
విజయవాడ, జూన్4,
వంగవీటి రాధాకృష్ణ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రయత్నించిందా? ఆయనకు ఆహ్వానం పంపిందా? పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. రెండు ప్రధాన సామాజిక వర్గాలతో పాటు వెనుకబడిన తరగతులు వారు సైతం టిడిపి కూటమికి జై కొట్టారు. ఆపై జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం సైతం సైలెంట్ అయింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయం తప్పలేదు. అయితే ఇప్పుడు సామాజిక వర్గాల లెక్కలు కట్టుకొని పార్టీని బలోపేతం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే వంగవీటి రాధాకృష్ణకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపినట్లు సమాచారం.2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా వంగవీటి రాధాకృష్ణకు ప్రత్యేక ఆహ్వానం వచ్చింది. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ మధ్యవర్తిత్వం వహించారు. వంగవీటి రాధా తో ఉన్న స్నేహంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ అందుకు వంగవీటి రాధాకృష్ణ అంగీకరించలేదు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగారు. కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. టిడిపి కూటమి అధికారంలోకి రావడంతో వంగవీటి రాధాకృష్ణకు నామినేటెడ్ పదవి గ్యారెంటీ అని అంతా భావించారు. అయితే ఏడాది అవుతున్నా వంగవీటి రాధాకృష్ణకు పదవి లభించలేదు. దీంతో ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ఆయనకు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగవీటి రాధాకృష్ణ. 2003లో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఆ సమయంలో వంగవీటి మోహన్ రంగా కుమారుడు రాధాకృష్ణను చూశారు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. విజయవాడ సిటీ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 2004లో తొలిసారిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2009లో రాజశేఖర్ రెడ్డి వద్దని చెప్పినా రాధాకృష్ణ ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ కూడా ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆశించిన టికెట్ ఇవ్వకపోవడంతో టిడిపిలో చేరారు. ఆ పార్టీ ఓడిపోయిన అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు. మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు నామినేటెడ్ పదవి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.మొన్నటికి మొన్న టిడిపి మహానాడుజరిగిన సంగతి తెలిసిందే. అయితే మహానాడు కార్యక్రమంలో వంగవీటి రాధాకృష్ణ కనిపించలేదు. దీంతో ఆయనకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. పార్టీలోకి ఆహ్వానించగా ముఖం మీదే ఆయన నో చెప్పారట. ఇప్పటికే వంగవీటి రాధాకృష్ణకు చంద్రబాబు నుంచి భారీ ఆఫర్ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మొన్న ఆ మధ్యన రాధాకృష్ణకు అనారోగ్యం కావడంతో యువనేత లోకేష్ పరామర్శించారు కూడా. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడారు. ఆలస్యం అయినా వెయిట్ చేయాలని.. నీకు తగ్గ పదవి ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం. అందుకే చంద్రబాబు పై ఉన్న నమ్మకంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పదేపదే ఆహ్వానిస్తున్నా అటువైపు రాధాకృష్ణ చూడడం లేదు. మొత్తానికి అయితే వంగవీటి రాధాకృష్ణ కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం లేదన్నమాట.