజేపీతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకోవడంతో ఢిల్లీకి ఉన్న సంబంధాలు దాదాపు తెగిపోయాయి. జగన్ ను ఢిల్లీలో పట్టించుకునే వారే లేరు. అదే సమయంలో ఢిల్లీలో తన పార్టీ తరుపున లాబీయింగ్ చేసే వారు కూడా లేరు. విజయసాయిరెడ్డి కూడా పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఇక ఢిల్లీలో పెద్దలను కలసి మాట్లాడే వారే లేరు. జగన్ నేరుగా వెళ్లి కలిసే పరిస్థితి లేదు. అదే సమయంలో ఢిల్లీ పెద్దలు ఇంకా జగన్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ తోనే ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. జగన్ మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయన్న సమాచారంతో ఢిల్లీ పెద్దలు పెద్దగా జగన్ ను టార్గెట్ చేయడం లేదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుంది. జగన్ కు ప్రజల్లో ఉన్న అభిమానం, గత ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు రావడంతో జగన్ ను సులువుగా వదులుకునేందుకు సిద్ధంగా లేరు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కేంద్ర మంత్రుల వరకూ చంద్రబాబు నాయుడును, పవన్ కల్యాణ్ ను పొగుడుతున్నారు తప్పించి, జగన్ ను మాత్రం పన్నెత్తుమాట అనడం లేదన్న కామెంట్స్ హస్తినలో వినిపిస్తున్నాయి. జగన్ తమకు బయట నుంచి మద్దతు ఇస్తుండటంతో పరోక్షంగా కొంత మేలు చేసే ఉద్దేశ్యంతోనే ఢిల్లీ పెద్దలున్నారని, హాని మాత్రం తలపెట్టరన్న వ్యాఖ్యలు రాజకీయంగా వినిపిస్తున్నాయి. జగన్ కూడా అదే ధైర్యంతో ఉన్నారని తెలిసింది. .. అయితే ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేస్తున్నప్పటికీ అది తూతూ మంత్రమేనంటున్నారు. ఇందులో జగన్ పార్టీని పెద్దగా ఇబ్బందులు పెట్టే అవకాశం లేకపోవచ్చు. కూటమిలోని మిత్ర పక్షాలైన టీడీపీ, జనసేన పార్టీలను సంతృప్తి పర్చడానికే ఈడీ మద్యం కేసులో విచారణను ఈడీ ప్రారంభించిందని, అంతే తప్ప ఈ విషయంలోనూ జగన్ కు పెద్దగా నష్టం జరిగే అవకాశం లేదని అంటున్నారు. ఎందుకంటే జగన్ తో భవిష్యత్ అవసరాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేసే ఛాన్స్ కూడా లేదన్నది విశ్లేషకుల అంచనా. మొత్తం మీద హస్తిన జగన్ పక్కనే ఉందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.