YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కారుకు కీ దొరికేనా

 కారుకు కీ దొరికేనా

హైదరాబాద్, మే 29, 
మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రస్తుతం బీఆర్ఎస్ లో కీలక నేతగా మారారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మించి హరీశ్ దూసుకు పోతున్నారు. ప్రతి అంశంలో హరీశ్ ముందుంటున్నారు. హరీశ్ జిల్లాల పర్యటనకు వెళుతున్నప్పుడు వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండటం లేదు.అదే ఇప్పుడు గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. వరసగా అనేక జిల్లాల్లో ఆయన పర్యటించి వచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా హరీశ్‌రావు నాయకత్వంపై గులాబీ పార్టీ క్యాడర్‌లో నమ్మకం పెరుగుతుంది. పార్టీ ఓటమి చెందినా ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా కార్యకర్తలకు అండగా ఉండే మాస్ లీడర్ గా హరీశ్ రావు గుర్తింపు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెచ్చుకున్నట్లుంది. ట్రబుల్ షూటర్ గా కూడా మారారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఆయన కేవలం మంత్రిగానే ఉన్నారు. అప్పుడు పాలన అంతా కేసీఆర్, కేటీఆర్ చేతుల్లోనే నడిచేది. ఇక ఎన్నికల సమయంలో టిక్కెట్లను ఖరారు చేసే సమయంలో కూడా మామ కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు ప్రతిపాదనలను పెద్దగా పట్టించుకోలేదన్నారు. అంతా కేసీఆర్, కేటీఆర్ ఇష్టారాజ్యంగానే టిక్కెట్ల కేటాయింపు జరిగింది. ఇక రాజ్యసభ, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలోనూ హరీశ్‌రావు జోక్యం అనేది ఏమాత్రం తొమ్మిదేళ్ల పాటు జరగలేదు. దీంతో హరీశ్‌రావు తనకు అత్యంత సన్నిహితులు, అనుచరులకు కూడా ఆయన నామినేటెడ్ పదవులు కూడా ఇప్పించుకోలేకపోయారంటారు.ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ను నియమించినప్పుడు కూడా హరీశ్‌రావు ఒకింత అసంతృప్తికి గురయ్యారని చెబుతారు. అందుకే కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్లి మరీ కలసి బావతో మాట్లాడి వచ్చారని చెబుతారు. హరీశ్‌రావు గులాబీ పార్టీకి పెద్ద ఎస్సెట్. అందులో ఏమాత్రం సందేహం లేదు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి మామ కేసీఆర్ వెన్నంటి ఉంటూ ఆయన చెప్పిన పని చేస్తూ వచ్చిన హరీశ్ రావు తర్వాత మంత్రివర్గంలో చేరినా పెద్దగా పాలనలో జోక్యం లేకుండా చేశారన్న ఆరోపణలున్నాయి. అలాగే పార్టీపై ఆయనకు పట్టు పెంచే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ లో ఆయనకు కీలక పదవి ఏమీ లభించకపోవడమే ఇందుకు కారణం. కానీ హరీశ్‌రావు కేసీఆర్ నాయకత్వాన్ని ఎన్నడూ వ్యతిరేకించలేదు. అధికారం కోల్పోయిన తర్వాత హరీశ్‌రావు మరింతగా పాపులర్ అవుతున్నారు. తాజాగా కవిత ఎపిసోడ్ తర్వాత హరీశ్ రావుకు మరింతగా పార్టీ అధినాయకత్వంలో నమ్మకం పెరిగింది. దాదాపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి హరీశ్ రావు సమావేశమవుతున్నారు. కేవలం కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యే అంశాలు మాత్రమే కాకుండా రాష్ట్ర రాజకీయ పరిస్థితులను గురించి కూడా చర్చిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడుతూ హరీశ్ రావు బీఆర్ఎస్‌లో ఏ ఘటన జరిగినా హరీశ్ ముందుంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్‌లను మించి మరింత పదునుగా విమర్శలు ప్రభుత్వంపై చేస్తుండటంతో కారు పార్టీలో హరీశ్ కు ఫ్యాన్స్ మరింత పెరుగుతున్నారు.

Related Posts