
కడప మే 29,
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీలో సమూల మార్పులు జరగనున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు తిరిగి ఎన్నికయ్యారు ముప్పయి ఏళ్లుగా చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఎన్నికను నిర్వహిస్తుంటారు. 1995లో మొదటి సారి చంద్రబాబు పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఆయన ఇప్పటి వరకూ ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయిన చంద్రబాబుకు పార్టీ నేతలు, మంత్రులు ఎమ్మెల్యేలు శుభాకాంక్షలు తెలిపారు.అదే సమయంలో కడపలో జరిగే మహనాడు నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి లోకేశ్ కు ప్రమోషన్ దక్కనుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఇక పార్టీలో తీసుకునే నిర్ణయాలన్నీ లోకేశ్ తీసుకునే అవకాశముంది. చంద్రబాబు డైరెక్షన్ లో పార్టీ నడిచినప్పటికీ ఆయన సూచనలు, సలహాలు తీసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేయనున్నారు లోకేశ్. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలను చేపట్టి రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ లోకేశ్ వచ్చే ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తారని కూడా తెలిసింది. ఇప్పుడు కాకపోయినా.. మరొకసమయంలోనైనా పార్టీ పగ్గాలు లోకేశ్ కు అప్పగించాల్సిందే. టీడీపీకి తర్వాత వారసుడు లోకేశ్ మాత్రమే. ఆ క్లారిటీ పదేళ్ల ముందే పార్టీలో వినిపించినా కనిపించలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో సూపర్ విక్టరీ తర్వాత లోకేశ్ కు పార్టీ పగ్గాలు అప్పగించాలన్ని నినాదం ఊపందుకుంది. సీనియర్ నేతల నుంచి యువనేతల వరకూ ఒకటే స్లోగన్. లోకేశ్ కు పార్టీలో పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించాలంటూ నేరుగా ప్రకటనలుచేయడం వెనక కూడా చంద్రబాబు ఉన్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడే లోకేశ్ కు పగ్గాలు అప్పగించడం మంచిదన్న అభిప్రాయానికి చంద్రబాబు కూడా వచ్చారు. అందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయనున్నారు.. రానున్న నాలుగేళ్లలో లోకేశ్ క్యాడర్ కు, నేతలకు మరింత దగ్గరయ్యే అవకాశాలను చంద్రబాబు కల్పించనున్నారు. అది పార్టీకి, లోకేశ్ కు కూడా మంచిదే. ఆయన వారితో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉండటంతో పాటు ఆయన టీంతో పార్టీని మరొకసారి అధికారంలోకి తీసుకురాగలిగితే అంతకంటే తండ్రికి కావాల్సింది ఏముంటుంది? అని చంద్రబాబు ఆలోచనగా ఉంది. చంద్రబాబు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం పార్టీ కోసం కేటాయించలేకపోతున్నారు. అధికారులతో సమీక్షలు, సమావేశాలతో పాటు ఢిల్లీ చుట్టూ తిరగడంతో పాటు అనేక ముఖ్యమైన సమస్యలను అమరావతి, పోలవరం వంటివి పరిష్కరించాల్సిన సమయంలో పార్టీ పూర్తి బాధ్యతలను లోకేశ్ కు అప్పగించడం మేలన్న నిర్ణయానికి వచ్చారు. నారా లోకేశ్ ఇప్పటికే క్యాడర్ కు, నేతలకు అందుబాటులో ఉంటున్నారు. వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రత్యేకంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి లేకపోయినా పార్టీ కార్యక్రమాలను గత కొంత కాలంగా ఆయనే చూస్తున్నారు. నిర్ణయాలు కూడా లోకేశ్ తీసుకుంటున్నారు. పదవుల ఎంపికలోనూ లోకేశ్ పాత్ర కీలకమనే చెప్పాలి. క్యాడర్ తో మరింత కనెక్ట్ అయ్యేందుకు కేవలం పేరు వెనక ట్యాగ్ మాత్రమే కానీ లోకేశ్ ఆల్రెడీ క్యాడర్ లోనూ, లీడర్లలోనూ పార్టీ అధినేతగా ముద్ర పడిపోయారు. కాకుంటే శంఖంలో పోస్తే కాని తీర్థం కాదు అన్నట్లుగా లోకేశ్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినట్లయితే ఇక భవిష్యత్ లో పార్టీ చినబాబు చేతుల మీదుగానే నడుస్తుంది. దానికి మహానాడులో స్టాంప్ పడబోతుంది.