
సూర్యాపేట
సూర్యాపేటలో సంచలనం సృష్టించిన పిల్లల అక్రమ రవాణా ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన 13 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నామని, ఇప్పటివరకు 28 మంది చిన్నారులను అక్రమంగా రవాణా చేసినట్లు గుర్తించామని సూర్యాపేట ఎస్పీ నరసింహ మీడియా కు వెల్లడించారు.
ఈ కేసులో పది మంది చిన్నారులను పోలీసులు సురక్షితంగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏడుగురు బాలురు, ముగ్గురు బాలికలు ఉన్నారు. టేకుమట్ల గ్రామంలో అక్రమ దత్తతకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు..పోలీసుల దర్యాప్తులో అబ్బుర పరిచే విషయాలు వెలుగు చూశాయి. సూర్యాపేట పట్టణానికి చెందిన యాదగిరి, ఉమారాణి అనే వ్యక్తులు ఈ ముఠాకు ప్రధాన సూత్రధారులుగా గుర్తించారు. వీరు తమ కోడిగుడ్ల పంపిణీ వృత్తిని అడ్డుపెట్టుకొని, పిల్లలు లేని తల్లిదండ్రుల గురించి తెలుసుకునేవారు. ఆడ, మగ శిశువులను బట్టి రూ. 10 వేల నుంచి రూ. 2 లక్షల వరకు కమిషన్ తీసుకుని, మొత్తం రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షల వరకు బేరం కుదుర్చుకొని అక్రమంగా దత్తత తీసుకున్న పిల్లలను వారికి అందించేవారు. ఈ ముఠాకు మహారాష్ట్ర, గుజరాత్, ముంబయి వంటి రాష్ట్రాలతో కూడా సంబంధాలున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
ముఠాలోని ఏ6, ఏ8, ఏ9, ఏ10, ఏ11 నిందితులపై గతంలో మేడిపల్లి, మునగాల, మంగళగిరి, జనగాం సీఐడీ, ముంబైలలో కూడా ఇలాంటి కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇది వారి నేర చరిత్రను, ఈ దందా ఎంత పెద్ద ఎత్తున సాగుతోందో వెల్లడిస్తోంది. బుధవారం ఉదయం అక్రమ దత్తతలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం మేరకు, అక్రమంగా దత్తత తీసుకున్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని, వారి ఒప్పుకోలు ఆధారంగా ఏ1, ఏ2 లను అరెస్ట్ చేశారు. అదే సమయంలో, శిశువుల అక్రమ రవాణా గురించి చర్చించడానికి ముఠా సభ్యులు సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద ఉన్నారని తెలియడంతో, పోలీసులు అక్కడికి చేరుకుని ఏ3 నుండి ఏ13 వరకు ఉన్న నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ శిశు విక్రయాల ముఠా గుట్టు రట్టయిన తర్వాత, తీగ లాగితే డొంక కదిలిన చందంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పదుల సంఖ్యలో బాధితులు సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు లేక బాధపడుతున్న తల్లిదండ్రుల ఆశను ఆసరాగా చేసుకొని లక్షల రూపాయలు దండుకొని పసికందులను అప్పజెప్పి సొమ్ము చేసుకున్న ఈ ముఠా నిర్వాకం ఇప్పుడు వేలాది మందిని షాక్కు గురిచేసింది.
జువెనైల్ జస్టిస్ (కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్) యాక్ట్, 2015 ప్రకారం, పిల్లలను అక్రమంగా విక్రయించడం లేదా కొనుగోలు చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది.ఈ చట్టం పిల్లల ఉత్తమ ప్రయోజనాలను పరిరక్షించడంపై దృష్టి పెడుతుంది. అలాగే, సరోగసీ (నియంత్రణ) చట్టం, 2021 వంటివి అక్రమ సరోగసీని నిరోధిస్తాయి.
ఈ కేసు అనేక సామాజిక, నైతిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. పిల్లల అక్రమ రవాణాను అడ్డుకోవడానికి, సరైన దత్తత ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉంది. నాలుగు సంవత్సరాలుగా కంటికి రెప్పలా పెంచుకున్న పిల్లలను దూరం చేసుకోవాల్సిన తల్లిదండ్రుల బాధ, అక్రమ రవాణాకు పాల్పడిన వారికి చట్టం విధించే శిక్ష.. ఈ కథలో చివరికి ఎవరు విజేత గా నిలుస్తారు..? ఎవరు బాధితులు? చిన్నారుల భవిష్యత్తు ఏంటి? ఈ దర్యాప్తులో ఇంకెన్ని నిజాలు వెలుగులోకి వస్తాయో.