YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కవిత పార్టీ లెక్కంటో..

కవిత పార్టీ లెక్కంటో..

నిజామాబాద్, మే 29, 
ఇప్పటి సోషల్ మీడియా కాలంలో నిజాలు ఎవరికీ అక్కరలేదు. ప్రచారంలో ఉంటే సరిపోతుంది. అది నిజమా? అబద్దమా? అనేది తర్వాత సంగతి.. కాకపోతే కాస్తలో పొగ వస్తే చాలు మంట పెట్టడానికి చాలామంది ఉంటారు. పార్లమెంట్ ఎన్నికల్లో కల్వకుంట్ల కవిత ఓడిపోయారు అనేది వాస్తవం. ఆ తర్వాత కుమార్తెకు గులాబీ సుప్రీం ఎమ్మెల్సీ స్థానాన్ని కట్టబెట్టారు అనేది కూడా నిజమే. కానీ ఎప్పుడైతే పార్టీలో ఆమె ప్రభావం తగ్గిందో అప్పటినుంచి ఏదో జరిగిపోతోంది అన్నట్టుగా వార్తలు రావడం మొదలైంది. కాకపోతే ఎప్పటికప్పుడు వీటికి గులాబీ బాస్ చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు. హరీష్ రావు పార్టీకి దూరంగా ఉన్నారని.. పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారని.. కొద్దిరోజులు ప్రచారం జరిగింది. ఆ తర్వాత గులాబీ సుప్రీం దగ్గర నుంచి పిలుపు రావడంతో ఒకసారి గా ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత కల్వకుంట్ల తారక రామారావు కాబోయే ముఖ్యమంత్రి అని.. మరికొద్ది రోజుల్లోనే పట్టాభిషేకమని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత అది కూడా ఆ వాస్తవమని తేలిపోయింది. ఇక ఇప్పుడు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీకి సంబంధించి  రోజుకో తీరుగా వార్తలు వస్తున్నాయి. గులాబీ సుప్రీంకు కల్వకుంట్ల కవిత లేఖలు రాశారు అనేది వాస్తవం. అందులో కొన్ని విషయాలను ప్రస్తావించారనేది కూడా నిజం. కాకపోతే ఈ లేఖల వ్యవహారం గతంలో ఎప్పుడు బయటికి రాలేదు. అంతర్గత వ్యవహారం బయటికి రావడం.. కల్వకుంట్ల కవిత తన తండ్రిని దేవుడిగా.. చుట్టూ ఉన్నవారిని దయ్యాలుగా అభివర్ణించడం కాస్త చర్చకి దారి తీసింది. మరుసటి రోజు ఆమె సోదరుడు.. కారు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి హోదాలో విలేకరుల సమావేశం నిర్వహించడం.. పార్టీలోని అంతగత విషయాలు బయటకు చెప్పడం కరెక్ట్ కాదని హెచ్చరించడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇక ఈ పరిణామాలకు తగ్గట్టుగానే రకరకాల వార్తలను కొన్ని పత్రికలు రాయటం.. సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ రకరకాల ప్రచారం చేయడంతో తెలంగాణ రాజకీయాలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కవిత సొంత పార్టీ ఏర్పాటు సంబంధించిన విషయం కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాలలో సంచలనం సృష్టిస్తోంది. దీంతో అసలు విషయాలు పక్కదారి పడుతున్నాయి. కవిత ఇంటికి పార్టీ ఎంపీ ఒకరు వెళ్ళటం.. తన తండ్రి దూతగా అతడు కల్వకుంట్ల కవితతో చర్చలు జరపడం.. వంటి పరిణామల తర్వాత కవిత కొత్త పార్టీ ఏర్పాటు చేయబోరని.. తండ్రి చాటున రాజకీయాలు చేస్తారని ఓ వర్గం మీడియా రాసింది.. ఇవి ఇలా ఉండగానే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని మరో బాంబులాంటి వార్త తెలుగు మీడియాలో సంచలనం సృష్టించింది. అయితే దీనిని కవిత ఖండించారు. అయితే ఇలాంటి వార్తలు లీకులు ఇస్తే తప్ప రాసే అవకాశం లేదని.. ఇలానే లీకులు ఇచ్చుకుంటూ పోతే రాజకీయ మనగడే ప్రమాదంలో పడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.. కల్వకుంట్ల కవితకు రాజకీయ పార్టీ పెట్టుకునే అధికారం ఉందని.. కాకపోతే ఇలా లీకులు ఇచ్చుకుంటూ వెళ్తే ప్రమాదం ఏర్పడుతుందని.. అది అంతిమంగా గులాబీ సుప్రీం కుమార్తెకు నష్టం చేకూర్చుతుందని కొంతమంది వాదిస్తున్నారు.

Related Posts